అప్పుడు వినాయకుడి గురించి చెబుతా!

కాస్త బొద్దుగా ఉన్నవాళ్లని చూస్తే నోటికొచ్చిన జోకులు వేస్తారు. అది వాళ్లకి తాత్కాలిక ఆనందాన్నివ్వొచ్చు..  మరి ఆ మాట అనిపించుకున్నవాళ్ల సంగతేంటి? వాటికి బాధపడి వెనక్కి తగ్గితే నేనిక్కడ ఉండేదాన్నే కాదు అంటోంది 26 ఏళ్ల సాయి వైష్ణవి.

Published : 02 Apr 2023 00:26 IST

కాస్త బొద్దుగా ఉన్నవాళ్లని చూస్తే నోటికొచ్చిన జోకులు వేస్తారు. అది వాళ్లకి తాత్కాలిక ఆనందాన్నివ్వొచ్చు..  మరి ఆ మాట అనిపించుకున్నవాళ్ల సంగతేంటి? వాటికి బాధపడి వెనక్కి తగ్గితే నేనిక్కడ ఉండేదాన్నే కాదు అంటోంది 26 ఏళ్ల సాయి వైష్ణవి. గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న ఈ అమ్మాయి ప్రయాణం నవతరానికి స్ఫూర్తిదాయకం.. 

మూన్‌ షైన్‌, రాంబో ది లాస్ట్‌ బ్లడ్‌, పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌, క్రిస్టఫర్‌ రాబిన్‌తోపాటు అనేక హాలీవుడ్‌ చిత్రాలకు గాత్రదానం చేసింది సాయివైష్ణవి. తెలుగులో క్రిమినల్‌ జస్టిస్‌, హక్సే వంటి వెబ్‌సిరీస్‌లకూ డబ్బింగ్‌ చెప్పింది. 2015 నుంచి విజయవాడ ఆల్‌ఇండియా రేడియో ఎఫ్‌ఎం రెయిన్‌బోలో ఆర్జే తను. పాడ్‌కాస్టింగ్‌ కూడా చేస్తోంది. సంగీత దర్శకుడు రఘుకుంచె అందించిన అవకాశంతో లేడీస్‌ అండ్‌ జెంటిల్మన్‌ సినిమాతో మొదలుపెట్టి గాయనిగానూ గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే ఈ విజయాలన్నీ ఆమెకంత తేలిగ్గా రాలేదు. లావుగా ఉన్నావ్‌.. రంగు తక్కువ వంటి విమర్శలని ధైర్యంగా ఎదుర్కొంటే దక్కిన ఫలమిది. ‘మాది విజయవాడలోని సత్యనారాయణపురం. నాన్న మేడేపల్లి వెంకటేశ్వర ప్రసాద్‌ రామకృష్ణ మిషన్‌లో అకౌంట్స్‌ మేనేజర్‌. అమ్మ గీత. మా కుటుంబానికి తరతరాలుగా సంగీతంతో అనుబంధం ఉంది. అమ్మ తరఫు తాత డాక్టర్‌ జీవీ భరద్వాజ వీణా విద్వాంసులు. అమ్మమ్మ సుధ ఆల్‌ ఇండియా రేడియోలో లలిత సంగీతం పాడేవారు. నాన్న ఐదు వాద్యాలు వాయిస్తారు. అలా మూడేళ్ల వయసు నుంచీ డ్యాన్స్‌తోపాటు పాటలు, సంగీతాన్నే లోకంగా చేసుకున్నా.

ఎన్నెన్నో విజయాలు..

ఏడో తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి జీ తెలుగు సరిగమప లిటిల్‌ ఛాంప్‌లో రియాలిటీ షోలో పాల్గొన్నా. ఆ తర్వాత పలు టీవీ ఛానెళ్లలో, సంగీత కార్యక్రమాల్లో అవకాశాలు అందుకొని విజేతగా నిలిచా.  వెయ్యికిపైగా బహుమతులు, అవార్డులూ అందుకున్నా. విజయవాడ ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో శాస్త్రీయ సంగీతంలో నాలుగేళ్ల సర్టిఫికెట్‌ కోర్సు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రెండేళ్ల డిప్లొమా పూర్తిచేశా. నా గురువులు మందా కృష్ణమోహన్‌, బుచ్చాచార్యులు.

ప్రతిభను గుర్తించి..

పోటీల్లో ప్రతిభకు పెద్దపీట ఉంటుంది. వేదికపై మనమెంత అందంగా.. చక్కగా కనిపిస్తున్నామనేది ఒక అంశం మాత్రమే. కానీ అదే ప్రధానాంశం కాదు. బరువు, రంగు భిన్నంగా ఉంటే చాలు. వీళ్లిలా ఉన్నారేంటి. వీళ్లు పాడగలరా అన్నట్టు చూస్తారు. నాకూ అదే పరిస్థితి ఎదురైంది. మొదట్లో సన్నగానే ఉన్నా తర్వాత అనారోగ్య కారణాలతో బరువు పెరిగా. దాంతో ‘అందంగా లేదు. అంత లావుందేంటి? రంగు తక్కువంటూ’.. నాపై విమర్శలు. కొత్తలో చాలా బాధపడేదాన్ని. ఆ తర్వాత వీళ్లెవరూ మనల్ని పోషించరు కదా. ఇటువంటివారి కోసం మనం బతకడం లేదు. అలాంటప్పుడు పట్టించుకోవడం ఎందుకు? మంచి గొంతు ఉంది. నన్ను నేను నిరూపించుకొనే అవకాశాన్ని అందుకోవాలి. మన ప్రతిభను గుర్తించేవాళ్లూ ఉన్నారని మరవకూడదనుకున్నా. బాడీ షేమింగ్‌పై నాతో ఎవరైనా వ్యాఖ్యానిస్తే సకల కళలకీ, విద్య, విజయాలకు అధిపతైన విఘ్నేశ్వరుడిని ఉదాహరణగా చెప్పి, అక్కడి నుంచి నవ్వుకుంటూ వచ్చేస్తా. ప్రస్తుతం ‘ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో గోల్డెన్‌ టికెట్‌ తీసుకుని థియేటర్‌ రౌండ్‌కెళ్లాం. ‘డబ్బింగ్‌లో డీజే..  చాటింగ్‌లో ఆర్జే.. వైష్ణవీ ఓ వైష్ణవీ నువ్వు నడిచివచ్చే కాన్ఫిడెన్స్‌వి’ అంటూ బాలకృష్ణగారు పొగిడిన సందర్భం నేనెప్పుడూ మరిచిపోలేను’ అంటోంది సాయి వైష్ణవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్