నన్నో భూతంలా చూసేవారు..!

ముఖం మీద చిన్న మొటిమ వస్తేనే అదేదో పెద్ద సమస్యలా భావిస్తుంటారు అమ్మాయిలు. అదే చెంప మొత్తాన్ని ఒక నల్లమచ్చ కప్పేస్తే... ఊహించడమే కష్టంగా ఉంది కదా! ఈ యువతి ముఖం మీద అలాంటి పుట్టుమచ్చే ఉంది.

Updated : 06 Oct 2023 13:21 IST

ముఖం మీద చిన్న మొటిమ వస్తేనే అదేదో పెద్ద సమస్యలా భావిస్తుంటారు అమ్మాయిలు. అదే చెంప మొత్తాన్ని ఒక నల్లమచ్చ కప్పేస్తే... ఊహించడమే కష్టంగా ఉంది కదా! ఈ యువతి ముఖం మీద అలాంటి పుట్టుమచ్చే ఉంది. వయసు పెరిగే కొద్దీ అది ఆమె కలతకు కారణమైంది. దాన్ని ఉంచుకోలేక, తీసేయలేక, నలుగురిలో ముఖం చూపించుకోలేక తను పడ్డ యాతన అంతా ఇంతాకాదు. కానీ, తర్వాత అందం శాశ్వతం కాదనీ, ఆత్మవిశ్వాసమే ఆభరణం కావాలనీ నమ్మింది. ఇది కర్ణాటకకు చెందిన మందర కథ.

ముఖంపై మచ్చ వల్ల ఇంటా, బయట అవమానాలు ఎదుర్కోవడం కన్నా నాలుగు గోడల మధ్య ఉండటమే మేలనుకుంది మందర. చచ్చేంత వరకూ తనకు ఆ గదే ప్రపంచమా అని ఏడవని రోజూ లేదు. ఎంత మంది డాక్టర్లను కలిసి, ఎన్ని చికిత్సలు చేయించుకున్నా సమస్య తీరలేదు. వాటివల్ల వచ్చే నొప్పిని పంటి బిగువునే భరించింది. అయినా సరే, ‘ఇంకోసారి లేజర్‌ చేయించుకుంటే జుట్టంతా ఊడిపోయే అవకాశంతో పాటు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదమూ ఉందని’ వైద్యులు చెప్పడంతో ఆగిపోయింది. అది మొదలు నెమ్మదిగా తనని తాను అంగీకరించుకోవడం మొదలుపెట్టింది. ఆ బాధ నుంచి బయటపడటానికి ఇన్‌స్టాలో రీల్స్‌ చేయడం మొదలుపెట్టింది. అక్కడా వెక్కిరింపులే. ‘నన్నో భూతంలా చూసేవారు.. మొదట్లో చాలా బాధపడ్డా. కానీ, నా తప్పేముంది. అందుకే పరిస్థితులతో పోరాడటం, అలాంటి మాటల్ని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకున్నా’ అంటోంది మందర. జర్నలిస్టుగా పనిచేస్తూ, ఖాళీ సమయాల్లో ఇన్‌స్టా వేదికగా బాడీ పాజిటివిటీ మీద రీల్స్‌ చేస్తోందీ అమ్మాయి. అందం మనసుకి ఉండాలి కానీ శరీరానికి కాదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తనకు ఎదురైన మంచి, చెడు అనుభవాలను పంచుకుంటూ ఆడపిల్లలకు ధైర్యాన్ని నూరిపోస్తోంది. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు 38 వేల మందికిపైగా ఫాలోయర్లు ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్