కిరీటం కాదు.. మనసులు గెలుచుకుంది!

శ్వేతాశార్ద... మనదేశం తరఫున మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో పాల్గొన్న అమ్మాయి. ఆమె కిరీటం గెలుచుకుంటుందని కోట్లాది మంది భారతీయులు ఉత్కంఠగా ఎదురు చూశారు.  కానీ దాన్ని సాధించలేకపోయింది. అయితేనేం అందరి మనసుల్నీ గెలుచుకుంది.

Published : 20 Nov 2023 12:37 IST

శ్వేతాశార్ద... మనదేశం తరఫున మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో పాల్గొన్న అమ్మాయి. ఆమె కిరీటం గెలుచుకుంటుందని కోట్లాది మంది భారతీయులు ఉత్కంఠగా ఎదురు చూశారు.  కానీ దాన్ని సాధించలేకపోయింది. అయితేనేం అందరి మనసుల్నీ గెలుచుకుంది. ఎందుకంటే, తన ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్లను, కన్నీటి చెలమలను దాటుకుంటూ... ఇంతవరకూ వచ్చిందామె..

‘పోటీ ఏదైనా గెలుపోటములు సహజం. విజయం సాధించలేకపోతే జీవితాన్ని కోల్పోయినట్లు కాదు... మరో అవకాశం మనకోసం ఎదురుచూస్తుందని నమ్ముతా. అదే నన్ను ప్రపంచ వేదికపై భారత్‌ తరఫున పోటీలో నిలబెట్టింది. ఆ క్షణం ముందు వరకూ కూడా ఎన్నో కఠిన పరీక్షల్ని ఎదుర్కొన్నా. అడ్డొచ్చిన ప్రతి అవాంతరాన్నీ ఆత్మవిశ్వాసంతో దాటేయాలనే స్ఫూర్తి మా అమ్మే నాకిచ్చింది’ అంటోంది శ్వేత. జీవితానుభవాలే పాఠాలు నేర్పుతాయని చెప్పే శ్వేత శార్దది చండీగఢ్‌. ప్లస్‌ టూ వరకూ అక్కడే చదువుకుంది.

అన్నీతానై...

మిస్‌ దివా యూనివర్స్‌- 2003’గా గెలిచిన క్షణం శ్వేత.. ‘అమ్మ కష్టానికి నేనిచ్చే బహుమతి’ అంటూ ఉద్వేగానికి లోనయింది. అది చూసిన ఆమె తల్లి సుహానా దావ్రా హృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది. ఇందుకు కారణం లేకపోలేదు.. శ్వేత చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. తమ్ముణ్నీ, తననీ పెంచి పెద్ద చేసే క్రమంలో తల్లి పడిన కష్టాల్ని దగ్గర్నుంచి గమనించిన శ్వేత ఆమెను గర్వపడేలా చేయాలనుకుంది. ‘అమ్మా, నాన్నలు విడాకులు తీసుకున్న రోజు ఇప్పటికీ గుర్తుంది. వారు విడిపోకూడదని ఎంతగానో అనుకున్నా. వాళ్లు విడిపోయాక మానసికంగా కుంగిపోయా. కానీ అమ్మ మాలో ఆత్మవిశ్వాసం నింపింది. మాకు మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయాలని తన జీవితాన్నే త్యాగం చేసింది’ అని గుర్తు చేసుకుంటుంది శ్వేత.

ఎనిమిది గంటల సాధనతో...

ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ కావాలన్నది శ్వేత కల. అందుకు తన ఇంటి ఆర్థిక పరిస్థితులు సహకరించవని తెలిసి... తన కాళ్లపై నిలబడాలనుకుంది. పదహారేళ్ల వయసులో ముంబయి చేరుకుంది. ఓ పక్క దూరవిద్యలో డిగ్రీ చేస్తూనే, రోజూ ఎనిమిది గంటల పాటు నృత్య సాధన చేసేది. తనపై తనకి నమ్మకం కలిగాక అవకాశాలకోసం ప్రయత్నించింది. తొలి ఆడిషన్‌లోనే వైఫల్యం. ఆ తర్వాత ప్రయత్నంలో ఓ అవకాశం దొరికింది. అది మొదలు డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌, డ్యాన్స్‌ దీవానే, డ్యాన్స్‌ ప్లస్‌... వంటి రియాల్టీ షో టైటిళ్లు గెలుచుకుంది. ఝలక్‌ దిఖ్‌లాజా’ షోకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే మాధురీదీక్షిత్‌తో పాటు దీపికా పదుకొణె, సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌ వంటివారికి కొరియోగ్రఫీ చేసే అవకాశం లభించింది.

గెలవలేదు కానీ..

‘నా కొచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదు. అందుకే అందాల పోటీల్లో నన్ను నేను నిరూపించుకోవలనుకున్నా. నావంతు ప్రయత్నం చేశా. కానీ చేరుకోలేకపోయా. అలాగని ఏమీ నిరాశపడటం లేదు...ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకుంటా’ అంటోంది శ్వేత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్