కృష్ణమ్మ స్వచ్ఛంగా ఉండాలని..

కాలుష్యం బారిన పడిన కృష్ణమ్మను చూసి చలించిపోయారామె. ఈతను ఆయుధంగా చేసుకొని.. నది పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. పతకాలను సాధిస్తూ మరింత మంది రాణించేలానూ చేస్తున్నారు శకుంతలా దేవి.

Published : 05 Dec 2023 01:27 IST

కాలుష్యం బారిన పడిన కృష్ణమ్మను చూసి చలించిపోయారామె. ఈతను ఆయుధంగా చేసుకొని.. నది పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. పతకాలను సాధిస్తూ మరింత మంది రాణించేలానూ చేస్తున్నారు శకుంతలా దేవి. ఆమెను మీరూ కలుసుకోండి...

 చిన్నతనం నుంచీ శకుంతలకు ఆటలంటే ప్రాణం. రన్నింగ్‌, త్రోబాల్‌, డ్యాన్స్‌, స్విమ్మింగ్‌.. ఇలా ఎన్నో ప్రయత్నించి, బహుమతులూ గెల్చుకున్నారు. కానీ వాటిని కెరియర్‌గా ఎంచుకోలేదు. తనది విజయవాడ. ఎంబీఏ చదివి, ఏసీసీ ఓవర్సీస్‌లో మేనేజర్‌గా చేస్తున్నారు. ఆరోగ్యం కోసమని వాకింగ్‌, రన్నింగ్‌ చేసేవారు. దీనికోసం ‘అవారా’ (అమరావతి వాకర్స్‌ అండ్‌ రన్నర్స్‌) అసోసియేషన్‌లో వలంటీరుగా చేరారు. మారథాన్‌ల్లోనూ పాల్గొన్నారు. తర్వాత కాలికి గాయమవడంతో వైద్యులు ఈతను సూచించారు. ‘మూడేళ్లుగా సాధన చేస్తున్నా. పరుగు తీసేప్పుడు వెంట ఓ సంచి తీసుకెళ్లేవాళ్లం. ఆ దారిలో చెత్తను శుభ్రం చేసి, మున్సిపాలిటీ వాళ్లకి అందించేవాళ్లం. కరోనా సమయంలోనూ దీన్ని కొనసాగించాం. కొన్నిచోట్ల పండ్ల మొక్కలనీ నాటాం. నిజానికి నేను చిన్నప్పుడే ఈత సాధన చేశా. కానీ అంత ప్రావీణ్యం లేదు. ఈసారి నదిలో ప్రయత్నిస్తోంటే కొత్తగా అనిపించింది. కాలుష్యంతో నిండిన కృష్ణానదిని చూసి బాధేసింది. దీన్నీ శుభ్రం చేయడం మొదలుపెట్టా’మని చెబుతారు శకుంతల.

అలా ఆరోగ్యం కోసమే ప్రయత్నించినా ఈతలో నైపుణ్యం సాధించారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు గ్రహించాక మరింత మందికి చేరువ చేయాలనుకుని పిల్లలు, మహిళలకు తర్ఫీదుని ఇవ్వడం మొదలుపెట్టారు. తనలోని నైపుణ్యాన్ని చూసి అవారా అధ్యక్షుడు డాక్టర్‌ కాట్రగడ్డ అజయ్‌ పోటీల్లోనూ పాల్గొనమని ప్రోత్సహించారు. అలా ఇటీవల చెన్నై వేదికగా జరిగిన ఓషన్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో బంగారు పతకం అందుకున్నారు. హుబ్బళ్లిలో జరిగిన కర్ణాటక ఓపెన్‌ మాస్టర్స్‌ క్రీడల్లో.. 5 స్వర్ణాలతో సత్తా చాటారు. కర్ణాటక జట్టుతో కలిసి మిక్స్‌డ్‌ రిలేలో రజతం సాధించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి మహిళా బృందం పోటీల్లో లేకపోవడంతో.. కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించా. నదిలో ఈతకు దిగి, ప్రాణాలు కోల్పోతున్న వాళ్లని చూశాం. అందుకే అవారా ఆధ్వర్యంలో ఈత శిక్షణ- ప్రాణ రక్షణ నినాదంతో.... మహిళలకు, చిన్నారులకు వారాంతాల్లో శిక్షణిస్తున్నాం. చాలామంది ఆడవాళ్లు ఇంటికే పరిమితమవుతున్నారు. వారిలో ఉత్తేజం, ఆత్మవిశ్వాసం నింపాలనుకున్నాం. అందుకే పదవీ విరమణ చేసినవారే కాదు గృహిణులకూ నేర్పుతున్నా’మంటున్నారీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్