చట్నీ క్షణాల్లో... నొప్పి మాయం!

చట్నీ బాగుంటే మరో నాలుగు ఇడ్లీలు ఎక్కువ లాగించేస్తాం... దోసెల్నీ ఓ పట్టుపడతాం. కానీ.. చట్నీ చేసేంత సమయం లేకపోతే? దీనికో పరిష్కారం అందించింది 25 ఏళ్ల సౌందర్య.. నెలసరి నొప్పంటే... చిగురుటాకులా వణకని అమ్మాయి ఉంటుందా? కానీ మాత్రలతో పనిలేకుండా తేలిగ్గా ధరించే పరికరాన్ని తయారుచేసింది 21 ఏళ్ల నిసా రెహ్మాన్‌.

Updated : 03 Jan 2024 07:03 IST

యువ పరిష్కారాలు

చట్నీ బాగుంటే మరో నాలుగు ఇడ్లీలు ఎక్కువ లాగించేస్తాం... దోసెల్నీ ఓ పట్టుపడతాం. కానీ.. చట్నీ చేసేంత సమయం లేకపోతే? దీనికో పరిష్కారం అందించింది 25 ఏళ్ల సౌందర్య.. నెలసరి నొప్పంటే... చిగురుటాకులా వణకని అమ్మాయి ఉంటుందా? కానీ మాత్రలతో పనిలేకుండా తేలిగ్గా ధరించే పరికరాన్ని తయారుచేసింది 21 ఏళ్ల నిసా రెహ్మాన్‌. ఈ యువ వ్యాపారవేత్తలు వసుంధరతో తమ ఆలోచనల్ని పంచుకున్నారు...


అమ్మకి నచ్చలేదు

 ఏదైనా తిని అంతా రుచి గురించి చెబుతోంటే.. నేను మాత్రం దానిలో ఏమేం వేశారా అని ఆలోచించేదాన్ని. ఆ ఇష్టంతోనే ఫుడ్‌ టెక్నాలజీలో బీటెక్‌ చేశా. మాది హైదరాబాద్‌. బీటెక్‌ చివర్లో నాన్న చనిపోయారు. కుటుంబం కోసం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. కానీ ఆలోచనలన్నీ వ్యాపారం మీదే! భిన్నరకాల ఆహారాలపై అధ్యయనం చేసేదాన్ని. ఆరోగ్యంగా ఉండాలంటే అల్పాహారం తప్పక తినాలి. సమయం లేదని దాన్నే మనం నిర్లక్ష్యం చేస్తాం. వారానికోసారి చేసి పెట్టుకుందామంటే చట్నీలేమో నిల్వ ఉండవు. ఈ దిశగా ఏమైనా చేయొచ్చా అని ఆలోచించా. అప్పుడే ఇన్‌స్టంట్‌ మిక్స్‌ ఆలోచన వచ్చింది. నాలుగేళ్లు జీతాన్ని పొదుపు చేసి పెట్టుబడి సమకూర్చుకొన్నా. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశా. అది చూసి ‘చదువుకొని చట్నీలు అమ్ముతావా’ అన్నారంతా. నా నిర్ణయం అమ్మకీ నచ్చలేదు. కానీ నా పట్టుదల చూసి కాదనలేకపోయింది. సహ వ్యవస్థాపకుడు సంపత్‌ పాలవరపుతో కలిసి రూ.10 లక్షలతో ‘సొంతంగా యమ్మీగా’ అని అర్థమొచ్చేలా ‘స్వ-యమ్‌’ ప్రారంభించా. మిల్లెట్స్‌తో ఇడ్లీ, దోశ పిండ్లతోపాటు ఆరు రకాల చట్నీల పొడులు మార్కెట్‌లోకి తెచ్చాం. పిల్లల కోసం తాటి బెల్లంతో కొబ్బరిచట్నీ మా ప్రత్యేకత. పచ్చి, ఎండు మిర్చి విడివిడిగా ఉంటాయి. కావాల్సినప్పుడు నీళ్లు కలిపితే చాలు.. చట్నీ సిద్ధం. పొడులు 6నెలలు నిల్వ ఉంటాయి. అందరికీ చేరువవ్వడానికి 8 నెలలు పట్టింది. పప్పులన్నీ చిత్తూరు రైతుల వద్ద తీసుకుంటున్నాం. 100 ప్యాకెట్ల ఆర్డర్‌ ఒకేసారి వచ్చినప్పుడు చాలా సంతోషమేసింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మార్కెటింగ్‌ చేస్తున్నాం. 10మంది మహిళలకి ఉపాధినిస్తున్నా. నచ్చింది చేస్తే తప్పక విజయం వరిస్తుందనడానికి నేనే ఉదాహరణ.


నా ఇబ్బంది నుంచే...

హైదరాబాద్‌లోని షాదన్‌ విమెన్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్‌సైన్స్‌ చదువుతున్నా. నాన్న అకౌంటెంట్‌. చాలామందిలానే నాకూ నెలసరి సమయం అంటే భయం. ఆ నొప్పి తట్టుకోలేక. ఇంటి చిట్కాలు, మందులు వాడేదాన్ని. దేనితోనూ పరిష్కారం దొరకలేదు. డాక్టర్లు మందులెక్కువగా వాడొద్దన్నారు. హీటింగ్‌ ప్యాడ్‌తో కాస్త ఉపశమనం దొరికేది. కానీ దాన్ని బయటకు తీసుకెళ్లలేనుగా! తేలిగ్గా వెంట తీసుకెళ్లగలిగే పరికరం తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. కళాశాలలోని తక్కిన అమ్మాయిలు ఆ సమయంలో ఎలా ఉపశమనం పొందుతున్నారో తెలుసుకుని వాళ్ల అభిప్రాయాలు కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని నెలల్లోనే ఓ పరికరం డిజైన్‌ చేశాను. కానీ దీని తయారీకి కావాల్సిన పెట్టుబడికి మాత్రం నెలలు పట్టింది. అలా 2022లో ‘నీఫ్‌’ పేరుతో పరికరాల తయారీ ప్రారంభించా. బ్యాటరీతో పనిచేసే నీఫ్‌ని మన వెంట తేలిగ్గా తీసుకెళ్లొచ్చు. ఉష్ణోగ్రతని మనకి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ పరికరం గురించి అవగాహన తీసుకొచ్చా. వైద్యులకీ నచ్చడంతో వాళ్లూ నొప్పితో బాధపడేవారికి వాడమని సలహా ఇస్తున్నారు. మొదటిసారి ఆర్డరొచ్చినప్పుడు చాలా సంతోషమేసింది. 2022లో ‘గూగుల్‌ డెవలపర్‌ స్టార్టప్‌ బూట్‌ క్యాంప్‌’నకూ ఎంపికయ్యా. అలాగే ‘గ్లోబల్‌ స్టూడెంట్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌’ పోటీకి ఎంపికై తుది జాబితాలో నిలిచా. ఈ పరికరం ఖరీదు రూ. 3 వేలు. భవిష్యత్తులో మహిళల ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని పరికరాలు డిజైన్‌ చేయాలనుంది. అన్నట్టు ఈ పరికరం ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత నొప్పి నుంచి ఉపశమనం కోసం నేను ఒక్క ట్యాబ్లెట్‌ కూడా తీసుకోలేదు. ‘నీఫ్‌’ నాలాంటివారికి ఉపయోగపడుతున్నందుకు తృప్తిగానూ ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్