పేదరికంపై.. గురి పెట్టారు

కష్టపడితే కానీ ఇల్లు గడవని నిరుపేద కుటుంబాలు. ఒక పూట తింటే మరోపూట పస్తులుండాల్సిన పరిస్థితి. తలరాత మార్చుకోవాలని కలలు కన్నారు. దానికోసం విల్లును చేతపట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో రాణిస్తున్నారు.

Published : 28 Oct 2023 01:32 IST

కష్టపడితే కానీ ఇల్లు గడవని నిరుపేద కుటుంబాలు. ఒక పూట తింటే మరోపూట పస్తులుండాల్సిన పరిస్థితి. తలరాత మార్చుకోవాలని కలలు కన్నారు. దానికోసం విల్లును చేతపట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో రాణిస్తున్నారు. ఒలింపిక్స్‌ లక్ష్యంగా సాగుతున్నారు వరంగల్‌ జిల్లా కల్లెడకు చెందిన వేమునూరి శారద, పడాల విజయలక్ష్మి.


చినిగిన దుస్తులతోనే సాధన

శారద

నాన్న అల్లోరుస్వామి కార్పెంటర్‌. అమ్మ పూలమ్మ కూలీకెళ్లేది. ఇద్దరూ సంపాదిస్తేకానీ ఇల్లు గడిచేది కాదు. మా పరిస్థితి చూసి బంధువులూ ఇంటికొచ్చేవారు కాదు. అందుకే నేను, అన్నయ్య ఏదైనా సాధించాలి అనుకునేవాళ్లం. ఆర్‌డీఎఫ్‌ పాఠశాలలో అన్నయ్య ఆర్చరీని ఎంచుకుంటే నేను వాలీబాల్‌ ఆడేదాన్ని. చినిగిన దుస్తులే దిక్కు. అయినా వాటితోనే సాధన చేసేవాళ్లం. వాలీబాల్‌లో జిల్లాస్థాయిలో పతకాలూ గెలుచుకున్నా. ‘నిన్ను ఆడొద్దనను. కానీ.. అమ్మాయివి, ఒక్కదాన్నే దూరం పంపాలంటే భయంగా ఉంది. నువ్వూ ఆర్చరీ ఎంచుకో. అన్నయ్య తోడుంటాడు’ అన్నారు నాన్న. నాకేమో ఆసక్తి లేదని వెళ్లేదాన్ని కాదు. దీంతో అన్నయ్య బలవంతంగా తీసుకెళ్లేవాడు. అయిష్టంగానే నేర్చుకోవడం మొదలుపెట్టా. అప్పుడప్పుడు తప్పించుకోవడానికి సాకులూ వెతికేదాన్ని. అయినా అన్నయ్య వదిలేవాడు కాదు. నేర్చుకునేకొద్దీ నెమ్మదిగా ఆసక్తి పెరిగింది. ఏడాదిలోనే పోటీల్లో పాల్గొని పతకాలూ గెలిచా. ఇంతలో బీజింగ్‌ ఒలింపిక్స్‌కి మా దగ్గర్నుంచి ప్రణీత అనే అమ్మాయి ఎంపికైంది. అది తెలిశాక నేనూ ఆ స్థాయికి చేరుకోవాలని పట్టుదలతో సాధన చేసేదాన్ని. రాష్ట్రపోటీల్లో ఛాంపియన్‌ అయ్యి టాటా స్పాన్సర్‌షిప్‌తో ఆరేళ్ల ఉచిత శిక్షణని పొందా. అంతర్జాతీయ పోటీలకు విదేశాలకూ వెళ్లా. మూడు అంతర్జాతీయ పతకాలు సహా రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో 200కుపైగా మెడల్స్‌ సాధించా. 2013లో స్పోర్ట్స్‌ కోటాలో ఐటీబీపీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం దిల్లీ, హరియాణ సరిహద్దుల్లో పనిచేస్తున్నా. అలాగని సాధన ఆపలేదు. ప్రియాంక్‌ త్యాగి వద్ద శిక్షణ తీసుకుంటున్నా. మాకు ఏటా ఆల్‌ ఇండియా పోలీస్‌ మీట్‌ జరుగుతుంది. నాలుగేళ్లుగా వరుసగా ఛాంపియన్‌ అవుతున్నా. మావారు రంజిత్‌ కుమార్‌ రైల్వే ఉద్యోగి. తన ప్రోత్సాహమూ ఎక్కువే. సమస్యల్లా తనో చోట.. నేనో చోట. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్నది నా లక్ష్యం.


ఊరు దాటుతా అనుకోలేదు

విజయలక్ష్మి

నాన్న శ్రీనివాస్‌ డ్రైవర్‌. అమ్మ రమాదేవి. నాన్నకి పక్షవాతం వచ్చి మంచానికే పరిమితం అయ్యారు. ఇంటి భారమంతా అమ్మ మీదే పడింది. నలుగురు అమ్మాయిలం. అమ్మ కూలీ చేస్తేనేగానీ మా కడుపు నిండేది కాదు. ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి వరకు చదివా. తర్వాత ఆర్‌డీఎఫ్‌ కళాశాలలో చేరా. అక్కడ ఆర్చరీ నన్ను ఆకర్షించింది. చదువే కష్టం.. ఇక ఆటలంటే ఎలా? అమ్మ వద్దంటే వద్దంది. దానికితోడు లాక్‌డౌన్‌. నేను మాత్రం పట్టుబట్టి  కొనసాగించా. ఇందులో నా స్వార్థమూ లేకపోలేదు. ఆర్చరీలో పతకాలు సాధించి, స్పోర్ట్స్‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అమ్మాయిలను చూశా. నేనూ రాణిస్తే మా ఇంటి పరిస్థితిని మార్చొచ్చని ఆశ. అందుకే పట్టుదలగా సాధన చేసేదాన్ని. ఝార్ఖండ్‌, గోవా, పంజాబ్‌ల్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని రాణించా. దీంతో హరియాణా.. సోనీపత్‌ నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అకాడమీలో శిక్షణ పొందే అవకాశమొచ్చింది. ఎక్విప్‌మెంట్‌, వసతితోపాటు పోటీలకు ఖర్చులూ వారే భరిస్తున్నారు. ఊరే దాటుతా అనుకోలేదు. వివిధ రాష్ట్రాలు తిరుగుతోంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. డిగ్రీ తుది సంవత్సరం చదువుతూనే సాధనా చేస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో మెరవాలి, ఒలింపిక్స్‌ వరకూ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అక్కల పెళ్లిళ్లు చేయడానికి అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. పతకాలు సాధించి, అమ్మకు మంచి పేరు తెచ్చిపెట్టాలి, తనకు ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకోవాలని కల.


- ముంజాల రాజుగౌడ్‌, పర్వతగిరి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్