ఆ ప్రశ్న.. స్ఫూర్తిగా నిలిపింది!

సంప్రదాయ లుక్‌.. ప్రోస్థటిక్‌ కాలితో డ్యాన్స్‌ చేస్తోన్న ఫాతిమా వీడియోను చూసి లక్షల్లో ఫిదా అయ్యారు. కాలు లేకపోతేనేం ఆత్మవిశ్వాసంతో దూసుకెళుతోందంటూ ప్రశంసలు కురిపించారు. అవమానాలు.. హేళనలు దాటి ఈ స్థితికి చేరడానికి ఆమె పడిన కష్టం, చూపిన తెగువ ఎంతో!

Published : 30 Oct 2023 02:04 IST

సంప్రదాయ లుక్‌.. ప్రోస్థటిక్‌ కాలితో డ్యాన్స్‌ చేస్తోన్న ఫాతిమా వీడియోను చూసి లక్షల్లో ఫిదా అయ్యారు. కాలు లేకపోతేనేం ఆత్మవిశ్వాసంతో దూసుకెళుతోందంటూ ప్రశంసలు కురిపించారు. అవమానాలు.. హేళనలు దాటి ఈ స్థితికి చేరడానికి ఆమె పడిన కష్టం, చూపిన తెగువ ఎంతో!

‘ఆపరేషన్‌ చేస్తే తట్టుకునే వయసు కాదు నీది. ఆ నొప్పి తట్టుకోవడానికి చాలా మందులు వాడాలి’ అని డాక్టర్‌ చెప్పినప్పుడు ఫాతిమా భయపడలేదు. తను ఎదుర్కొన్న హేళనలు, అవమానాల ముందు ఆ నొప్పి చాలా చిన్నదిగానే తోచిందామెకు మరి. ఈమెది కేరళలోని కొల్లాం దగ్గర ఓ పల్లె. పుట్టినప్పుడు ఫాతిమా అందరిలానే ఉంది. కానీ తర్వాతే తన కుడి కాలు ఎదగలేదు. చేతుల వేళ్లూ కాస్త తేడాగా ఉంటాయి. వంకర శరీరం, పీత వేళ్లు, రాక్షసి అంటూ ఏడిపించేవారు. స్కూలు ఫంక్షన్ల కోసం ఎప్పుడైనా సరదాగా రెడీ అయినా నీకెందుకు ఇవన్నీ అనో, పాపం నీ భవిష్యత్తేంటి అనో అనేవారట. మొదటి మాటను పట్టించుకోవడం మానేసినా.. రెండో మాట మాత్రం తన మనసులో నాటుకుపోయింది.

‘నా భవిష్యత్తేంటి?’ అన్న మాట తనను చాలా ఇబ్బంది పెట్టేదట. అలా ఆలోచిస్తున్నప్పుడే ఆమెకు ఓ డాక్టర్‌తో పరిచయం అయ్యింది. ‘పనికి రాని కాలు అడ్డుగా ఉండటం తప్ప దానివల్ల ప్రయోజనం ఏంటి? బదులుగా తీయించుకొని ప్రోస్థటిక్‌ లెగ్‌ పెట్టించుకుంటే కనీసం నడక సులువవుతుంది’ అన్నారాయన. ఆ మాట ఫాతిమాను ఆలోచనలో పడేసింది. అమ్మ సాయంతో ప్రోస్థటిక్‌ లెగ్‌ కోసం వెళ్లినప్పుడు వైద్యుడు కొన్నేళ్లు ఆగమన్నారు. అప్పటికి ఆమె వయసు 17ఏళ్లే మరి. అయినా పట్టుబట్టి, సర్జరీ చేయించుకుందామె. ‘అప్పటికీ అయ్యో ఒక కాలు లేదన్న మాటే! కానీ నాపై అవేమీ పెద్ద ప్రభావం చూపలేదు. ఎందుకంటే.. నా కాళ్ల మీద నేను నిలబడిన ఆరోజు నేనేదైనా సాధించగలను అనిపించింది మరి’ అంటోన్న 22 ఏళ్ల ఫాతిమా ఎంఏ పూర్తిచేసింది. చదువుతూనే తనకు నచ్చిన డ్యాన్స్‌, మోడలింగ్‌పై దృష్టిపెట్టింది. ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ వీక్‌ సహా అందాల పోటీల వేదికలపై మెరిసింది. కొన్ని మోడలింగ్‌ సంస్థలు ఆమెను నియమించుకున్నాయి కూడా.

ఒక్క ఫొటోషూట్‌తో..

ఇదంతా కొవిడ్‌లో తను చేసిన ఫొటోషూట్‌తో సాధ్యమైంది. ‘ఊహలకు రెక్కలివ్వండి.. ఏదైనా సాధించొచ్చు’ అంటూ సముద్ర తీరాన తను చేసిన ఆ ఫొటోషూట్‌తో అవకాశాలు వరుసకట్టాయి. ఫాతిమా పాతూగా పేరుతెచ్చుకున్న ఈమె ‘అయామ్‌ డిఫరెంట్‌’ పేరుతో ఇన్‌స్టాలో తన డ్యాన్స్‌ వీడియోలను పెడుతుంటుంది. వాటికి లక్షల్లో వీక్షణలు. ‘రోజూ రాత్రికి నా కాలు విపరీతమైన నొప్పి పెడుతుంది. వెన్నెముకలో  కాస్త వంకరగా ఉంటుంది. ఎక్కువసేపు నిలబడినా, డ్యాన్స్‌ చేసినా దానికీ ఇబ్బందే! అయినా డ్యాన్స్‌, మోడలింగ్‌ ఆపాలనుకోను. ఎంతోమంది నువ్వు మాకు స్ఫూర్తి. నిన్ను ఆదర్శంగా తీసుకొని హేళనలు పట్టించుకోవడం మానేశామని చెబుతోంటే మరింత ఉత్సాహంగా కొత్తవి ప్రయత్నిస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు నాకు రేపేంటన్న భయం లేదు’ అంటోన్న ఫాతిమా అందరికీ స్ఫూర్తేగా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్