అక్కడ... రుచి చూసి ఆర్డర్‌ చేయొచ్చు!

చేసే పనిలో తపన, అంకితభావం ఉండాలేగానీ సాధించలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు ముంబయికి చెందిన అదితి దుగర్‌. మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదించడం కోసం కెరియర్‌ను పక్కనపెట్టినా...తనలోని అమ్మ మనసే తిరిగి తనకిష్టమైన ఆహార రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది.

Published : 16 Feb 2024 02:00 IST

చేసే పనిలో తపన, అంకితభావం ఉండాలేగానీ సాధించలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు ముంబయికి చెందిన అదితి దుగర్‌. మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదించడం కోసం కెరియర్‌ను పక్కనపెట్టినా...తనలోని అమ్మ మనసే తిరిగి తనకిష్టమైన ఆహార రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. అనేక రెస్టరంట్లను నెలకొల్పి, విజయవంతంగా నడిపించడమే కాదు...తన రెస్టరంట్‌ ‘మాస్క్‌’ను ఆసియాలోనే టాప్‌ 50లో ఒకటిగా నిలిపింది అదితి. ఎలా అంటే..

చిన్నతనంలో వారాంతం వచ్చిందంటే చాలు.. అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురుచూసేది అదితి. ఎందుకంటే వాళ్ల అమ్మమ్మ చేసే వంటలు ఘుమఘుమలుండేవట. తనను అంతలా ఆకర్షించేవి మరి. ఏ పని చేసినా అందులో పరిపూర్ణత ఉండాలని వాళ్ల అమ్మమ్మ నమ్మేవారట. ఎంతలా అంటే పాల కోసం ముంబయిలోని తమ నివాసంలో ఆవులు, వాటికోసం ఓ షెడ్డూ ఏర్పాటు చేసుకున్నారట. అయితే మొదట వంటల మీద అంత ఆసక్తి లేని అదితి, బేకింగ్‌ని మాత్రం ఇష్టపడేది. ఖాళీ సమయాల్లో వంటల వీడియోలు చూడడం, పుస్తకాలు చదవటం వంటివి చేసేది. విదేశాల్లోని బెస్ట్‌ రెస్టరంట్లలో పనిచేయాలనేది తన కోరిక. ఓసారి లండన్‌ వెళ్లినప్పుడు అక్కడి ప్రముఖ షెఫ్‌లు మిచెల్‌ రాక్స్‌, మిచెలిన్‌ వంటి వాళ్ల దగ్గరా రెండు వారాలు పనిచేసింది. అలా వీలు దొరికినప్పుడల్లా విదేశీ రెస్టరంట్లలో పనిచేస్తూ బేకింగ్‌లో ప్రావీణ్యం సంపాదించింది. అయితే తనను పరిస్థితుల ఫైనాన్స్‌ రంగం వైపు మళ్లించాయి. దాంతో కొన్నేళ్లు ఆ రంగంలోనే కొనసాగింది.

స్థానిక ఉత్పత్తులతో...  

ఆ తర్వాత పెళ్లి...ముగ్గురు పిల్లలు...వారికోసం గృహిణిగా స్థిరపడింది అదితి. వాళ్లకు వంటలన్నీ స్వయంగా చేసిపెట్టడం, ప్రతిదీ ఆరోగ్యకరమైనదా కాదా అని తెలుసుకోవడం... లాంటివన్నీ వంటలపై మళ్లీ ఆసక్తి రేకెత్తించాయి. దాంతో తిరిగి ప్రొఫెషనల్‌ కిచెన్లలో పనిచేయటం మొదలుపెట్టింది. కొద్దిరోజుల తర్వాత వాళ్ల అమ్మ చెప్పే ఆన్‌లైన్‌ కుకింగ్‌ తరగతులకు తానూ సాయం చేయాలనుకుంది. కొన్ని తరగతులూ నిర్వహించింది. అప్పుడే అదితికి ప్రైవేట్‌ డిన్నర్‌ కావాలని ఒక ఆర్డర్‌ వచ్చింది. వాళ్ల అమ్మ మొదట సంకోచించినా, అదితి దాన్ని సవాలుగా తీసుకుంది. అలా క్రమంగా ఆర్డర్లు పెరిగి, సగే అండ్‌ శాఫ్రన్‌ బొటిక్‌ క్యాటరింగ్‌, ఫైన్‌ డైనింగ్‌ సర్వీసులను ప్రారంభించింది. ఆ తర్వాత 2016లో ముంబయిలో ‘మాస్క్‌’ రెస్టరంట్‌ను ప్రారంభించింది. అందుకోసం ముందుగా రైతులతో అనుసంధానం కావాలనుకుని, షెఫ్‌ ప్రతీక్‌ సాదుతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లింది. ఇద్దరూ అక్కడ దొరికే పదార్థాలు, వాటి ఫ్లేవర్స్‌తోపాటు వంట నైపుణ్యాలన్నింటినీ తెలుసుకున్నారు. స్థానిక ఉత్పత్తులను ఫైన్‌ డైనింగ్‌ డిష్‌లుగా మార్చాలన్నదే తమ ఆలోచన. అయితే తొలినాళ్లలో అది ఎవరికీ అర్థం కాలేదు. ·రెస్టరంట్‌ అంతా ఖాళీగా ఉండేది. వచ్చిన కస్టమర్లు కూడా గంటల తరబడి కూర్చొని వెళ్లేవారే తప్ప, తినటానికి ఆసక్తి చూపేవారు కాదు. పైగా లాక్‌డౌన్‌...అప్పుడామెకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. సిటీలోని భోజనప్రియులకు ‘మాస్క్‌’లోని ఫుడ్‌ ఐటమ్స్‌ని రుచి చూడాలంటూ ఆహ్వానాలు పంపింది. తానే వాహనాలూ ఏర్పాటుచేసింది. ఈ సరికొత్త విధానంతో క్రమంగా తన వంటకాలకు గుర్తింపు రావటంతో ఇక వెనక్కితిరిగి చూసుకోలేదు. అర్బన్‌ గౌర్మెట్‌, ట్వంటీ సెవెన్‌ బేక్‌ హౌస్‌, అరకు కాఫీ, సీసా కెఫే...వంటి రెస్టరంట్లనూ ప్రారంభించింది....తాజాగా అహ్మదాబాద్‌లో మాస్క్‌ రెండో అవుట్‌లెట్‌నూ ఏర్పాటుచేసింది అదితి. ‘‘ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కినందుకు నాకు సంతృప్తిగా ఉంది. కంఫర్ట్‌ జోన్‌ బయట కూడా కంఫర్ట్‌గా ఉండడానికి ప్రయత్నించండి. మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచే మనం చాలా నేర్చుకోవచ్చు. అందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. మన ఆలోచనలపై మనకు నమ్మకం ఉండాలి. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో తొణకకుండా ఉండగలగాలి. మీ మనసు చెప్పేది నమ్మండి. అదే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది’’ అంటోన్న అదితి 2022, 2023లోనూ ఆసియా టాప్‌ 50 రెస్టరటా జాబితాలో చోటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఈవిడే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్