నల్లటి ఛాయ నాకే ఎందుకు అనుకుందట!

ఆడపిల్ల కదా కాస్త రంగు ఉంటే బాగుండును... అన్నారు కొందరు. నల్లగా ఉంటే పెళ్లవడం కష్టమన్నారు ఇంకొందరు. తోటి తెల్లవాళ్లేమో నల్లజాతీయురాలివని హేళన చేసేవారు.

Published : 05 Apr 2023 00:03 IST

ఆడపిల్ల కదా కాస్త రంగు ఉంటే బాగుండును... అన్నారు కొందరు. నల్లగా ఉంటే పెళ్లవడం కష్టమన్నారు ఇంకొందరు. తోటి తెల్లవాళ్లేమో నల్లజాతీయురాలివని హేళన చేసేవారు. అందుకే ఓ సమయంలో వారిలా మారిపోవాలనుకుంది. బ్రిటిషర్లను అనుకరించాలనుకుంది. అయితే, ఇప్పుడు వాళ్లే ఆమె ప్రతిభ చూసి శభాష్‌ అంటున్నారు. నటిగా గుర్తించి జేజేలు పలుకుతున్నారు. ఆమెవరంటారా?  భారతీయ-బ్రిటిష్‌ నటి చరిత్ర సూర్యచంద్రన్‌.

రిత్ర సూర్య చంద్రన్‌.. స్వస్థలం తమిళనాడు. తండ్రి పళని చామి చంద్రన్‌, తల్లి శాంతి ఇద్దరూ యూకేలో వైద్యులు. తన చిన్నప్పుడే వాళ్లిద్దరూ విడాకులు తీసుకోవడంతో ఆమె కొన్నాళ్లు ఇండియాలోని నానమ్మ తాతయ్యల దగ్గర పెరిగింది. తర్వాత తండ్రితో పాటూ యూకేకి చేరింది. చరిత్రకు చిన్నప్పటి నుంచీ నటనమీద ఆసక్తి ఎక్కువ. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు థియేటర్‌, ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌లో పాల్గొంది. కానీ, తల్లిదండ్రులకేమో అది ఇష్టం లేదు. కూతురు ఉన్నత చదువులపై దృష్టిపెట్టాలని కోరుకున్నారు. చరిత్ర చదువులో ఏ మాత్రం తగ్గనంటూ...తన అభిరుచికీ కొంత సమయం కేటాయించుకుంది. చదువయ్యాక ప్రపంచంలోని మూడు అతిపెద్ద, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మేనేజ్‌మెంట్‌-కన్సల్టెన్సీ సంస్థలలో ఒకటైన బీసీజీలో ఉద్యోగం వచ్చినా... యాక్టింగ్‌ వైపు మనసు మళ్లించుకుంది. 

కెరియర్‌ ఇలా...

చరిత్ర... అమెజాన్‌ స్పై థ్రిల్లర్‌ సిరీస్‌ అలెక్స్‌ రైడర్‌ (2021) సబీనా ప్లెసన్స్‌గా, నెట్‌ఫ్లిక్స్‌ పీరియడ్‌ డ్రామా బ్రిడ్జర్టన్‌ (2022)లో ఎడ్వినా శర్మగా నటించింది. ఈ పాత్రల్లో...ఆమె నటనకు ఎనలేని గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ఎడ్వినా పాత్రకు...‘డైమండ్‌ ఆఫ్‌ ద సీజన్‌’ కిరీటాన్ని అందుకుంది. తర్వాత ‘హౌటూడేట్‌ బిల్లీ వాష్‌’ చిత్రంలో నటించింది. అది పలు టీవీషోలకూ, శామ్‌సంగ్‌ రైజింగ్‌ అవార్డుని అందుకునేలా చేసింది. చరిత్ర భారతీయ మూలాల్ని, దక్షిణాసియా మహిళల ప్రాతినిధ్యాన్ని ఈ వేదికల మీద బలంగా కనిపించేలా చేసింది. పలు వెబ్‌సిరీస్‌లూ, డాక్యుమెంటరీలూ, కథలకు గాత్రదానమూ చేసింది. జాతి వివక్ష బలంగా ఉండే చోట...సరికొత్త కథలు, వినూత్నమైన పాత్రలతో ఆ దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకోవడం చిన్నవిషయం ఏమీ కాదు. దీని వెనుక చాలా కష్టం, ఎంతో మానసిక వ్యధ ఉన్నాయంటోందామె. సాధారణంగా సినీ పరిశ్రమలో అందానికే మొదటి ప్రాధాన్యం. ‘నాది సైజ్‌ జీరో కాదు...ఆరడుగులూ లేను. రంగు విషయం అసలే చెప్పక్కర్లేదు. ఈ రంగంలోకి రావాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ అంశాలన్నీ నాకు ప్రతికూలమవుతాయని అడుగు ముందుకు వేయడానికి కొంత తటపటాయించాను. కానీ, ఇష్టంగా ఏ పని చేసినా దాంట్లో గెలుపు సాధ్యమే అన్న అమ్మ మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి’ని చెబుతోంది చరిత్ర.

వాళ్లతో పోల్చుకున్నా...

జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కఠిన దశల్ని దాటాల్సి వస్తుంది. టీనేజ్‌లో ఉండగానే అలాంటి ఇబ్బందుల్ని చూశా అంటోంది చరిత్ర. ‘గెలుపు ఎప్పుడూ అంత సులువుగా రాదు. మనల్ని మనం ప్రేమించుకుంటేనే ...విజేతలుగా నిలబడగలం. పదమూడేళ్ల వయసులో నా రంగు, సంస్కృతి, అలవాట్ల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. తోటివారితో పోల్చుకునేదాన్ని. వారిలా ఉండటానికి ప్రయత్నించేదాన్ని.  నల్లటి ఛాయ నాకే ఎందుకని బాధపడిపోయేదాన్ని. అయితే నా ఆలోచన తప్పనీ మనల్ని మనం ప్రేమించుకుంటేనే విజయాలు సాధించగలమనీ ర్యాపర్‌ మాహేని చూశాకే తెలిసింది. ఆమె కూడా నాలాగే తమిళమ్మాయి. నేనెదుర్కొన్న వివక్ష కారణంగా నా సంస్కృతిని, రంగుని తిరస్కరించాను కానీ, తను ఆ పరిస్థితుల్ని దాటి...ఎందరో అభిమానుల్ని సంపాదించుకోగలిగింది. ప్రతిభ ఉంటే చాలు ప్రపంచం సలాం చేస్తుందని అర్థం చేసుకున్నాను. ఆ తర్వాతే నా ఉనికిని నేను ఇష్టపడటం మొదలుపెట్టా. అప్పటి నుంచే అవకాశాలూ వరుసకట్టాయి. ఇప్పుడు నా రంగూ, సంస్కృతి, ఆహారపుటలవాట్లు, కుటుంబ నేపథ్యాన్నీ అందరితో పంచుకోవడం ప్రారంభించా. నన్ను నేను అంగీకరించగల తత్వమే నన్ను ముందుకు నడిపిస్తోంది’ అని చెబుతోంది చరిత్ర. ప్రస్తుతం మరో రెండు వెబ్‌ సిరీస్‌లూ, ఓ హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్