19 ఏళ్లకే సీఏ అయ్యింది..

ఏ కెరియర్‌ ఎంచుకొన్నా లక్ష్యాన్ని చేరుకోవాలంటే సాధారణంగా రెండు పదులైనా నిండాల్సిందే. అందులోనూ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ కావాలంటే మరింత సమయం కావాలి. అయితే నందిని అగర్వాల్‌ 19వ ఏటనే సీఏ పూర్తి చేసి, అతి చిన్న వయసు ఛార్డర్డ్‌ అకౌంటెంట్‌గా ప్రపంచ రికార్డు సాధించింది.

Published : 05 Sep 2023 01:31 IST

ఏ కెరియర్‌ ఎంచుకొన్నా లక్ష్యాన్ని చేరుకోవాలంటే సాధారణంగా రెండు పదులైనా నిండాల్సిందే. అందులోనూ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ కావాలంటే మరింత సమయం కావాలి. అయితే నందిని అగర్వాల్‌ 19వ ఏటనే సీఏ పూర్తి చేసి, అతి చిన్న వయసు ఛార్డర్డ్‌ అకౌంటెంట్‌గా ప్రపంచ రికార్డు సాధించింది.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు నందిని చిన్నప్పటి నుంచి చదువులో అందరికన్నా ముందుండేది. మధ్యప్రదేశ్‌లోని మొరేనా పట్టణానికి చెందిన ఈమె తండ్రి నరేష్‌ చంద్ర గుప్తా ట్యాక్స్‌ ప్రాక్టీషనర్‌. తల్లి డింపుల్‌ గృహిణి. అన్నయ్య సచిన్‌. అయిదేళ్లకే ప్రాథమిక స్థాయి పాఠాలను సులువుగా ఒంటపట్టించేసుకుంది నందిని. అది గమనించిన ఆమె తల్లిదండ్రులు రెండు తరగతులు దాటించి ఏకంగా మూడో క్లాస్‌లోనే చేర్చారు. అలా హైస్కూల్‌లో అందరికన్నా ముందుంటూ.. 13 ఏళ్లకే టెన్త్‌లోకి వెళ్లింది.

కల నెరవేరి..

ప్రపంచ రికార్డు సాధించిన ఒక విద్యార్థిని తన స్కూల్‌కొచ్చినప్పుడు ఆమెకు దక్కిన ప్రశంసలు తనకు స్ఫూర్తినిచ్చాయంటోంది నందిని. ‘ఆ అమ్మాయిని అందరూ పొగుడుతుంటే నాకూ గిన్నిస్‌ రికార్డులో స్థానాన్ని సంపాదించాలనిపించింది. అలా నాకది లక్ష్యమైంది. సీఏ పూర్తి కావాలంటే దాదాపు 20 ఏళ్లు దాటేస్తాయని చెబుతుంటారందరూ. అంతకంటే ముందే సీఏ పూర్తిచేయగలిగితే గిన్నిస్‌ రికార్డవుతుంది కదా అనుకున్నా.  మొదట నేను రెండు క్లాస్‌లు దాటడంతో ఇంటర్‌ అన్నయ్యతో కలిసి చదివా. మేమిద్దరం  94.5 శాతం మార్కులతో మంచి మార్కులు సాధించాం. అప్పటికి నాకు 15, అన్నయ్యకు 17 ఏళ్లు. ఆ తర్వాత సీఏ కోర్సులోకి ప్రవేశించా. అక్కడి నుంచి నాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇంటర్న్‌షిప్‌ చేయాలంటే చిన్న చిన్న సంస్థలు కూడా నాకు ప్రవేశాన్నిచ్చేవి కావు. 16 ఏళ్ల నన్ను చూసి చిన్నపిల్లవి, నువ్వేం చదువుతావని ఎగతాళి చేయడంతో నాలో పట్టుదల పెరిగింది. అలాగే మాక్‌ టెస్ట్‌లో వచ్చిన తక్కువ మార్కులు నన్ను మరింత భయపెట్టాయి. అప్పుడే అన్నయ్య మెంటార్‌గా మారి సలహాలిచ్చేవాడు. వైఫల్యాన్ని గుర్తు పెట్టుకోవద్దని, సాధన చేస్తూనే ఉండమనేవాడు. దాంతో పరీక్షలు బాగా రాయగలిగా. 2021లో జరిగిన చివరి పరీక్షలకు దేశవ్యాప్తంగా 83 వేల మంది హాజరుకాగా ఆల్‌ ఇండియా మొదటి ర్యాంకు సాధించగలిగా. అలా 19 ఏళ్లకే సీఏ పూర్తి చేశా’నంటున్న నందిని పేరు అతి చిన్న వయసులో మహిళా సీఏగా ప్రపంచ రికార్డులో నమోదైంది.

పట్టుదలగా..

ఎవరెంత విమర్శించినా మన లక్ష్యాన్ని మరవకూడదంటుంది నందిని. ‘స్కూల్‌ స్థాయిలోనే మనకంటూ ఓ కల కచ్చితంగా ఉండాలి. అది నలుగురిలో మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టాలి. దాన్ని సాధించడానికి ఇబ్బందులెన్నెదురైనా దాటగలిగే ధైర్యం మన వద్ద ఉండాలి. ఇవన్నీ అనుకున్న లక్ష్యాన్ని సాధించి మనమేంటో నిరూపించుకోవడానికి దోహదపడతాయి. సీఏ పరీక్షకు సిద్ధం కావడం పెద్దవాళ్ల వల్లే కాదని, నీ వల్ల అసలే కాదనీ మరో దారి చూసుకోమంటూ   సలహాలిచ్చేవారు. సీఏలో మంచి మార్కులు సాధించిన వారిని కలుసుకొని వారి సూచనలు, అనుభవాలడిగేదాన్ని. మన పట్టుదలే లక్ష్యానికి చేరువ చేస్తుంద’ని చెబుతున్న నందిని అందరికీ స్ఫూర్తిదాయకం కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్