ఈ- వ్యర్థాలకు పరిష్కారమిచ్చి..

మార్కెట్‌లో కొత్తగా వచ్చిన ఏ ఫోన్‌ మోడల్‌ అయినా మన చేతిలో ఉండాలనుకుంటాం. మరి పాతదాని సంగతేంటి? ఒక్క ఫోన్‌ అనే కాదు.. కొండలా పేరుకుపోతున్న పాత ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పర్యావరణానికీ, మన ఆరోగ్యానికీ చేస్తున్న హాని అంతాఇంతా కాదు.

Updated : 28 Nov 2023 04:51 IST

మార్కెట్‌లో కొత్తగా వచ్చిన ఏ ఫోన్‌ మోడల్‌ అయినా మన చేతిలో ఉండాలనుకుంటాం. మరి పాతదాని సంగతేంటి? ఒక్క ఫోన్‌ అనే కాదు.. కొండలా పేరుకుపోతున్న పాత ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పర్యావరణానికీ, మన ఆరోగ్యానికీ చేస్తున్న హాని అంతాఇంతా కాదు. దీనికో పరిష్కారం అందించేందుకు ప్రయత్నించారు హైదరాబాద్‌ అమ్మాయిలు దియా లోక, సాహితీ రాధ. వీళ్ల ఆలోచన ప్రపంచవ్యాప్తంగా 450 బృందాలతో పోటీపడి యంగ్‌ వాయిస్‌ అవార్డుని గెలుచుకుంది. ఇంతకీ వీళ్లెవరంటే..

న దేశంలో ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం పెరుగుతోంది. అలాగే వాటినుంచి విడుదలయ్యే కార్సినోజెనిక్స్‌ అంటే క్యాన్సర్‌ కారకాలూ, పర్యావరణ కాలుష్య కారకాలూ పెరుగుతున్నాయి. అలాంటి ప్రమాదకర వ్యర్థాలు వీధుల్లో గుట్టలుగా పడిఉండటం గమనించారు సాహితి, దియా. ‘పారిశుద్ధ్య కార్మికులు, బాల కార్మికులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వాటిని చేతులతో తొలగిస్తున్నారు. అది చూశాక నా స్నేహితురాలు సాహితికీ నాకు వచ్చిన ఆలోచనే ‘ఈ- సైకిల్‌’. ఇదో స్వచ్ఛంద సంస్థ. దీన్ని మేము 9వ తరగతి చదువుతున్నప్పుడు మొదలుపెట్టాం. ఈ-సైకిల్‌ ప్రధాన లక్ష్యం.. స్కూళ్లు, కాలేజీలు, సొసైటీల నుంచి ఈ వ్యర్థాలను సేకరించటం. ఇప్పటి వరకూ పది డ్రైవ్‌లు నిర్వహించి.. వెయ్యి కేజీల వ్యర్థాలు సేకరించాం. రీసైకిల్‌, క్రాప్‌బిన్‌ అనే రెండు సంస్థల సాయం తీసుకుని పనిచేస్తున్నాం. 6 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు సెమినార్లు నిర్వహించి ఈ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ గురించి పాఠాలను చెబుతున్నాం’ అంటున్న దియా చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఇంటర్‌ చదువుతోంది. 

సమన్వయంతోనే..

‘మొదట్లో చదువు, ఎన్జీవోను సమన్వయం చేసుకోవడం కష్టంగానే ఉండేది. కొవిడ్‌ సమయంలో మాకు కాస్త సమయం దొరికింది. అప్పుడే మా ఆలోచనని ఎలా ముందుతీసుకెళ్లాలో ప్రణాళిక వేసుకున్నాం. మొదట్లో ‘చిన్నవయసు.. మీకు అనుభవం లేదంటూ’ మా ఆలోచనని కొట్టిపడేశారు చాలామంది. అయినా మేం పట్టు వదలకుండా ప్రయత్నించాం. అమెరికాకు చెందిన ‘టీచ్‌ ది ఫ్యూచర్‌’, ‘స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫ్యూచర్‌’ సంస్థలు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నిర్వహణపై ఓ పోటీ పెట్టాయి. 12- 17 ఏళ్ల వయసున్న వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. మాతో సహా ప్రపంచవ్యాప్తంగా 450 బృందాలు పోటీ పడ్డాయి. చాలా వడపోతల తర్వాత మా ‘ఈ -సైకిల్‌’ సంస్థ మూడోస్థానంలో నిలిచింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల విభాగంలో ‘నెక్ట్స్‌ జనరేషన్‌ ఫర్‌సైట్‌ ప్రాక్టీషనర్స్‌: యంగ్‌ వాయిసెస్‌ (ఎన్జీఎఫ్‌పీ- వైవీ) 2023 పురస్కారం మాకు లభించింది. తాజాగా యునెస్కోతోనూ భాగస్వాములయ్యాం. పారిశుద్ధ్య పనుల్లో, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నిర్వహణలో బాల కార్మికులు లేకుండా చేయడానికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు పాత ఎలక్ట్రానిక్‌ పరికరాలను డొనేట్‌ చేసి వాటిని ఉపయోగించుకొనేలా చేస్తున్నాం. యువత పర్యావరణ స్పృహతో మెలగాలన్నదే మా లక్ష్యం..’ అంటోన్న సాహితీ రాధ ‘ది ఫ్యూచర్‌ కిడ్స్‌’ స్కూల్‌లో ఇంటర్‌ చదువుతోంది. గతేడాది ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ)కి యంగెస్ట్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్