టిక్‌టాక్‌ కలిపింది.. ఇద్దరినీ!

కవలలు.. పురిట్లోనే వేరయ్యారు. పెరిగి పెద్దయ్యాక ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఒకే రూపు రేఖలను చూసుకొని ఆశ్చర్యపోయారు.. సినిమా కథలా అనిపిస్తోంది కదూ! కానీ ఈ అక్కాచెల్లెళ్ల విషయంలో నిజంగానే జరిగింది. వాళ్లెవరో.. ఆ కథేంటో తెలుసుకుందాం రండి.

Published : 03 Dec 2023 01:37 IST

కవలలు.. పురిట్లోనే వేరయ్యారు. పెరిగి పెద్దయ్యాక ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఒకే రూపు రేఖలను చూసుకొని ఆశ్చర్యపోయారు.. సినిమా కథలా అనిపిస్తోంది కదూ! కానీ ఈ అక్కాచెల్లెళ్ల విషయంలో నిజంగానే జరిగింది. వాళ్లెవరో.. ఆ కథేంటో తెలుసుకుందాం రండి..

అనో సార్టానియా.. జార్జియాకి చెందిన ఈ 21 ఏళ్లమ్మాయికి రెండేళ్ల క్రితం ఓ టిక్‌టాక్‌ వీడియో వచ్చింది. స్నేహితురాలు పంపిన వీడియో తెరిస్తే జుట్టుకు నీలిరంగు వేసుకున్న ఓ అమ్మాయిదది. చూసిన అనో షాకయ్యింది. ఆ వీడియోలో ఉన్నమ్మాయి అచ్చుగుద్దినట్లు తనలాగే ఉంది మరి. తన స్నేహితురాలు అనోనే అలా జుట్టుకు రంగేసుకుందేమో అనుకొని పంపిందట. అనో అది నేను కాదనేసరికి ఆ స్నేహితురాలూ ఆశ్చర్యపోయింది. ఇద్దరూ కలిసి ఇదెలా సాధ్యమా అని తెలుసుకోవాలనుకున్నారు. దీంతో ఆ వీడియోను ‘ఈమెవరో చెప్పగలరా?’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. కొన్నిరోజులకు ఆ వీడియోలో ఉన్నది ‘క్విటియా’ అంటూ గుర్తుపట్టడమే కాదు.. తన నంబరూ ఇచ్చారు. దానికి ఫోన్‌ చేసిన అనోకి వాళ్లిద్దరూ కవలలని తెలిసింది. తను కుటుంబం నుంచి ఎలా దూరమైందో కూడా అర్థమైంది. అక్కాచెల్లెళ్లమని తెలిశాక ఇద్దరూ కలుసుకున్నారు. ప్రసవం కష్టమవడంతో ఈ కవలల తల్లి కోమాలోకి వెళ్లిపోయిందట. వాళ్లకి అప్పటికే ముగ్గురు పిల్లలు. దీంతో వీళ్ల తండ్రి వీళ్లని పెంచడం భారమని అనోని వేరే వాళ్లకు దత్తత ఇచ్చాడు. అలా ఇద్దరూ వేరువేరుగా పెరిగారు. కథంతా తెలిశాక ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని చాలాసేపు అలాగే ఉండిపోయారట. ఇద్దరూ 250 కి.మీ. దూరంలోనే పెరిగినా కలుసుకోవడానికే రెండు దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు వీళ్ల కథ వైరల్‌ అవుతోంది. చూసిన వాళ్లంతా సినిమా కథలా ఉందంటున్నారు. ‘సోషల్‌ మీడియాతో నష్టాలే అనుకున్నాం.. ఇలా లాభాలు ఉన్నాయన్నమాట’ అని ఆశ్చర్యపోతున్నారు. మరి.. మీరేమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్