అక్షరాల.. ఆణిముత్యాలు!

ఆమె చేతి నుంచి జాలువారిన అక్షరాలు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన అక్షరాలయ్యాయి. కోట్లమంది చేతి రాతతో పోటీపడి 19 ఏళ్ల ప్రకృతి మల్లాని విజేతగా తీర్చిదిద్దాయి.

Published : 04 Oct 2023 01:20 IST

ఆమె చేతి నుంచి జాలువారిన అక్షరాలు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన అక్షరాలయ్యాయి. కోట్లమంది చేతి రాతతో పోటీపడి 19 ఏళ్ల ప్రకృతి మల్లాని విజేతగా తీర్చిదిద్దాయి. తన రాతలోని అందం వెనక రహస్యాన్ని చెప్పుకొచ్చిందిలా..

నేపాల్‌లోని భక్తాపూర్‌ మాది. విద్యార్థిగా ఉన్నప్పుడు చేతిరాత అందంగా లేకపోతే పరీక్ష పేపర్లు దిద్దేవారికి సరిగా అర్థంకాకపోవచ్చు. దీంతో మార్కులు తగ్గే అవకాశం ఉంది. అక్షరాలు అందంగా ఉంటే చదవాలనే ఆసక్తిని పెంచుతాయి. అందుకే చేతిరాతను మెరుగుపరుచుకోవడానికి నేను చాలా శ్రమ పడ్డా. రాయడమంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. సమయం దొరికితే అక్షరాలను మరింత అందంగా రాయడానికీ, తీర్చిదిద్దడానికీ ప్రయత్నిస్తూనే ఉండేదాన్ని. ఇంగ్లిష్‌ మ్యాగ్‌జైన్లను ఎక్కువగా పరిశీలించి అక్షరాలన్నింటినీ సమానంగా రాయడానికి సొంతంగా శిక్షణ తీసుకొనేదాన్ని. రోజుకి కనీసం రెండుగంటలకుపైగా సాధన చేసేదాన్ని. గతంలో చేతి రాతకు సంబంధించి పోటీలుండేవని మా ఉపాధ్యాయులు చెప్పేవారు. ప్రస్తుతం అటువంటి పోటీల్లేక, రాయడంపై ఎవరికీ ఆసక్తి ఉండటం లేదు. చిన్నప్పటి నుంచీ నా చేతిరాతను చాలామంది ఆశ్చర్యంగా చూసేవారు. ఎంతసేపు సాధన చేస్తావని అడిగేవారు. ఎనిమిదో తరగతిలో నా అసైన్‌మెంట్‌ పేపర్లను మా ఉపాధ్యాయులు ఇంటర్నెట్‌లో ఉంచారు. నా చేతిరాతను అందరికీ తెలియజేయడానికే అలా చేశారు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా నా గురించి తెలిసింది. చాలామంది నా అక్షరాలకు స్పందించి అభినందనలు పంపారు. దాంతో చేతిరాత పోటీల్లో పాల్గొనడం ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అవార్డులను అందుకొన్నా. నేపాల్‌లో ‘పెన్‌మ్యాన్‌షిప్‌’ అవార్డు, అలాగే ‘నేపాల్‌ ఆర్మ్డ్‌ ఫోర్సెస్‌’ నుంచి ఉత్తమ చేతిరాత అవార్డునూ తీసుకొన్నా. దేశంలోనే ‘అత్యంత అందమైన సంతకం’గా నా సంతకాన్ని నేపాల్‌ ప్రభుత్వం ధ్రువీకరించింది.

అంతర్జాతీయ గుర్తింపు..

2020లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన చేతిరాత పోటీల్లో ‘వరల్డ్‌ బెస్ట్‌ హ్యాండ్‌ రైటింగ్‌’ అవార్డు దక్కింది. అయితే ఈ పురస్కారం నాకు అంత తేలిగ్గా రాలేదు. ప్రత్యేక నిపుణుల బృందం నేను రాసిన ప్రతి అక్షరాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అక్షరాలన్నీ సమానమైన ఎత్తు, దూరంతో చూడముచ్చగా ఉండటంతో ఆ అవార్డు నాకే దక్కింది. ప్రస్తుతం సైనిక్‌ అవసియా మహావిద్యాలయలో చదువుతున్నా. ఇటీవల యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో జరిగిన ఉత్సవాల సందర్భంగా యూఏఈ నాయకత్వానికీ, ప్రజలకు అభినందన లేఖను రాసి రాయబార కార్యాలయానికి పంపాను. దాంతో మళ్లీ నా చేతిరాత వైరల్‌ అయ్యింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్