భారత, భాగవతాలు.. అంతరిక్షం వైపు నడిపాయి!

మధ్యతరగతి అమ్మాయి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి మించిన విజయం ఏముంటుంది? కానీ ఈమె అది చాలని అనుకోలేదు. చుక్కలు దాటి అంతరిక్షం ఆనుపానులు తెలుసుకోవాలనుకుంది.

Updated : 08 Jan 2024 07:02 IST

మధ్యతరగతి అమ్మాయి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి మించిన విజయం ఏముంటుంది? కానీ ఈమె అది చాలని అనుకోలేదు. చుక్కలు దాటి అంతరిక్షం ఆనుపానులు తెలుసుకోవాలనుకుంది. అంతా వృథా ప్రయాస అన్నా.. ఆమె మాత్రం ప్రయత్నించింది. కలల ఇస్రోలోకి అడుగుపెట్టి.. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. అవ్వారు చందన.. ఆ ప్రయాణం మనతో పంచుకుందిలా..

అంతరిక్షంపై నా ఆసక్తికి రామాయణ, మహాభారత, భాగవతాలే కారణమంటే నమ్ముతారా? చిన్నప్పట్నుంచీ అమ్మమ్మ దగ్గరే పెరిగా. తనా కథలు చెబుతోంటే ఆకాశంపై ఆసక్తి కలిగింది. కృష్ణుడు నోట్లో బ్రహ్మాండం చూపించాడన్నప్పుడు అనంత విశ్వం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం. అందుకు ఏం చదవాలా అని స్కూలు స్థాయి నుంచే తెలుసుకునేదాన్ని. మాది వైయస్‌ఆర్‌ జిల్లాలోని కొత్తమాధవరం. ప్రభుత్వ పాఠశాలలోనే స్కూలు విద్య పూర్తిచేశా. పదిలో 509 మార్కులు సాధించా. కడపలోని జేఎంజే కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశా. అదయ్యాక టీటీసీ రాశా. దూరవిద్యలో డిగ్రీ చదువుతూనే ప్రభుత్వ ఉద్యోగానికీ ఎంపికయ్యా. నాపై నాకు ఆత్మవిశ్వాసం తీసుకొచ్చిన సందర్భమది. మధ్యతరగతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగానికి మించిన విజయం ఏముంటుంది? అంతా అదృష్టవంతురాలన్నా.. అందరు టీచర్లలో నేనొకదాన్ని. నాకంటూ ప్రత్యేకత తెచ్చేలా ఏదైనా చేయాలి అనిపించింది. చాలామంది దీంతో సరిపెట్టుకోమన్నా నా మనసు మాత్రం ఊరుకోలేదు.

చిన్ననాటి కలకే ఓటు

మేథ్స్‌, ఫిజిక్స్‌.. చాలామంది కష్టమంటే నేను మాత్రం ఇష్టంగా చదివా. అంతరిక్ష పరిధులు తెలుసుకోవాలంటే అవి రెండూ రావాలన్న కారణంతోనే వీటిపై మక్కువ పెంచుకున్నా. అలాంటి వాటిని మధ్యలోనే ఎలా వదిలేయను? ఉద్యోగాన్ని పక్కనపెట్టి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కల నెరవేర్చుకోవడానికి తిరిగి చదువు మొదలుపెట్టా. ఎంఎస్‌సీ ఫిజిక్స్‌నీ పూర్తిచేశా. నాలుగేళ్లు ఇస్రోలో చేరే అవకాశమున్న ప్రతిదీ ప్రయత్నించా. ఈ క్రమంలో ‘అనవసరంగా ఉద్యోగం వదిలేశావ్‌. మా పిల్లలు సెటిల్‌ అయ్యారు. నువ్వు మాత్రం ఇంకా పుస్తకాలు పట్టుకునే ఉన్నావేంటి’ లాంటివెన్నో విన్నా. కొందరైతే నాకు పెళ్లి చేసేయండని ఇంట్లో వాళ్లకు సలహాలూ ఇచ్చేవారు. నేనవేమీ పట్టించుకోకుండా సిద్ధమయ్యా. 2019లో ఇస్రో నిర్వహించిన ఐఐఎస్‌టీ ప్రవేశపరీక్షలో మూడు లక్షల మందితో పోటీపడి.. ఎంపికయ్యా. రెండేళ్ల శిక్షణ అనంతరం యంగ్‌ సైంటిస్ట్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం ఇస్రోకు అనుబంధంగా ఉన్న బెంగళూరులోని యుఆర్‌ రావ్‌ శాటిలైట్‌ విభాగంలో కమ్యూనికేషన్‌ విభాగంలో డిజైనర్‌గా పనిచేస్తున్నా. సీనియర్‌ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పరిశోధనలు సాగిస్తున్నా. రోజుకు దాదాపు 10 గంటలు శ్రమించా. ఈ క్రమంలో వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నా. చంద్రయాన్‌, ఆదిత్య మిషన్లతోపాటు చిన్న చిన్న ప్రయోగాల్లోనూ పాలు పంచుకున్నా. తాజా ఎక్స్‌పో శాట్‌కీ పనిచేశా. ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతమైనప్పుడు ప్రధాని మోదీ మా అందర్నీ
ప్రశంసించడం మర్చిపోలేను.


కష్టం కాదు..

సైంటిస్ట్‌ కల అన్నప్పుడు ‘అది చాలా కష్టం. నీ వల్ల కాదు’ అన్నవారే ఎక్కువ. పెద్ద సంస్థల్లో చదివిన వారికే అవకాశాలుంటాయని చాలామంది నమ్మకం. అమ్మమ్మ సాలమ్మ, అమ్మ ఆదిలక్ష్మి ప్రోత్సాహం వల్లే నేనెక్కడా నిరాశ పడలేదు. కానీ ప్రయత్నిస్తే ఎవరైనా సాధించొచ్చు. అదే చెబుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ముఖ్యంగా అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నా. పిల్లలకు స్పేస్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. లక్ష్యం నెరవేరిందని ఆగిపోవాలనుకోను. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరిన వారి కథలు చదివి స్ఫూర్తి పొందుతుంటా. ఒకప్పుడు అనుమానించినవాళ్లే నన్ను ఆదర్శంగా తీసుకుంటోంటే చాలా ఆనందంగా ఉంది. ఇస్రోలో ప్రతిభకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టే యువతకీ అవకాశాలు దక్కుతున్నాయి. ఎంతోమంది మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. వాళ్లలా డైరెక్టర్‌ స్థాయికి ఎదగాలన్నది నా కల.

 బోగెం శ్రీనివాసులు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్