అందంగా లేవన్నారా?

కోట్లమంది అభిమానులున్న ప్రియాంక చోప్రా, సెలెనా గోమెజ్‌ వంటి తారలూ ఈ మాట అనిపించుకున్నారు. ఇక మనమెంత? వాళ్లంటే తారలు అంటారా? పోనీ మీ శరీరాన్ని చూసుకొని మీరెప్పుడు పొగుడుకున్నారు? అదేంటి అని ఆశ్చర్యపోకండి.

Published : 19 Mar 2023 00:11 IST

కోట్లమంది అభిమానులున్న ప్రియాంక చోప్రా, సెలెనా గోమెజ్‌ వంటి తారలూ ఈ మాట అనిపించుకున్నారు. ఇక మనమెంత? వాళ్లంటే తారలు అంటారా? పోనీ మీ శరీరాన్ని చూసుకొని మీరెప్పుడు పొగుడుకున్నారు? అదేంటి అని ఆశ్చర్యపోకండి. మీలోని సానుకూలతను చూడాల్సింది ముందు మీరే అంటున్నారు నిపుణులు. ఇంకా..

* మీరు అంటే మీ రూపురేఖలే కాదు. మీ బలాలు, బలహీనతలు, సానుకూలతలు, ప్రతికూలతలు అన్నీ! దానిలో శరీరం ఒక భాగం మాత్రమే. ఎవరి మాటైనా బాధించిందనుకోండి.. ‘నాలో నాకు నచ్చే అంశాలేంటి? నా ప్రత్యేకతలేంటి’ అని ఆలోచించండి. వాటిముందు ఎదుటివారి మాట చిన్నదనిపిస్తుంది.

* ముఖం తీరు, రంగు.. వంటివి మార్చలేం. కాబట్టి పట్టించుకోవద్దు. బరువే సమస్యా? అయితే కొన్ని ఫిట్‌నెస్‌ లక్ష్యాలు పెట్టుకోండి. ఇక్కడా మీ ఆరోగ్యమే ప్రధాన్య లక్ష్యమవ్వాలి. కాబట్టి మరీ శరీరాన్ని కష్టపెట్టక ఆరోగ్యకరమైన ఆహారం, రోజూ తప్పనిసరిగా వర్కవుట్లు చేయడంపై దృష్టిపెట్టండి. ఆరోగ్యంగా కనిపించడమూ అందమే!

* ‘కొంచెం వ్యాయామం చేయొచ్చుగా.. తిండి తగ్గించొచ్చుగా..’ సలహాల్లానే ఉంటాయి. కానీ.. వినేవారికే అవెంత బాధపెడతాయో తెలిసేది. అలాగని ఊరుకుంటే అవతలి వాళ్లకు తెలిసేదెలా? కాబట్టి, వాళ్ల మాటలు మిమ్మల్ని ఎంత బాధపెడుతున్నాయో, ఆ మాట అనిపించుకోకుండా ఉండటానికి మీరెంత ప్రయత్నిస్తున్నారో చెప్పండి. మరొకరికైనా అలాంటి బాధ తప్పుతుంది.

* మీలోని నెగెటివ్‌ అంశాలను చెప్పినంత మాత్రాన అందరూ శత్రువులే అనుకోవాల్సిన పనిలేదు. కానీ ఎంతసేపూ మీలోని ప్రతికూలతలే కనిపిస్తున్నాయంటే వాళ్లకి దూరంగా ఉండటమే మేలు. మీ సానుకూలతలు గుర్తుచేస్తూ.. మీ మంచి కోసం మారమని చెప్పేవారే స్నేహితులు. వాళ్ల మాటను మాత్రం అనుసరిస్తే చాలు.

* వాళ్లు అన్నారు.. వీళ్లు అన్నారని బాధపడేముందు ఒకటి ఆలోచించండి. ఆ మాటలు అంతలా బాధ పెడుతున్నాయంటే వాళ్లతో మీరూ ఏకీభవిస్తున్నట్టేగా! ముందు ఆ ధోరణి మార్చుకోండి. మీకు మీరే పట్టించుకోవద్దు అని గట్టిగా చెప్పుకోండి. కొద్దికాలానికి అవేవీ మీపై ప్రభావం చూపలేకపోవడం మీరే గమనిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్