ఆ టోల్‌ప్లాజాలో అందరూ మహిళలే..

టోల్‌ ప్లాజా దగ్గర కార్ల రద్దీ ఎంతగా ఉంటుందో తెలుసుగా! అక్కడ పని చేసేవారు ఏమాత్రం వేగం తగ్గించినా వాహనాల క్యూ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది.

Updated : 07 Mar 2023 00:25 IST

టోల్‌ ప్లాజా దగ్గర కార్ల రద్దీ ఎంతగా ఉంటుందో తెలుసుగా! అక్కడ పని చేసేవారు ఏమాత్రం వేగం తగ్గించినా వాహనాల క్యూ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. అలాంటి చోట్ల అమ్మాయిలు పనిచేయడం ఎప్పుడైనా చూశారా? తిరుపతి జిల్లాలోని గాదంకి టోల్‌ప్లాజాకి వెళ్తే ఇటువంటి దృశ్యమే కనిపిస్తుంది..

పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై సి.మల్లవరం నుంచి కుక్కలపల్లి వరకు నిర్మించిన ఆరు వరసల రహదారికి గాదంకి సమీపంలో టోల్‌ప్లాజాను ఏర్పాటు చేశారు. ఇక్కడ 10 కౌంటర్లు ఉంటాయి. వీటిలో 11 మంది మహిళలు టోల్‌ వసూలు చేస్తుండగా వారిలో ఎవరికైనా ఇబ్బంది కలిగినపుడు ఆ స్థానంలో విధులు నిర్వహించేందుకు మరో ముగ్గురు అందుబాటులో ఉంటున్నారు. పాకాల, చంద్రగిరి మండలాలకు చెందిన 11 మంది మహిళలు ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు. వాహనాలకు ఏర్పాటు చేసిన ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేసి శరవేగంగా టోల్‌ వసూలు చేయడంలో ఈ మహిళలు ముందుంటున్నారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కౌంటర్లలో విధులు నిర్వహిస్తూ ఆ తరువాత ఇళ్లకు వెళుతున్నారు. పట్టపగలు కూడా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ వచ్చే డ్రైవర్లతో గొడవలు జరుగుతున్నా కౌంటర్లలోని మహిళలు ఏ మాత్రం తగ్గకుండా ఎంతటి వారైనా సరే టోల్‌ కట్టిన తరువాతే వాహనాన్ని ముందుకు పంపుతున్నారు. ‘మొదట్లో భయపడినా ఆ తర్వాత ధైర్యం వచ్చింది. అప్పగించిన విధులు సక్రమంగా నిర్వహిస్తే ఎందుకు భయపడాలన్న ఆత్మస్థైర్యం నింపుకొన్నా’ అంటోంది రవణప్పగారిపల్లెకు చెందిన లిఖిత. ‘అందరినీ గౌరవించి టోల్‌ వసూలు చేయడమే మా పని. కొంత మంది టోల్‌ కట్టకుండా గొడవకు దిగుతుంటారు. అలాంటప్పుడు భయపడితే అందరూ అలాగే జారుకుంటారు. అందుకే కఠినంగా ఉంటూ  వసూలు చేస్తాం’ అంటోంది పాకాలకి చెందిన సమియా!

 - ఆచారి జానకీరామాచారి, చంద్రగిరి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్