మధ్యతరగతివారి కోసమే ఈ క్లినిక్‌లు!

క్యాన్సర్‌ వ్యాధి రోగిని మరణం వరకూ తీసుకెళ్తే... చికిత్స... కుటుంబాలనూ, వారి ఆర్థిక స్థితిగతులనూ చిదిమేస్తుంది. అయినవాళ్లను మానసికంగా కుంగదీస్తుంది. కానీ, దాన్ని ముందుగా గుర్తిస్తే ముప్పు నుంచి బయటపడొచ్చంటారు వైద్యులు.

Updated : 17 Nov 2023 07:19 IST

క్యాన్సర్‌ వ్యాధి రోగిని మరణం వరకూ తీసుకెళ్తే... చికిత్స... కుటుంబాలనూ, వారి ఆర్థిక స్థితిగతులనూ చిదిమేస్తుంది. అయినవాళ్లను మానసికంగా కుంగదీస్తుంది. కానీ, దాన్ని ముందుగా గుర్తిస్తే ముప్పు నుంచి బయటపడొచ్చంటారు వైద్యులు. ఆ ఆలోచనతోనే... మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండేందుకు, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చిన్న పట్టణాల్లో సయాన్‌ క్యాన్సర్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు హైదరాబాద్‌కి చెందిన సోనాలీ శృంగారం. ఇందులో భాగంగానే వేలమందికి ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆవిడ ప్రయాణాన్ని మనమూ తెలుసుకుందామా!

‘సమస్యల్లోంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయంటారు కదా. సయాన్‌ క్యాన్సర్‌ క్లినిక్స్‌ కూడా అలా ఏర్పాటైనవే. బీటెక్‌ అయ్యాక ఐఎస్‌బీ హైదరాబాద్‌ నుంచి ఎంబీఏ పూర్తి చేశా. వృత్తిరీత్యా ఐటీ ఇంజినీర్‌ని. పన్నెండేళ్ల పాటు యాక్సెంచర్‌లో ఉద్యోగిగా న్యూజిలాండ్‌, సింగపూర్‌, యూకేల్లో పనిచేశా. మాతృదేశంలో స్థిరపడాలన్న ఆలోచనతో ఇక్కడకొచ్చి.. ఉద్యోగ ప్రయత్నాలు చేశా. ఇక్కడ సీనియర్‌ మహిళా ఉద్యోగులూ, తల్లుల అవసరాలకు తగ్గట్లు పనివేళలూ, విధానాలు లేవనే విషయం గుర్తించా. దీంతో ఆ ప్రయత్నాలు మాని, నేనే సొంతంగా  వ్యాపారం చేయాలనుకున్నా. ఆ ఆలోచనల్లో ఉన్న సమయంలోనే మా కుటుంబ సభ్యుల్లో ముగ్గురు క్యాన్సర్‌ బారిన పడటంతో వారిని తరచూ చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లేదాన్ని. అలా వెళ్లినప్పుడే ఆ వ్యాధి, చికిత్స మూలంగా మానసికంగా, ఆర్థికంగా కుంగిపోయి, చితికిపోయిన వారెందరినో అక్కడ చూశా. వీరంతా ఎక్కడెక్కడి నుంచో నగరాలకు వస్తారని తెలిసి ఆశ్చర్యపోయా. ఆ తర్వాతే క్యాన్సర్‌ చికిత్స మెట్రో నగరాలకే పరిమితం కాకుండా జిల్లా కేంద్రాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ కూడా అందుబాటులో ఉంటే బాగుండనిపించింది. ఆసుపత్రుల వద్ద నిరీక్షణ, రేడియేషన్‌, కీమో థెరపీలకోసం దూరం ప్రయాణించాల్సిన పరిస్థితినీ, ప్రయాణ, చికిత్స ఖర్చుల భారాన్నీ తగ్గించేందుకు ఇవి ఉపయోగపడాలనుకున్నా. ఇందుకోసమే వంద కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రామీణులు ఈ సేవల్ని అందుకునేలా ‘సయాన్‌’ పేరుతో క్యాన్సర్‌ క్లినిక్‌లను తీసుకొచ్చా. అయితే వీటి కోసం ప్రత్యేక భవంతులు ఏర్పాటు చేయకుండా, ఆయా ప్రాంతాల్లో ఉండే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే ఆంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశా.

అదే కష్టమైన పని...

అలా ఆంకాలజీ రంగంలోకి అడుగుపెట్టి పదకొండేళ్లు అవుతోంది. అందులో ఏడేళ్లు క్షేత్ర స్థాయి పరిశోధనలే. ఈ క్రమంలోనే క్యాన్సర్‌ బాధితులు, వారి కుటుంబాలకోసం దేశంలోనే మొట్టమొదటి క్యాన్సర్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశాం. దీనిద్వారా 8 భాషల్లో 45,000 మంది రోగులకు మార్గనిర్దేశనం చేశాం. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లతో పాటు మధుమేహం, రక్తపోటు నిర్ధారణ కోసం పన్నెండు జిల్లాల్లో 31లక్షల మందికి పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సహకారమందించాం. ఇక, సయాన్‌ క్యాన్సర్‌ క్లినిక్స్‌లో క్లినికల్‌ ప్రోటోకాల్‌ని అనుసరించి శస్త్రచికిత్సలు చేస్తాం. కీమో, రేడియేషన్‌ థెరపీలు అందిస్తాం. పేషెంట్‌ ఆర్థిక పరిస్థితి, అవసరాన్ని బట్టి చికిత్సనూ కస్టమైజేషన్‌ చేస్తాం. క్యాన్సర్‌ బాధిత కుటుంబాలకు సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు వారు క్యాన్సర్‌ ముప్పుని ఎదుర్కోవడానికి అవసరమైన ముందు జాగ్రత్తలనూ చెబుతాం. అయితే, మనదేశంలో క్యాన్సర్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయడమనే విషయం కొత్తది కావడంతో మొదట్లో రోగుల్ని రప్పించడం కంటే నిపుణులైన వైద్యులను నియమించుకోవడమే పెద్ద సమస్యగా ఉండేది. కాలక్రమంలో అది పరిష్కారమైంది. తెలంగాణలోని హైదరాబాద్‌, వికారాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, సదాశివ్‌పేట్‌....వంటి పలు పట్టణాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోనూ సేవలందిస్తున్నాం.

వేలమందికి ఉచితంగా...

క్యాన్సర్‌ని ప్రారంభదశలో గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ఆ ఆలోచనతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్‌ నిర్ధరణ కోసం అల్పాదాయ వర్గాలకు ఉచిత స్క్రీనింగ్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాం. లయన్స్‌ క్లబ్‌, తార్నాక విమెన్స్‌ అసోసియేషన్‌, జీహెచ్‌ఎంసీ, జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌, ఫీనక్స్‌ గ్రూపుల సహకారంతో ఇప్పటివరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 120కిపైగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంపులు నిర్వహించి వేలమందికి పరీక్షలు నిర్వహించాం. ఏటా అరవై లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంటాం. ఈ రెండు పనులూ దేశ విదేశాలు తిరిగినా రాని సంతృప్తినిస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్