గూగుల్‌ వదిలి... ఇదేం పనన్నారు!

గూగుల్‌లో ఉద్యోగం వచ్చిందంటే... ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, వరంగల్‌కి చెందిన పామిరెడ్డి తేజస్విని మాత్రం తన అభిరుచిని వ్యాపారంగా మలచుకోవడానికి... ఆ కొలువుని సులువుగా వదిలేసింది.

Updated : 03 Nov 2023 07:13 IST

గూగుల్‌లో ఉద్యోగం వచ్చిందంటే... ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, వరంగల్‌కి చెందిన పామిరెడ్డి తేజస్విని మాత్రం తన అభిరుచిని వ్యాపారంగా మలచుకోవడానికి... ఆ కొలువుని సులువుగా వదిలేసింది. ఇంటిని అందంగా సర్దిపెట్టే డీక్లట్టర్‌ ఆర్గనైజర్‌గా వినూత్నమైన ఉపాధిని ఎంచుకుని విజయపథంలో నడుస్తోంది. ఈ సందర్భంగా వసుంధరతో  తన ప్రయాణాన్ని పంచుకుందిలా...

‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు... నిద్రపోనివ్వకుండా చేసేది’ అన్న అబ్దుల్‌కలాం మాటలే నాకు స్ఫూర్తి. అందుకే, నేను కోరుకున్న పని చేయడానికి లక్షల జీతమిచ్చే కార్పొరేట్‌ కొలువుని సులువుగా వదిలేసుకోగలిగా. ఈ విషయాన్ని విన్నవారు ‘ఇంతకంటే తెలివి తక్కువ పని మరొకటి లేదన్నారు. అయినా సరే, నా అభిప్రాయాన్ని వారికి స్పష్టంగా చెప్పి డీక్లట్టరింగ్‌, ఆర్గనైజింగ్‌ సేవలందించే వ్యాపారాన్ని మొదలుపెట్టా. మాది వరంగల్‌. నా చదువంతా అక్కడే సాగింది. చిన్నప్పటి నుంచే నా దుస్తులు, వస్తువుల్ని ఓ వరుసలో సర్దుకోవడం, మర్నాటికి కావలసినవి ముందే సిద్ధం చేసుకోవడం వంటి పనులను ఇష్టంగా చేసేదాన్ని. అమ్మ సరళ నుంచే నాకీ పద్ధతి అలవాటయ్యింది. బంధువుల ఇంటికి వెళ్లినా, స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉన్నా దాన్నెంత అందంగా మార్చాలన్న ఆలోచనలే. ఈ పనులు నాకు అలసటనివ్వకపోగా... సంతోషాన్ని నింపేవి. అయితే, దీన్నే కెరియర్‌గా మార్చుకుంటానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. మొదట్నుంచీ నాకు వ్యాపారంలో రాణించాలని ఉండేది. కానీ, ఏం చేయాలి? ఎలా చేయాలన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ ప్రయత్నం చేశా. గూగుల్‌లో జాబొచ్చింది. ఐదేళ్ల పాటు ఇందులో పనిచేశా. ఆ సమయంలోనే విదేశాల్లో డీక్లట్టరింగ్‌, ఆర్గనైజింగ్‌ చేసే సర్వీసులకు బోలెడంత డిమాండ్‌ ఉందని తెలిసింది. మరింత అవగాహన కోసం నెట్‌లో వెతికి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఆ తర్వాతే దీన్ని కెరియర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా. మొదట నా ఆలోచన చెప్పినప్పుడు ఇంట్లో అందరూ షాకయ్యారు. తర్వాతి అడుగు ఏంటనే దానిపై నాకు స్పష్టత లేకపోయినా, జీరో నుంచే నా ప్రయాణం మొదలుపెట్టాలి అనుకున్నా. నా పట్టుదల చూసి ఇంట్లోవాళ్లు చివరికి సరే అన్నారు.

కొవిడ్‌లో  ఖాళీ దొరికి...

సరిగ్గా అదే సమయంలో కొవిడ్‌ మొదలయ్యింది. నాకు ఆలోచించుకునే సమయం దొరికింది. ప్రజల అవసరాలూ తెలిసొచ్చాయి. అనుకున్నట్లే వ్యాపారం ప్రారంభించా. ‘హ్యాపీటాపింగ్‌బై తేజూ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ల్లో ఖాతాలు తెరిచి ఇంటిని ఆర్గనైజ్డ్‌గా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత, అందంగా సర్దుకునేందుకు చిట్కాలు చెప్పడం ఆరంభించా. నెమ్మదిగా ఫాలోయర్లు పెరిగారు. కానీ, ఆరునెలల పాటు ఒక్క అవకాశమూ రాలేదు. ఆ తర్వాత  దీపావళి సందర్భంగా మా ఇంటిని సర్దిపెడతారా అంటూ ఓ ఫోన్‌కాల్‌. వెళ్లి క్లయింట్‌ని కలిసొచ్చేవరకూ కూడా అది నిజమేనా అన్న సందేహమే. ఆ తర్వాత ఏడాదిన్నరపాటు ఒక్కదాన్నే ఆర్డర్లు తీసుకుని చేసొచ్చేదాన్ని. పాత ఇళ్లతో పాటు.. గృహప్రవేశమయ్యాక వారి అభిరుచికి తగ్గట్లు అందంగా సర్ది పెట్టేదాన్ని.  

ఎంతో శ్రమ ఉన్నా...

ముందుగా కస్టమర్‌ అవసరాలు ఏంటి? వాళ్ల బడ్జెట్‌ ఎంత? వంటివన్నీ అర్థం చేసుకున్నాక మేం పని మొదలుపెడతాం. చాలామంది మెమరీస్‌ అనీ, వారసత్వంగా వచ్చాయనీ చాలా వస్తువుల్ని వాడకుండా అలానే పెట్టేస్తుంటారు. పప్పులూ, ఉప్పుల్నీ ఏళ్ల తరబడి బూజుపట్టిస్తారు. ఇక, బొమ్మలు, దుస్తుల సంగతి సరేసరి. కొండలా పేరుకుపోతాయి. వాటిల్లో చాలా వాటిని కొన్న సంగతే గుర్తుండదు. వీటివల్ల ఉపయోగం ఉండదనుకున్న వాటిని డొనేట్‌ చేయిస్తాం. లేదంటే చెత్తలోకి వెళ్లిపోతాయి. ఏ ఇల్లూ ఒక్కలా ఉండదు. కాబట్టి, అక్కడ పనిని బట్టే ఛార్జ్‌ చేస్తాం. సర్దిపెట్టడానికి అవసరమైన ఆర్గనైజర్‌ బాక్సులు, వంటింట్లో డబ్బాలు వంటివన్నీ మేమే కొని తెస్తాం. అప్పటికే ఉంటే వాటినెలా ఉపయోగించొచ్చో చెబుతాం. మా ఇల్లు తిరిగి బాగుపడుతుందని మేమే నమ్మలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కుటుంబాలున్నాయి. ఇలా గత మూడేళ్లుగా మేం  సామాన్యుల ఇళ్లతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినీ, బుల్లితెర తారలెందరికో వాళ్ల ఇళ్లను చక్కబెట్టి ఇచ్చాం. వారిలో నటి నభా నటేష్‌, ఆస్మిత, లాస్య వంటివారెందరో ఉన్నారు. ఇబ్బందులన్నీ దాటి... ఉద్యోగం చేసిన దానికంటే రెట్టింపు ఆదాయం అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం నాతో పాటు మరో నలుగురు పనిచేస్తున్నారు. ఈ రెండేళ్లలో 160 మందికిపైగా కస్టమర్లకు సేవలందించాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్