బిగ్‌ బి మనవరాలి...ప్రాజెక్ట్‌ నవేలి

అమ్మమ్మ, తాతయ్య... మావయ్య, అత్త... దేశం మెచ్చిన నటులు. తనూ వాళ్లకి ఏమాత్రం తీసిపోదు. కోరుకుంటే అవకాశాలు ముంగిట్లోకి వస్తాయి. కానీ ఆమె లక్ష్యం వేరు... ఎనభై ఏళ్ల ఎస్‌కార్ట్స్‌ సంస్థకి సారథిగా బాధ్యతలు తీసుకుంది.

Updated : 15 Feb 2024 07:10 IST

అమ్మమ్మ, తాతయ్య... మావయ్య, అత్త... దేశం మెచ్చిన నటులు. తనూ వాళ్లకి ఏమాత్రం తీసిపోదు. కోరుకుంటే అవకాశాలు ముంగిట్లోకి వస్తాయి. కానీ ఆమె లక్ష్యం వేరు... ఎనభై ఏళ్ల ఎస్‌కార్ట్స్‌ సంస్థకి సారథిగా బాధ్యతలు తీసుకుంది. ఇరవైవేలమంది గ్రామీణ మహిళల్ని ముందుకు నడిపిస్తూ ‘ప్రాజెక్ట్‌ నవేలీ’తో సామాజిక వ్యాపారవేత్తగా మారింది. ఆమె మరెవరో కాదు బిగ్‌ బి మనవరాలు... 26 ఏళ్ల నవ్య నవేలీ నంద! 

తాతయ్య అమితాబ్‌ బచ్చన్‌ జగమెరిగిన నటుడు. అమ్మమ్మ జయాబచ్చన్‌. అమ్మ శ్వేతానంద... అలాంటి ఇంట్లో పుట్టిన అమ్మాయి కాబట్టి నవ్య కూడా సినిమాల్లోకి వస్తుందనే అనుకున్నారంతా. కానీ ఆమె ఆలోచనలు మాత్రం వేరేగా ఉన్నాయి. సామాజిక స్పృహ ఉన్న వ్యాపారవేత్తగా రాణించాలనుకుంది. కారణం... నవ్య తండ్రి నిఖిల్‌నంద ఎస్‌కార్ట్స్‌ కుబోటా అనే వ్యవసాయ పరికరాల తయారీ సంస్థకి అధిపతి. ‘దేశాభివృద్ధికి వ్యవసాయమే కీలకం అని నమ్మి 80 ఏళ్ల క్రితం తాతయ్య హరప్రసాద్‌ నంద స్థాపించిన సంస్థ ఇది. దానికితోడు నానమ్మ, నాన్న డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూడా వ్యాపారం గురించే మాట్లాడేవారు. ఇక మా అమ్మ శ్వేత రచయిత్రి, పబ్లిషర్‌. దాంతో నాకు నటనపై కన్నా, వ్యాపారంపైనే ఆసక్తి పెరిగింది’ అనే నవ్య లండన్‌లో చదువుకుంది. న్యూయార్క్‌లో ఫోర్డమ్‌ యూనివర్సిటీ నుంచి డిజిటల్‌ టెక్నాలజీలో పట్టా పుచ్చుకుంది. నాలుగేళ్ల క్రితం కుటుంబ వ్యాపారంలో చేరి శిక్షణ తీసుకుంది. ‘మా సంస్థ చేసే ఉత్పత్తుల్లో ట్రాక్టర్ల తయారీ కూడా ఒకటి. వీటి తయారీపై అవగాహన కోసం చెన్నై వెళ్లి మూడువారాల శిక్షణ తీసుకున్నా. ఒట్టి చేతులతో... నాలుగు రోజుల్లో ఒక ట్రాక్టర్‌ని బిగించేశా. అంతేనా ట్రాక్టర్‌ని అవలీలగా నడిపేస్తా తెలుసా’ అంటోన్న నవ్య జూనియర్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌గా సంస్థలో అడుగుపెట్టింది. అంతకంటే ముందే అంటే 2019లో గ్రామీణ మహిళల అభివృద్ధి కోసం ‘ప్రాజెక్ట్‌ నవేలీ’ అనే స్వచ్ఛంద సంస్థని మొదలుపెట్టింది.

తమ్ముడూ... నేనూ సమానం!

‘అమ్మమ్మ, నాయనమ్మల దగ్గర్నుంచీ మా ఇంట్లో ఎంతోమంది స్ట్రాంగ్‌ విమెన్‌ని చూశా. ఆ ప్రభావం నాపైనా ఎక్కువే. ఇంట్లో నన్నూ, తమ్ముడు అగస్త్యనీ సమానంగా పెంచారు. ఇంటికి ఎవరైనా వస్తే నేను బిజినెస్‌ గురించి మాట్లాడితే, వాడు టీ పెడతాడు. అలా ఉండటానికి మేం సిగ్గుపడం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ సమానత్వం ఉందా? లింగ వివక్ష, గృహహింస, నెలసరి శుభ్రత ఇలా ఎన్నో సమస్యలు. వీటి గురించి మహిళల్లో అవగాహన తీసుకురావాలనుకున్నా. అలా ప్రారంభమైందే ప్రాజెక్ట్‌ నవేలీ. ఆడవాళ్లు ఆర్థికంగా బలపడితే వివక్ష తగ్గుతుందని నా నమ్మకం. అందుకే వాళ్లకోసం ఆంత్రప్రె‘నారీ’ని మొదలుపెట్టాం. ఈ వేదికగా వాళ్ల కోసం ఉచితంగా బిజినెస్‌ రిసోర్స్‌, నెట్‌వర్కింగ్‌, వ్యాపార అవకాశాలు, శిక్షణ తరగతులు, మాస్టర్‌ క్లాస్‌లు, మెంటార్‌షిప్‌ సదుపాయాలు అందిస్తున్నాం. 20 వేలమందితో కలిసి పనిచేస్తున్నాం. అలాగే గృహహింసకు గురవుతున్న వారికి రక్షణగా ‘న్యారీ’ అనే ఉచిత న్యాయ సేవల సంస్థనూ నిర్వహిస్తోంది. ఈ సంస్థ మహిళల హక్కుల కోసం పనిచేస్తోంది. అలాగే మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికీ మెంటల్‌ హెల్త్‌ కౌన్సెలింగ్‌ అందిస్తాం’ అనే నవ్య అమ్మాయిల కలలకు రెక్కలు తొడగాలనుకుంటోంది. ఇందుకోసం ‘నిమాయ’ పేరుతో కాలేజీ అమ్మాయిలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ అందిస్తోంది. ‘ఏదో పేరుకి వాళ్లని వ్యాపారవేత్తలని చేయడం నా ఉద్దేశం కాదు. వాళ్లు ఆ రంగంలో స్థిరపడాలన్నదే నా లక్ష్యం’ అంటోంది నవ్య.

చెప్పుకోలేని సమస్యల కోసమే...

కొవిడ్‌ సమయంలో తోటివాళ్లు ఎదుర్కొన్న గైనిక్‌ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని నలుగురు స్నేహితురాళ్లతో కలిసి మహిళలకోసం ‘ఆరాహెల్త్‌’ని ప్రారంభించింది నవ్య. సినిమాల్లోకి రాలేదు కానీ మనస్ఫూర్తిగా నచ్చిన విషయాలని అమ్మమ్మ, అమ్మతో కలిసి పాడ్‌కాస్టింగ్‌ ద్వారా చెబుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. ఇప్పటికే ఇన్‌స్టాలో ఈ అమ్మాయికి 11 లక్షలమంది అభిమానులున్నారు. గత ఏడాది పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో అత్త ఐశ్వర్యారాయ్‌తో కలిసి నడిచింది. తాతయ్యతో కలిసి ప్రకటనల్లోనూ కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్