రాక్షసబల్లి.. రాకుమారి!

ఆ ఊర్లో ఎక్కడకు వెళ్లినా రాక్షస బల్లుల గురించిన కథలే వినిపించేవి. ఆ సంగతులే రాజ కుటుంబంలో పుట్టిన ఆలియా సుల్తానా బాబీనీ ఆకర్షించాయి. డైనోసార్‌ల గురించి తెలుసుకోవడమే కాదు, వాటి గురించిన విశేషాలని భవిష్యత్‌ తరాలకి అందించడానికి ఓ పార్కునే నిర్మించారామె.

Updated : 17 Nov 2023 05:12 IST

ఆ ఊర్లో ఎక్కడకు వెళ్లినా రాక్షస బల్లుల గురించిన కథలే వినిపించేవి. ఆ సంగతులే రాజ కుటుంబంలో పుట్టిన ఆలియా సుల్తానా బాబీనీ ఆకర్షించాయి. డైనోసార్‌ల గురించి తెలుసుకోవడమే కాదు, వాటి గురించిన విశేషాలని భవిష్యత్‌ తరాలకి అందించడానికి ఓ పార్కునే నిర్మించారామె. అందుకే ఆమెని అభిమానంగా డైనోసార్‌ ప్రిన్సెస్‌ అని పిలుస్తారంతా..

ఆలియా సుల్తానాది గుజరాత్‌లోని ఖేరాజిల్లాలో ఉన్న రైయోలీ గ్రామం. తండ్రి నవాబ్‌ మహ్మద్‌ సలాబత్‌ఖాన్‌, తల్లి బేగం ఫర్హాత్‌ సుల్తానా. ఆలియా ఆరేళ్ల చిన్నారిగా ఉన్నప్పుడు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) నుంచి ఓ శాస్త్రవేత్తల బృందం వచ్చి కొన్ని పరిశోధనలు చేసింది. అప్పుడే అక్కడ డైనోసార్‌ గుడ్లూ, దంతాలూ, ఎముకలూ బయటపడ్డాయి. ఈ విశేషం గురించి ఆ నోటా, ఈ నోటా పడి.. ఆలియా చెవిన పడింది. ‘1991లో మా గ్రామంలో రాక్షస బల్లుల గుడ్లు దొరికాయి. ఆ తర్వాత మా ఊర్లో చాలా చోట్ల ఈ శిలాజాలు బయటపడ్డాయి. వాటి గురించి నాన్నతో ఆశ్చర్యంగా చెప్పేదాన్ని. నా ఆసక్తిని గమనించిన నాన్న నేను డిగ్రీ చేశాక అక్కడకొచ్చే విదేశీ శాస్త్రవేత్తలతో మాట్లాడి, వాళ్లకి సాయం చేసే బాధ్యత అప్పగించారు. అలా ఈ పరిశోధనా ప్రపంచంలోకి అడుగుపెట్టా. రెండేళ్లపాటు శాస్త్రవేత్తల బృందంతో కలిసి తిరిగా. ఓసారి మా అమ్మ మేం పనిచేసే చోటికి వచ్చి, ఒక బండరాయిపై నిలబడింది. ఆమెతో ‘మీరొక డైనోసార్‌పై నుంచున్నారని తెలుసా?’ అన్నాడో సైంటిస్ట్‌. ఆ తర్వాత నా దృష్టి చుట్టూ ఉన్న శిలాజాలపై పడింది. నా ఆసక్తిని గుర్తించి శాస్త్రవేత్తలు.. శిలాజాలను గుర్తించడం నేర్పించారు. అలా ఓసారి ఓ పెద్దావిడ రోజూ పచ్చడి నూరుతున్న రాయి.. డైనోసార్‌ గుడ్డుగా గుర్తించానంటా’రు ఆలియా.

వాటికోసం పార్క్‌..

రైయోలీ గ్రామంలో.. ఏడు రకాల జాతులకు చెందిన డైనోసార్‌ల అవశేషాలు లభ్యమయ్యాయి. 30 అడుగులెత్తున్న అతిపెద్ద జాతి ఇక్కడ ఉన్నట్టుగా ఆలియా బృందం గుర్తించింది. ‘గ్రామీణులకు శిలాజాలను నాశనం చేయకూడదనే అవగాహన కలిగించేదాన్ని. కానీ చుట్టుపక్కల వారంతా ఆసక్తితో మా గ్రామానికి రావడంతో, ఇక్కడి అవశేషాలను రక్షించడం మావల్ల కాలేదు. వీటిని రేపటి తరం చూడాలంటే భద్రపరచడం ముఖ్యమనిపించింది. అప్పటివరకు దొరికిన 1000 డైనోసార్‌ గుడ్లను జాగ్రత్తగా పరిరక్షించాలి. వాటి శిలాజాలను సంరక్షించాలంటే మా గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం మంచిదని ప్రభుత్వాన్ని కోరా. అలా ప్రభుత్వ సహకారంతో మా గ్రామాన్ని డైనోసార్‌ మ్యూజియంగా మార్చి, ఇందులో 50 డైనోసార్ల శిల్పాలు, గుడ్లు, 3డీ ప్రొజెక్షన్లు వంటివెన్నో ఏర్పాటు చేశాం. డైనాసార్‌ శిలాజాలున్న రెండో అతి పెద్ద ప్రాంతంగా నిలిచింది మాఊరు. దేశవిదేశాల నుంచి ఇక్కడకు పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంత విశిష్టత, డైనోసార్‌ మనుగడ గురించి చెప్పడానికి నేనిప్పుడు టూరిస్ట్‌ గైడ్‌గా మారా’ అంటున్న ఆలియా కృషికి పలు పురస్కారాలూ అందాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్