బెల్లంతో కోట్ల వ్యాపారం

నవనూర్‌ ఐఐఎం ఘజియాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. కొన్నాళ్లు కార్పొరేట్‌ రంగంలో సేల్స్‌ అధికారిగా పనిచేశారు. మొదటి నుంచీ సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచనలతో పాటూ...రోజు రోజుకీ పెరుగుతోన్న బెల్లం వినియోగం నవనూర్‌ని వ్యాపారం దిశగా నడిపించాయి. ‘ఏళ్లుగా మనదేశంలో బెల్లం మార్కెట్‌లో పెద్దగా మార్పులు లేవు.

Updated : 16 Mar 2023 03:16 IST

రక్తహీనత తగ్గాలన్నా, పోషక లేమిని పూరించాలన్నా.. బెల్లాన్ని మించిన మందు లేదంటారు. అందుకే ఈమధ్య చాలామంది చక్కెరకు బదులు బెల్లాన్ని వాడుతున్నారు. అలాంటి వారిలో లూథియానాకు చెందిన 27 ఏళ్ల నవనూర్‌ కౌర్‌ కుటుంబం కూడా ఒకటి. కేవలం తమ అలవాట్లని మార్చుకోవడమే కాదు... ప్రజలకూ ఈ ఉత్పత్తులను అందించాలనుకుంది నవనూర్‌. అందుకే సొంత బెల్లం బ్రాండ్‌తో మార్కెట్‌లోకి దిగింది. కోట్లరూపాయల్ని కూడబెడుతోంది..

వనూర్‌ ఐఐఎం ఘజియాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. కొన్నాళ్లు కార్పొరేట్‌ రంగంలో సేల్స్‌ అధికారిగా పనిచేశారు. మొదటి నుంచీ సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచనలతో పాటూ...రోజు రోజుకీ పెరుగుతోన్న బెల్లం వినియోగం నవనూర్‌ని వ్యాపారం దిశగా నడిపించాయి. ‘ఏళ్లుగా మనదేశంలో బెల్లం మార్కెట్‌లో పెద్దగా మార్పులు లేవు. ముఖ్యంగా ఈ రంగంలో సరైన ఆవిష్కరణలు, బ్రాండ్‌లు లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఆ ఉత్సుకతే నన్ను ఇటువైపునకు లాక్కొచ్చింది’ అంటారు నవనూర్‌. వ్యాపారం మొదలుపెట్టడానికి ముందు కొంత పరిశోధన చేశారు. అందులో బెల్లం ఎక్కువకాలం నిల్వ ఉండదన్న విషయం తెలిసింది. ఒక్కో పదార్థంతో కలిసినప్పుడు ఒక్కో రుచి వస్తుందని అర్థమైంది. వీటన్నింటినీ గమనించాక రుచిలోనూ, నాణ్యతలోనూ, పోషకాలను అందుకోవడంలోనూ ఏమాత్రం తగ్గకుండా దీన్ని ఓ బ్రాండ్‌గా తీసుకురావాలని నిర్ణయించుకున్నారామె.

ప్రయోగాలెన్నో...  చెరకుని సేకరించి ఇంట్లోనే ప్రయోగాలు మొదలుపెట్టారు. మొదట దాదాపు పదహేను రకాల బెల్లం ఉత్పత్తులు తయారు చేస్తే నాలుగింటిని మాత్రమే ఫైనల్‌ చేశారు. వీటిని తయారు చేసేందుకు సేంద్రియ చెరకు, వీటి తయారీకోసం తగిన స్థలం వెతికేటప్పుడే వ్యవసాయంలో డిగ్రీ చేసిన కౌశల్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి 2021లో ‘జాగర్‌ కేన్‌’ పేరుతో బెల్లాన్ని తీసుకొచ్చారు. బెల్లాన్ని ఉపయోగించి కొబ్బరి, నట్స్‌, సీడ్స్‌ వంటివాటితో స్వీట్లూ, పొడి...వంటివెన్నో అందుబాటులోకి తెచ్చారు. అయితే, వీరి ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే ముందు వినియోగదారులకు వాటి రుచి చూపించాలనుకున్నారు. ఇందుకోసం లూథియానాలో మోడల్‌ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ‘అలా ఇక్కడికి వచ్చే వారి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని నాణ్యతను మరింతగా మెరుగుపరుచుకుని మార్కెట్‌లోకి వచ్చా. ప్రారంభించిన ఏడాదిలోనే 2021లో రెండు కోట్ల రూపాయల వ్యాపారం చేయగలిగా. కొన్ని రోజులకే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో వ్యాపారంపై దృష్టిపెట్టా’నంటారు నవనూర్‌.

రైతులకు అండగా... నవనూర్‌ సహజ పద్ధతుల్లో చెరకు సాగుని ప్రోత్సహిస్తోంది. నేల సారం ఎలా ఉంది? పీహెచ్‌ స్థాయులు ఎలా ఉన్నాయి? వంటి విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు చెబుతూ అండగా నిలుస్తోంది. వారి నుంచి సేంద్రియ చెరకుని సేకరిస్తోంది.  ‘సాధారణంగా మన దేశంలో రిఫైన్డ్‌ షుగర్‌ కర్మాగారాల కోసం మాత్రమే చెరకుని పండిస్తారు. దీన్ని విడిగా బెల్లంకోసం ఉత్పత్తి చేయడానికి ఇష్టపడరు. అందుకే వారికి కనీస మద్దతు ధరకు పదిశాతం ఎక్కువగా చెల్లించి చెరకును సేకరిస్తున్నాం’ అంటారు నవనూర్‌. లూథియానాలోని 22 రైతునెట్‌వర్క్‌లతో పనిచేస్తోన్న జాగర్‌కేన్‌ సంస్థ  200 ఎకరాల చెరకు పంటను సేకరిస్తుంది. మరో 110 ఎకరాల ఒప్పంద వ్యవసాయాన్ని సిద్ధం చేసింది. తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగానే కాదు... కెనడా, సింగపూర్‌, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలకు  రెండు లక్షల కిలోలకు పైగా ఎగుమతి చేసింది. సల్లాపూర్‌లో ఉన్న ఈ కర్మాగారం చుట్టుపక్కల పదుల సంఖ్యలో మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్