అమెరికాలో... తెలుగు రైతు!

అమెరికా కాదు.. అంతరిక్షం వెళ్లినా మన ఆవకాయ రుచి తగిలితే ప్రాణం లేచొస్తుంది! రుచులతో మనకున్న అనుబంధం అలాంటిది.. దీన్ని గమనించిన విశాలి అమెరికాలో మన కాయగూరలు.. అదీ సేంద్రియ విధానంలో సాగు చేస్తోంది.

Updated : 23 Nov 2023 02:44 IST

అమెరికా కాదు.. అంతరిక్షం వెళ్లినా మన ఆవకాయ రుచి తగిలితే ప్రాణం లేచొస్తుంది! రుచులతో మనకున్న అనుబంధం అలాంటిది.. దీన్ని గమనించిన విశాలి అమెరికాలో మన కాయగూరలు.. అదీ సేంద్రియ విధానంలో సాగు చేస్తోంది. ఆ కాయగూరలకున్న ఆదరణ తెలుసుకోవాలనుకుంటున్నారా?

మాది మోత్కూరు పురపాలిక పరిధిలోని ఆరెగూడెం. నాన్న కొణతం బక్కారెడ్డికి వ్యవసాయమంటే చాలా ఇష్టం. నా పీజీ అయ్యాక.. శ్రీధర్‌రెడ్డితో 2005లో వివాహమయ్యింది. ఆయనతో కలిసి అమెరికా వచ్చేశా. ఆయన వర్జీనియాలోని లౌడెన్‌ కౌంటీలో ఐటీ ఉద్యోగి. నేను కూడా ఓ పక్క ఉద్యోగం చేస్తూనే, ఖాళీ సమయంలో ఇంటి పెరట్లో కూరగాయల సాగు చేపట్టాను. ఏడేళ్లు సాగు చేశాక మరికొన్ని మెలకువలు తెలిశాయి. కాస్త ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. భూమిని లీజుకు తీసుకుందామని చాలా చోట్ల వెతికా. చివరికి ఎకరం భూమిలో వ్యవసాయాన్ని ప్రారంభించా. మన తెలుగు ప్రాంతాల్లో దొరికే దోస, టొమాటో, పొట్లకాయ, కాకరకాయ, సొరకాయ, పచ్చిమిర్చి, బెండకాయ, ఉల్లిగడ్డ, వెల్లుల్లి లాంటి 43 రకాల భారతీయ పంటలను సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నా. సాధారణంగా ఇక్కడ.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచినవి కొనుక్కుంటాం. నేను పండించిన తాజా కూరగాయలు, ఆకుకూరల్ని రెస్టారెంట్లకు, స్టోర్లకు కాకుండా వినియోగదారులకే  నేరుగా అమ్ముతున్నా. వారు ఈ తాజా కాయగూరల్ని పోటీపడి కొనుక్కుంటున్నారు. వందకుపైగా కుటుంబాలు మా వద్ద ఈ కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేస్తున్నారు. దగ్గర్లో ఉన్న వారికి ఇంటికే పంపిస్తా. మరో ఐదెకరాల్లో ఈ సేంద్రియ సాగును విస్తరిస్తున్నా.

ఏకైక మహిళా రైతుగా..

లౌడెన్‌ కౌంటీ డిపార్డ్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ వాళ్లు అంటే ఇక్కడి స్థానిక ప్రభుత్వం ఏటా పదిమంది ఉత్తమ రైతులను నామినేట్‌ చేస్తుంది. ఈ ఏడాది జాబితాలో ఉన్న ఏకైక భారతీయ మహిళా రైతుని నేను. ‘వ్యవసాయం కూడా ఒక వృత్తే’ అనే అవగాహన కలిగించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. వాళ్లు గుర్తించిన రైతుల వివరాలతో బుక్‌లెట్స్‌ ముద్రించి పంపిణీ చేస్తారు. సాగు విధానాలపై వీడియోలు తీసి ప్రదర్శిస్తారు. అలా ప్రభుత్వం గుర్తించిన రైతులు విద్యార్థులని వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లి సాగు విధానాలపై అవగాహన కల్పించాలి. అలా ఇక్కడి పిల్లలకు నేను రైతుగా పరిచయమవ్వడం గర్వంగా ఉంది.

ఆఫీస్‌ పనిచేస్తూ..

ఉదయమే వ్యవసాయ పనులు చేసుకుని తర్వాత ఆఫీసుకెళ్తాను. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో వ్యవసాయానికే ప్రాధాన్యం ఇస్తా. నాన్న నుంచి నేర్చుకున్న మెలకువలే ఇవన్నీ. రానున్న రోజుల్లో సీజనల్‌ పండ్లూ, డెయిరీ ఏర్పాటు చేసి నాణ్యమైన పాలు, పెరుగు అందించాలని ఉంది.

-ఎస్‌.ఎన్‌.చారి, మోత్కూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్