అది ఇడ్లీ పిండే కాదన్నారు!

రెండుసార్లు అబార్షన్‌ అయ్యింది... కారణం థైరాయిడ్‌! పరిష్కారం కోసం వెతికితే చిరుధాన్యాలు వరంలా కనిపించాయి.

Published : 26 Nov 2023 02:11 IST

రెండుసార్లు అబార్షన్‌ అయ్యింది... కారణం థైరాయిడ్‌! పరిష్కారం కోసం వెతికితే చిరుధాన్యాలు వరంలా కనిపించాయి. వాటిని నలుగురికీ పరిచయం చేయాలని వాటితో ఇడ్లీ, దోసెపిండ్లు తయారుచేస్తూ వ్యాపారవేత్తగా ఎదిగారు తమిళనాడుకు చెందిన సుభద్ర...

మిళనాడులోని కోవైకి చెందిన సుభద్ర ఎంటెక్‌ చేసి ఓ విద్యాసంస్థలో ప్రొఫెసర్‌గా చేరారు. తర్వాత డీన్‌గా, హెచ్‌ఆర్‌ హెడ్‌గా పదోన్నతులు సాధించారు. వీటికితోడు తల్లికాబోతున్నానని తెలిసి చాలా సంతోషించారు. కానీ ఆ గర్భం నిలవలేదు. ఇలా జరగడం రెండోసారి. దాంతో బాగా కుంగిపోయారామె. దీనికి కారణం థైరాయిడ్‌ అని తేలింది. వైద్యుల సూచనలతో తృణధాన్యాలని ఆహారంలో భాగం చేసుకోవడం మొదలుపెట్టి కోలుకున్నారు. తనలా ఇబ్బందులు పడుతున్నవారికి చిరుధాన్యాలతో ఓ పరిష్కారం అందించాలనుకున్నారు. ఇందుకోసం మైసూరు సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో తృణధాన్యాలపై అధ్యయనం చేశారు. ‘మిల్లెట్స్‌ని వేయించి పొడి చేస్తే పోషకాలు 45 శాతం తగ్గుతాయి. అదే నానబెట్టి రుబ్బితే 90 శాతం ఉన్నట్లు గుర్తించా. ఈ విధానంలో నిత్యం బిజీగా ఉండే నేటి మహిళల కోసం రెడీటుకుక్‌ ఉత్పత్తులుగా అందించాలనుకొన్నా. ఇంట్లో వారంతా ఉద్యోగాన్ని వదిలి, పిండి రుబ్బుతావా అన్నారు. కానీ ధైర్యం చేసి రూ.20 లక్షల పెట్టుబడితో ‘పీవీఆర్‌ ఫుడ్స్‌’ ప్రారంభించా’నంటారు సుభద్ర. 

ఇడ్లీ కాదన్నారు..

తృణధాన్యాలతో చేసిన రెడీమేడ్‌ ఇడ్లీ, దోసె పిండిని మొదట పెద్ద దుకాణానికి తీసుకెళ్లారు సుభద్ర. ‘ఇది ఇడ్లీ పిండా? తెల్లగా లేకపోతే అది ఇడ్లీ ఎలా అవుతుందని ఎవరూ ఆసక్తి చూపించలేదు. పోషకాల కన్నా, రంగుకే ప్రాధాన్యమిచ్చారు. పట్టుకెళ్లిన 200 పిండి ప్యాకెట్లని ఇంటికి తెచ్చి చుట్టుపక్కలవారికిచ్చి ఇడ్లీ చేసి రుచి చెప్పమన్నా. అలాగే నా విద్యార్థుల సాయంతో కళాశాలలు, కమ్యూనిటీ సెంటర్లు, ఫుడ్‌స్టాల్స్‌లో నేను చేసిన ఇడ్లీ, దోసె వంటివి ప్రదర్శించాం. క్రమేపీ వాటిలోని పోషకాల విలువ తెలుసుకొన్నవారంతా మా ఉత్పత్తులకు అభిమానులయ్యారు’ అంటున్న సుభద్ర గర్భిణిలు, చిన్నారులకోసం 83 రకాల ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నారు.

రోగుల కోసం.. 

సుభద్ర వద్ద 50మందికి పైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కలిగించడమే కాకుండా వారి వద్ద ధాన్యాలను కొనుగోలు చేస్తున్నారీమె. ‘మా ఉత్పత్తుల్లో రసాయనాలుండవు. మొదట్లో పట్టుమని 50 ప్యాకెట్లు కూడా అమ్మలేని మేము ఇప్పుడు రోజుకి 3 నుంచి 5వేల ప్యాకెట్లు అమ్మే స్థాయికొచ్చాం. పరిశ్రమలు, ఆఫీసులు, జిమ్‌ల వద్దా మా ఉత్పత్తులు ఉంచాం. పెద్ద ఆసుపత్రులకూ అందిస్తున్నాం. మా స్టార్టప్‌నకు రాష్ట్ర ప్రభుత్వం రూ.40 లక్షల నిధులు అందించింది. వచ్చే ఏడాదికి  మా వ్యాపారం కోటిరూపాయలకి చేరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా వీటిని ఎగుమతి చేయాలన్నదే మా లక్ష్యం’ అంటున్నారు సుభద్ర.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్