పోలీస్‌ వృత్తిపై ప్రేమతో...!

పారిశుద్ధ కార్మికుల తరపున పోరాడి.. న్యాయవాదిగా తనేంటో నిరూపించుకున్నారు ఇషాసింగ్‌. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పరీక్షలో ఆల్‌ ఇండియాలో ఆరో ర్యాంకు సాధించిన ఘనత సిమ్రన్‌ది. కృత్రిమమేథ, మెషిన్‌లెర్నింగ్‌లో తనేంటో నిరూపించుకున్న అమ్మాయి అనుష్త. ఐపీఎస్‌ అయితే ప్రజలకు మరింత సేవ చేయొచ్చన్న లక్ష్యంతో పోలీస్‌ వృత్తిలో అడుగుపెట్టి తాజాగా శిక్షణ పూర్తిచేసుకున్నారు వీరంతా.

Updated : 26 Oct 2023 12:23 IST

పారిశుద్ధ కార్మికుల తరపున పోరాడి.. న్యాయవాదిగా తనేంటో నిరూపించుకున్నారు ఇషాసింగ్‌. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పరీక్షలో ఆల్‌ ఇండియాలో ఆరో ర్యాంకు సాధించిన ఘనత సిమ్రన్‌ది. కృత్రిమమేథ, మెషిన్‌లెర్నింగ్‌లో తనేంటో నిరూపించుకున్న అమ్మాయి అనుష్త. ఐపీఎస్‌ అయితే ప్రజలకు మరింత సేవ చేయొచ్చన్న లక్ష్యంతో పోలీస్‌ వృత్తిలో అడుగుపెట్టి తాజాగా శిక్షణ పూర్తిచేసుకున్నారు వీరంతా. వీరితో వసుంధర ముచ్చటించింది...

కమాండ్‌ పరేడ్‌కు సారథ్యం

- అనుష్తా కాలియా

నా విద్యాభ్యాసమంతా దిల్లీలోనే. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బీటెక్‌ పూర్తి చేశా. తర్వాత డేటాసైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరి మెషిన్‌లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో పనిచేశా. పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోసం సైకాలజీని ఎంచుకొన్నా. అయితే సామాజిక సేవపై ఇష్టంతో పీజీ చదువుతూనే, సివిల్స్‌పై దృష్టి సారించా. తొలి ప్రయత్నంలోనే 143వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యా. అకాడమీలో ఇండోర్‌, ఔట్‌డోర్‌ శిక్షణలో చాలా కష్టపడ్డా. శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లను అధిగమించా. గ్రేహౌండ్స్‌ శిక్షణలో.. నెలరోజుల జంగిల్‌ వార్‌ఫేర్‌ శిక్షణలో భాగంగా అడవిలోనే ఉన్నాం. శిక్షణ మొత్తంలో అది నాకు చాలా క్లిష్టమైన సమయం. శిక్షణలో రోజువారీ షెడ్యూల్‌ తీరిక లేకుండా ఉండేది. సాయంత్రం కొంత సమయం లభించేది. ఆ సమయాన్నీ వదలకుండా కష్టపడ్డా. ఆ కష్టం ఎక్కడికీ పోలేదు. మొత్తం శిక్షణలో బెస్ట్‌ ఔట్‌డోర్‌ ప్రొబెషనర్‌గా ఎంపికయ్యా. ప్రతిష్ఠాత్మకమైన ‘ది ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ స్వార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ దక్కించుకున్నా. దీక్షాంత్‌ పరేడ్‌కు కమాండర్‌గా వ్యవహరించబోతున్నా. ఇకపై ఏజీఎంయూటీ కేడర్‌లో పనిచేయబోతున్నా. పోలీస్‌ వృత్తి పట్ల మహిళల్లో చాలా అపోహలున్నాయి. కానీ మహిళల సమస్యలు తోటి మహిళలకే అర్థమవుతాయి. అందుకే అమ్మాయిలకు ఈ రంగంపై దృష్టిపెట్టాలని సలహానిస్తుంటా.


న్యాయవాదిగా.. ఐపీఎస్‌గా..

- ఈషాసింగ్‌

మాది ఉత్తర్‌ప్రదేశ్‌ అయినా నాన్న వైపీ సింగ్‌ మహారాష్ట్ర కేడర్‌ ఐపీఎస్‌ కావడంతో అక్కడే స్థిరపడ్డాం. నా చదువంతా ముంబయిలోనే సాగింది. అక్కడే నేషనల్‌ లా స్కూల్‌లో న్యాయవిద్య పూర్తి చేసి బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశాను. పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణిస్తే రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలంటూ వాళ్ల తరఫున వాదించి కేసు గెలవడం నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి. కానీ నాన్న ప్రభావం నాపై ఎక్కువ. అందుకే న్యాయవాదిగా కన్నా ఐపీఎస్‌గా ప్రజలకు ఎక్కువ సేవ చేయగలనని అనిపించింది. నా దృష్టిలో ప్రజలకు సేవ చేసే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వమే. ప్రజలకు ఏదైనా అవసరమైతే ప్రభుత్వం దగ్గరికే వస్తారు. నేరరహిత అంశమైనా సరే పోలీసులనే ఎక్కువగా ఆశ్రయిస్తారు కాబట్టి పోలీస్‌శాఖలో చేరాలనుకున్నా. న్యాయవాద నేపథ్యముండటం నా సివిల్స్‌ సన్నద్ధతకు కలిసి వచ్చింది. తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్‌ సాధించా. విధి నిర్వహణలో క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ను సమర్థంగా అమలు చేయడంపైనే దృష్టి సారిస్తా. ప్రస్తుతం సంప్రదాయ పద్ధతిలో చేసే నేరాలు తగ్గిపోయి.. సైబర్‌క్రైమ్‌ నేరాలు పెరిగాయి. కానీ దర్యాప్తులో ఆ కేసుల పెండెన్సీ 95శాతం వరకుంది. దాన్ని తగ్గించడమే నా ముందున్న లక్ష్యం.


ఆర్మీ నుంచి ఐపీఎస్‌కు..

- సిమ్రన్‌ భరద్వాజ్‌

మా స్వస్థలం హరియాణా. నాన్న ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో పనిచేశారు. ఆయన ఉద్యోగరీత్యా నా చదువంతా వివిధ ప్రాంతాల్లో సాగింది. ఇంటర్‌ జమ్మూకశ్మీర్‌లో చదివిన నేను దిల్లీలోని కమలానెహ్రూ కళాశాలలో జర్నలిజం చేశా. అక్కడ ఉండగానే సివిల్స్‌పై దృష్టి సారించా. ప్రజలకు సేవ చేసేందుకు అదే మంచి మార్గమనిపించింది. 2021లో తొలుత కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌(సీడీఎస్‌) పరీక్షకు హాజరయ్యా. అఖిల భారత స్థాయిలో 6వ ర్యాంకు సాధించా. అలాగని సివిల్స్‌ని వదిలేయలేదు. పట్టుదలగా చదివేదాన్ని. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో యూపీఎస్సీ టాపర్ల వీడియోలను చూస్తూ, ప్రణాళికను రూపొందించుకున్నా. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించా. 2021లో వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో 172వ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌గా అక్కడి పోలీసింగ్‌లో సమర్థురాలిగా పేరు తెచ్చుకోవాలనేదే నా ఉద్దేశం. అంతర్గత భద్రత అంశాలైన నక్సలిజం, తీరప్రాంత
రక్షణపై దృష్టి సారిస్తా.

-మల్యాల సత్యం, హైదరాబాద్‌


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911 కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్