రూ.1.7 కోట్ల ఉపకార వేతనం అందుకున్నా!

ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు! పూజా కొల్లూరు మాత్రం హాలీవుడ్‌లో నిరూపించుకుని టాలీవుడ్‌కొచ్చింది. అమెరికాలో డైరెక్షన్‌ పాఠాలు నేర్చుకున్న ఈ విజయవాడ అమ్మాయి తాజాగా రిలయన్స్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమాకి దర్శకత్వ బాధ్యతలు తీసుకొంది. 

Updated : 16 Oct 2023 04:03 IST

ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు! పూజా కొల్లూరు మాత్రం హాలీవుడ్‌లో నిరూపించుకుని టాలీవుడ్‌కొచ్చింది. అమెరికాలో డైరెక్షన్‌ పాఠాలు నేర్చుకున్న ఈ విజయవాడ అమ్మాయి తాజాగా రిలయన్స్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమాకి దర్శకత్వ బాధ్యతలు తీసుకొంది..

ఓ సినిమా నా కెరియర్‌ని మలుపుతిప్పింది. నన్ను దర్శకత్వంవైపు అడుగులు వేయించింది. అమ్మ రేణుకాదేవి, నాన్న వెంకటేశ్వర్లు.. జర్నలిస్టు. పదోతరగతి వరకూ కేంద్రీయ విద్యాలయంలో చదివా. సెలవుల్లో ‘పాన్స్‌ లాబ్రెంత్‌’ అనే స్పానిష్‌ సినిమా చూశా. అప్పట్నుంచీ సినిమా రంగంలో రాణించాలనుకున్నా. ఇదే విషయం ఇంట్లో చెబితే అంత ఖర్చు మావల్ల కాదన్నారు. నేనే సొంతంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు పుణెలోని మహీంద్రా యునైటెడ్‌ వరల్డ్‌ కాలేజ్‌ గురించి తెలిసింది. దరఖాస్తు చేసుకున్నా. ఇంటర్వ్యూలో నా ఆసక్తి, మా ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ. 25 లక్షల స్కాలర్‌షిప్‌తో సీటు ఇచ్చారు. రెండేళ్ల ఇంటర్నేషనల్‌ బ్యాక్‌లారియేట్‌ డిప్లొమాలో... ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ సహా ఫిలిం స్టడీస్‌ చదివా. నాతోపాటు రెండొందల మంది విద్యార్థులు ఉంటే భారతీయులు 80 మందే. మిగిలినవారంతా విదేశీయులు. అలా వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు పరిచయం అయ్యాయి.

అమెరికా అవకాశం వచ్చింది..

డిప్లొమా పూర్తయ్యాక... దర్శకత్వం, సినిమాటోగ్రఫీలకు సంబంధించిన కోర్సుల కోసం వెతికా. అమెరికాలోని ఫ్లోరిడాలో ‘రింగ్లింగ్‌  కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌’ కాలేజీ గురించి తెలిసింది. అంతవరకూ నేను తీసిన షార్ట్‌ ఫిలిమ్స్‌, డాక్యుమెంటరీలతో దరఖాస్తు చేశా. నా ప్రతిభకు మెచ్చుకుని రూ. 1.70 కోట్ల ఉపకారవేతనం మంజూరు చేశారు. ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2013లో అమెరికా బయలుదేరాను. డైరెక్షన్‌, స్క్రీన్‌ రైటింగ్‌, సినిమాటోగ్రఫీ విభాగాల్లో నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేశాను. ఆ సమయంలోనే అమెజాన్‌ అడవుల సంరక్షణతోపాటు అక్కడ గిరిజనుల సంక్షేమం కోసం పని చేస్తున్న... ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. మెగ్లోమాన్‌పై డాక్యుమెంటరీ చేసే అవకాశం వచ్చింది. దానికోసం 15 రోజులపాటు దట్టమైన అమెజాన్‌ అడవుల్లోకి వెళ్లి, గిరిజనులతో కలిసి పనిచేసి ‘ఎ ఉమెన్‌ హూ క్లైంబ్స్‌ ట్రీస్‌’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించా. అదొక గొప్ప అనుభూతి. ఈ చిత్రం దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్స్‌- 2020కు ఎంపికవ్వటంతోపాటు స్పెషల్‌ జ్యూరీ అవార్డునూ తెచ్చిపెట్టింది.

క్యాన్సర్‌తో బాధపడుతున్న 12 ఏళ్ల బాలిక ఇతివృత్తంతో తీసిన మరో చిత్రం ‘రిఫ్లెక్షన్‌’.. రింగ్లింగ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకురాలి అవార్డులు అందుకుంది. ఆ ఉత్సాహంతోనే చేనేత కార్మికుల జీవితాలపై ‘ట్యాంగిల్డ్‌ థ్రెడ్స్‌’ తీశా. అమెరికాలోని అట్లాంటా, లాస్‌ ఏంజెల్స్‌లో సుమారు 30 కిపైగా చిత్రాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, వాణిజ్య ప్రకటనల కోసం పనిచేశా. 2018లో స్వదేశానికి వచ్చేశా. నేను నేర్చుకున్న విషయాలను... తెలుగు చిత్రాల ద్వారా మన ప్రజలకు చెప్పాలన్న కోరిక బలంగా ఉండేది. అన్నపూర్ణ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో రెండేళ్లు స్క్రీన్‌ రైటింగ్‌పై శిక్షణ ఇచ్చాను. వెంకటేష్‌ మహాతో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌కు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. తాజాగా తెలుగులో సంపూర్ణేష్‌ బాబు హీరోగా ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ సినిమాకు దర్శకత్వం వహించా. సినిమా రంగంలోకి రావాలని చాలామంది కలలు కంటారు. ఏ రంగంలో అయినా మొదట్లో కష్టాలు తప్పవు. అమ్మాయిలకైతే మరీ ఎక్కువ. అవన్నీ ఓపిగ్గా దాటాలి. సామాజిక బాధ్యత కలిగిన మంచి సినిమాలు అందించాలన్నదే నా లక్ష్యం.

-చౌడక శ్యామ్‌ప్రసాద్‌ బాబు, ఈటీవీ


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్