ఉగ్రవాదిని ఎదురొడ్డిన ధైర్యం!

2008 ముంబయి ఉగ్రదాడి..  ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన సంఘటన. ఆ దాడిలో బుల్లెట్టు దిగబడినా ధైర్యాన్ని చెక్కు చెదరనివ్వలేదు దేవికా రొటవాన్‌. పట్టుమని పదేళ్లు లేనమ్మాయి.. తనని నడవనీయకుండా చేసిన ఉగ్రవాది ముందు తడబడకుండా నిల్చొంది.

Updated : 01 Dec 2023 04:42 IST

2008 ముంబయి ఉగ్రదాడి..  ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన సంఘటన. ఆ దాడిలో బుల్లెట్టు దిగబడినా ధైర్యాన్ని చెక్కు చెదరనివ్వలేదు దేవికా రొటవాన్‌. పట్టుమని పదేళ్లు లేనమ్మాయి.. తనని నడవనీయకుండా చేసిన ఉగ్రవాది ముందు తడబడకుండా నిల్చొంది. వందల మంది ప్రాణాలు తీసింది ఇతనే అంటూ గుర్తించింది.  ఆ అమ్మాయి సాక్ష్యంతోనే అతనికి ఉరిశిక్ష పడింది. ఆ ధైర్యం.. ఇప్పుడెందరికో స్ఫూర్తి పాఠం!

అప్పటికి ఇంకా నెలరోజులే.. దేవిక పదో పుట్టినరోజు రావడానికి. అమ్మ రెండేళ్ల క్రితమే చనిపోయినా.. నాన్న ప్రేమలో గడుపుతోంది. మురికివాడలో నివాసం.. నాన్న అరకొర సంపాదనతోనే జీవితం. అయినా ఆనందంగానే గడుస్తున్నాయి రోజులు. ఆయన ఛత్రపతి శివాజీ రైల్వేస్టేషన్‌ దగ్గర చిన్న బండి మీద ఎండు ఫలాలు ప్యాకెట్లుగా చేసి అమ్ముతాడు. తండ్రి ఇంటికొచ్చి వండిపెడితేనే తిండి. ఆయనకు సాయపడొచ్చు కదాని అమ్మడానికి ట్రేలో ప్యాకెట్లు సర్దుకొని రైలు వద్దకు పరుగెత్తింది చిన్నారి దేవిక. ఉన్నట్టుండి బుల్లెట్ల వర్షం.. తన ముందున్న వాళ్లంతా తుపాకీ గుళ్లకి బలవుతోంటే.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు తీసింది. కానీ కాలికి బుల్లెట్టు తగలడంతో ఆ నొప్పికి వెంటనే స్పృహ కోల్పోయింది. బహుశా చనిపోయిందనుకున్నాడేమో.. ఉగ్రవాది ఆమెను దాటి ముందుకెళ్లాడు.

నీడ కోల్పోయి..

కళ్లు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉంది. రెండు నెలలు అక్కడే గడిచాయి. ఆ దాడిలో బతికి బయటపడ్డ పిన్న వయస్కురాలు దేవిక. నొప్పితో ప్రత్యక్ష నరకమే చూసింది. 11 సర్జరీలు.. ఆ వ్యధపై పగ తీర్చుకున్నట్లుగా తన స్థితికి కారణమైన కసబ్‌కు శిక్షపడేలా చేసింది. ‘ధైర్యవంతురాలు’ అంటూ పొగడ్తలు, వార్తా కథనాలు. మరోవైపు...  ఆ దాడి తర్వాత తండ్రి వ్యాపారం కుంటుపడింది. ఎక్కడికెళ్లినా ‘ఈమే కసబ్‌ను గుర్తించిం’దంటూ వేలెత్తి చూపించేవారు. కొందరు భయపడేవారు. ఇక స్కూల్లోనైతే ‘నీ వల్ల మాకూ ఆపద రావొచ్చ’ంటూ చేర్చుకోవడానికీ వెనకాడేవారు. ప్రభుత్వం నుంచి అందిన కాస్తా సాయం మందులకే సరిపోయింది. ఆ సమయంలో తన పరిస్థితి తెలిసి.. సేవా సంస్థలు ముందుకు రావడంతో తిరిగి చదువు మొదలుపెట్టింది. ఇంతలో సోదరుడి అనారోగ్యం వారి జీవితాలపై భారం మోపింది. దాన్ని రెట్టింపు చేస్తూ దేవిక టీబీ బారిన పడింది. స్వచ్ఛంద సంస్థల సాయంతో తిరిగి కోలుకుంటే.. నవీకరణ పేరుతో తనుండే మురికివాడను ఖాళీ చేయించారు. ఈసారి ఉన్న నీడ కూడా పోయింది. ముంబయి నగరం.. తిండికే కష్టమైన వాళ్లు వేలల్లో అద్దె ఎలా కట్టగలరు? చివరకు ఎలాగోలా కష్టపడి తక్కువ అద్దెతో ఒక గదిని తీసుకున్నారు. అలాగని ఆమెను అందరూ ఏమీ మర్చిపోలేదు. ముంబయి దాడుల చర్చ వచ్చినా.. భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ఏ సమస్య వచ్చినా దేవిక గుర్తొస్తుంది. ఆమె కథ తెరమీదకి వస్తుంది.

తన కథే స్ఫూర్తిపాఠంగా..

తన ధైర్యాన్ని ప్రశంసిస్తూ దేశవిదేశీ వేదికలపై మాట్లాడే అవకాశం అందుకుంది దేవిక. ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ సహా ఎంతోమంది ప్రముఖులను కలుసుకుంది. భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నో ప్రశంస పత్రాలు, పురస్కారాలు అందుకుంది. తన కథనే ఉదాహరణగా చెప్పి యువతలో స్ఫూర్తి నింపుతోంది. దేశవ్యాప్తంగా కళాశాలలకు వెళ్లి స్ఫూర్తిపాఠాలు చెబుతోంది. ఇప్పటికీ అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితే! డిగ్రీ పూర్తిచేసి.. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలని చూస్తోంది. అలాగని తనకు ఎవరిమీదా వ్యతిరేకత లేదు. ‘అంతిమంగా ఉన్నంతలో ఆనందంగా ఉన్నామా లేదా అనేదే చూస్తా’ననే ఈ పాతికేళ్ల అమ్మాయి..  లక్ష్యం పోలీసు అవ్వడం. ‘ధైర్యవంతురాలు అని అందరితో అనిపించుకోవడం కాదు.. ఖాకీ దుస్తులు ధరించాలి. దేశ ప్రజలను ఉగ్రవాదుల బారి నుంచి కాపాడాలి. అప్పుడే సార్థకత’ అంటోన్న దేవిక నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్