చిన్నారి.. వ్యాపారవేత్త!

లాక్‌డౌన్‌లో ఏమీ తోచక పిల్లలంతా టీవీ, ఫోన్లకే అతుక్కుపోయారు. కేశిక కూడా అంతే! కాకపోతే తను మొబైల్‌ చూస్తూ నేర్చుకోవడం ప్రారంభించింది. వ్యాపకంగా మొదలుపెట్టి, ఏకంగా ఆంత్రప్రెన్యూర్‌ అయ్యింది. ఆ ప్రయాణమేంటో తెలుసుకుందాం.. రండి.

Updated : 15 Nov 2023 04:38 IST

లాక్‌డౌన్‌లో ఏమీ తోచక పిల్లలంతా టీవీ, ఫోన్లకే అతుక్కుపోయారు. కేశిక కూడా అంతే! కాకపోతే తను మొబైల్‌ చూస్తూ నేర్చుకోవడం ప్రారంభించింది. వ్యాపకంగా మొదలుపెట్టి, ఏకంగా ఆంత్రప్రెన్యూర్‌ అయ్యింది. ఆ ప్రయాణమేంటో తెలుసుకుందాం.. రండి.

ప్పుడు కేశిక 8వ తరగతి. లాక్‌డౌన్‌ రావడంతో కాలక్షేపానికి ఏదైనా చేయాలనుకుంది. ఆన్‌లైన్లో బేకింగ్‌ వీడియోలు ఆకర్షించడంతో సరదాగా వంట నేర్చుకుంది. ఊరగాయల దగ్గర్నుంచి కేకుల వరకు చకాచకా చేసేసేది. రుచి కూడా అద్భుతంగా ఉండటంతో అక్క క్రితిగా ‘సొంత బ్రాండ్‌ పెట్టొచ్చుగా’ అని సలహానిచ్చింది. ఆ ఆలోచన నచ్చిన కేశిక ‘కేస్‌ కిచెన్‌’ ప్రారంభించింది. అప్పటికి తన వయసు 12 ఏళ్లే! ఈమెది చెన్నై. నైపుణ్యం పెంచుకోవడానికని బేకింగ్‌లో మాస్టర్స్‌నీ పూర్తిచేసింది. ఓవైపు చదువుతూనే వ్యాపారం నిర్వహించింది. తెలిసిన వాళ్ల దగ్గర్నుంచి పుట్టినరోజులు, పెళ్లిళ్లకు కేకులు చేసిచ్చే స్థాయికి చేరింది. కొద్దికాలంలోనే తన బ్రాండ్‌కి చెన్నైలో గుర్తింపు తెచ్చుకుంది. అంతా బాగా సాగుతోంటే తరగతులు ప్రారంభమయ్యాయి. స్కూలుకెళుతూ బ్రాండ్‌ నిర్వహణ కష్టమైంది. దీంతో రెండు నెలలు వ్యాపారాన్ని పక్కన పెట్టింది. కానీ తెలియని లోటు. దీంతో ఏం చేయొచ్చా అని ఆలోచించించింది కేశిక. రెంటిని సమన్వయం చేసుకునే మార్గం ఓపెన్‌ స్కూలింగ్‌ రూపంలో దొరకడంతో అటువైపునకు మారింది.

‘యంగ్‌ అచీవర్‌గా ఎంపికవడమే కాదు.. నాపై ఓ మ్యాగజైన్‌లో కథనం కూడా ప్రచురితమైంది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఇలా ఎంపికైన యంగ్‌ అచీవర్లతో తన పుట్టినరోజు నిర్వహించుకోవాలి అనుకున్నారు. అలా ఆయన్ని కలిసే వీలు దక్కడమే కాదు.. స్వయంగా నా చేత్తో కేక్‌నీ తయారు చేసిచ్చా. దాన్ని రుచి చూసి, ఆయన ప్రశంసిస్తోంటే చాలా ఆనందమేసింది. ఆ క్షణాన్ని ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటా’ అంటోంది కేశిక. నేర్చుకోవడం దగ్గర్నుంచి.. వ్యాపారం పెట్టడం వరకూ అమ్మా నాన్నలు ప్రోత్సహించడం వల్లే ఈ స్థాయికి చేరనంటుందీమె. ‘సరైన మార్గదర్శకత్వం ఉంటే ఎవరైనా కలల్ని నెరవేర్చుకోవచ్చు. నేను బేకింగ్‌ మొదలు పెట్టినప్పుడు మా ఇంట్లో అవెన్‌ కూడా లేదు. నా ఆసక్తిని గమనించి అమ్మానాన్నలు నా పుట్టిన రోజుకి బహుమతిగా కొనిచ్చారు. అలాంటిదిప్పుడు నాకు సొంత బేకింగ్‌ స్టూడియోనే ఉంది.

వండటమే కాదు.. బేకింగ్‌ వర్క్‌షాపులు, తరగతులు కూడా నిర్వహిస్తున్నా’ననే కేశిక ప్రస్తుతం ఇంటర్‌ చదువుతోంది.
పబ్లిక్‌ స్పీకర్‌గా, యూట్యూబ్‌ యాంకర్‌గానూ సత్తా చాటుతోంది. ఈ నైపుణ్యాలే తనకు టెడెక్స్‌ వేదిక మీదా మాట్లాడే అవకాశం కలిగించాయి. కేశిక జంతు ప్రేమికురాలు కూడా. చెన్నైలోని ఓ ఎన్జీవోకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. దీని ద్వారా మూగజీవులకు ఆహారంతోపాటు వాటిని దత్తత తీసుకునే డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. ‘చదువునీ, అభిరుచుల్నీ సరిగా సమన్వయం చేసుకోగలమన్న ధీమా ఇవ్వండి.. ఇంట్లోవాళ్లూ ప్రోత్సహిస్తార’ంటూ తోటివారికి సలహానీ ఇస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్