ఆమె శుభ్రతకే అవని...

నెలసరి ప్రతి అమ్మాయి జీవితంలో జరిగే సహజ ప్రక్రియని తెలిసినా ఇప్పటికీ చాలామందికి సరైన అవగాహన ఉండదు. అపోహలు, అపరిశుభ్ర అలవాట్లతో అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారన్న ఆలోచనతోనే ‘అవని’ పేరుతో రసాయన రహిత శానిటరీ ఉత్పత్తుల తయారీ మొదలుపెట్టారు ముంబయికి చెందిన సుజాత పవార్‌.

Updated : 01 Oct 2023 07:31 IST

నెలసరి ప్రతి అమ్మాయి జీవితంలో జరిగే సహజ ప్రక్రియని తెలిసినా ఇప్పటికీ చాలామందికి సరైన అవగాహన ఉండదు. అపోహలు, అపరిశుభ్ర అలవాట్లతో అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారన్న ఆలోచనతోనే ‘అవని’ పేరుతో రసాయన రహిత శానిటరీ ఉత్పత్తుల తయారీ మొదలుపెట్టారు ముంబయికి చెందిన సుజాత పవార్‌. ఆ కథేంటో మనమూ తెలుసుకుందామా!

‘తరాలు మారినా రుతస్రావ ఇబ్బందులు మాత్రం అమ్మాయిలకు తప్పడం లేదు. నిన్న మొన్నటి వరకూ నెలసరి పరిశుభ్రతా విధానాలను అవలంభించేలా చేయడానికి ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేశారంతా. అందులో భాగంగానే శానిటరీ ప్యాడ్ల వాడకం మొదలైంది. తీరా వాటిని వినియోగించడం మొదలుపెట్టాక అందులో రసాయనిక పూతలు, సింథటిక్‌ పదార్థాలతో చేసినవే ఎక్కువనే విషయం తెలిసింది. వీటితో అలర్జీలు, క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే హెచ్చరికలతో కొంత నాకూ స్వానుభవమయ్యింది. మహారాష్ట్రలోని కల్యాణ్‌ నుంచి ఎంబీఏ చదవడానికి ముంబయి వచ్చాకే నేను శానిటరీ న్యాప్‌కిన్లు కొనుగోలు చేశా. వాటిని వాడాక దద్దుర్లు, చికాకు, అసౌకర్యంతో ఇబ్బందిపడి వైద్యుల్ని సంప్రదిస్తే...అందుకు శానిటరీ ప్యాడ్సే కారణమని చెప్పారు. దాంతో రసాయన రహిత ప్యాడ్లు ఏమైనా దొరుకుతాయేమోనని వెతికా. చాలా తక్కువ రకాలు కనిపించాయి. అప్పటికి కొన్నాళ్లు అవే వాడినా...ఆ ఆలోచన మాత్రం నా మనసు నుంచి పోలేదు. నిజానికి బీఫార్మసీ పూర్తయ్యేవరకూ అమ్మ నా కోసం ప్రత్యేకంగా కుట్టిచ్చిన కాటన్‌ క్లాత్‌ ప్యాడ్‌లనే వినియోగించేదాన్ని. ఆ విషయం గుర్తొచ్చాక దీనిపై మరింత అవగాహన తెచ్చుకోవాలని లోతుగా అధ్యయనం చేశా’ అంటోంది సుజాత.

సురక్షితంగా...

హెల్త్‌కేర్‌ రంగంలో ఎనిమిదేళ్లు పనిచేసిన అనుభవం ఆమెకుంది. తను చేసిన పరిశోధనతో సింథటిక్‌, రసాయనల పూతలతో రూపొందించిన ప్యాడ్లు స్త్రీల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకుంది. అంతేకాదు, వాడేసినవి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్లు పడతాయని తెలిసి ఆశ్చర్యపోయింది. ఇవన్నీ చూశాక తానే ప్రత్యామ్నాయ నెలసరి ఉత్పత్తులను మార్కెట్‌లోకి తేవాలనుకుంది. దాని ఫలితంగానే భర్తతో కలిసి ‘అవని’ పేరుతో ఓ సంస్థను స్థాపించింది. క్లాత్‌ ప్యాడ్లు అనువైనవే అయినా అవి ప్రయాణాలకు అంత సురక్షితం కాదు. దీంతో ఎన్నో ప్రయోగాల తర్వాత యాంటీమైక్రోబయల్‌ రీయూజబుల్‌ క్లాత్‌ ప్యాడ్స్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. నాణ్యమైన పత్తితో తయారుచేసిన ఇవి అధిక రక్తస్రావాన్ని గ్రహిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. భూమిలోనూ సురక్షితంగా కలిసిపోతాయి.

ఇబ్బందులెన్నో...

వ్యాపారమంటేనే ఆటుపోట్లు. దీన్ని ప్రారంభించగానే అమ్మకాలేమీ పెద్ద ఎత్తున సాగిపోలేదు. మొదట్లో చాలా ఇబ్బందులే చూశారు. ఇప్పటివరకూ శానిటరీ ప్యాడ్స్‌ వాడకానికి అలవాటు పడిన మహిళలు ఒక్కసారిగా క్లాత్‌ ప్యాడ్‌కి మారడం అంటే అంత సులువేం కాదు. అందుకే, ముందు పాఠశాలలూ, కళాశాలల్లో యువతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది.  సందేహాలు నివృత్తి చేయడానికి 24 గంటల సర్వీస్‌ హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఉచితంగా పంచి వాడి చూడమనీ చెప్పేది. క్రమంగా అవని ఇంటిమేట్‌ వైప్స్‌, మెన్‌స్ట్రువల్‌ కప్‌, ప్యాంటీలైనర్లు, పీరియడ్‌ వేర్‌ వాష్‌ వంటి సులువుగా ఉపయోగించగలిగే వస్తువులెన్నింటినో ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ మార్కెట్‌లోకీ తేగలిగిందీమె. ఏడాదిలోనే సుమారు ఐదువేల మంది మహిళలకు ఉపాధి అవకాశలను కల్పించడమే కాకుండా, దేశవ్యాప్తంగా 27 రిటైల్‌ స్టోర్లకు సరఫరా చేయడంతో పాటు దేశవిదేశాలకూ పంపుతున్నారు. ఈ ఉత్పత్తులు గ్రామీణ ప్రాంతాల వారికి చేరువ చేయడానికి దాగ్‌ పేరుతో ఓ ప్రాజెక్టుని ప్రారంభించింది. గ్రామ కమ్యూనిటీ గ్రూపులు, ఎన్‌జీవోల సాయంతో రుతుక్రమ ఆరోగ్య కిట్లను ఉచితంగా అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్