సానియా... గల్లీ రాపర్‌!

‘రాపర్‌ అవ్వడం అంత సులువు కాదు’ ‘హిజాబ్‌తో రాపా?’ ‘మురికి వాడల అమ్మాయివి... రాప్‌ మ్యూజిక్‌ గురించి నీకేం తెలుసు?’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలకూ సందేహాలకూ తన గళంతోనే సమాధానమిచ్చింది సానియా మిస్త్రీ ఖయాముద్దీన్‌.

Updated : 18 Feb 2024 06:02 IST

‘రాపర్‌ అవ్వడం అంత సులువు కాదు’ ‘హిజాబ్‌తో రాపా?’ ‘మురికి వాడల అమ్మాయివి... రాప్‌ మ్యూజిక్‌ గురించి నీకేం తెలుసు?’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలకూ సందేహాలకూ తన గళంతోనే సమాధానమిచ్చింది సానియా మిస్త్రీ ఖయాముద్దీన్‌. ఇంతకీ ఎవరీ ముంబయి గల్లీ రాపర్‌...

ఏం చేయాలన్నా ఆంక్షలు, కలల గురించి ఆలోచించడానికీ ధైర్యం చేయలేరక్కడ. కానీ సానియా వాటిని నమ్మదు. ముందు చేయలేమేమో అని సందేహించడంలోనే ఆగిపోవడం ఉంటుంది అంటుందీమె. ఈమెది ముంబయిలోని ధారావి అనే మురికివాడ. నాన్న ఆటోడ్రైవర్‌, అమ్మ కుట్టు పనులు చేస్తుంది. పెద్దగా చదువుకోలేదు. కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని ఎలాగైనా చదివించాలనుకున్నారు. దాన్ని చూసి చుట్టుపక్కల అంతా ‘అమ్మాయి చదివి ఏం చేయాలి? ఎప్పటికైనా పెళ్లి చేసి పంపాల్సిందేగా’ అనేవారు. సహజంగానే సానియా బిడియస్తురాలు. అందరిముందూ మాట్లాడాలంటే మాట వణుకుతుంది. అమ్మానాన్న కష్టం, చుట్టుపక్కల వాళ్ల మాటలు, అమ్మాయిలపై చిన్నచూపు... ఒకటేమిటీ తను చూసిన ప్రతిదాన్నీ కవితల రూపంలో రాసుకునేది.

అప్పుడు సానియా ఎనిమిది చదువుతోంది. మురికివాడల పిల్లలకు ‘ధారావీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌’ పేరుతో మ్యూజిక్‌పై ఆసక్తి కలిగించాలనుకుందో సంస్థ. తొలిసారి అక్కడ ర్యాప్‌ విని ‘ఈమాత్రం నేనూ రాయగలను’ అని ధైర్యంగా చెప్పిందట సానియా. అదివిన్న సిబ్బంది ప్రయత్నించమన్నారట. చకచకా కొన్నిలైన్లు చెప్పింది. అది విని వాళ్లు ‘నువ్వు కాస్త దృష్టిపెడితే మంచి రాపర్‌ అవ్వగలవు’ అన్నారట. ఆ ప్రోత్సాహంతో మంచి మెసేజ్‌ని జోడిస్తూ ఏదైనా చేద్దామనుకుంది సానియా. సరిగ్గా అప్పుడే లాక్‌డౌన్‌. దీనిపై అవగాహన కల్పిస్తూ వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టింది. దానికి స్పందన బాగా రావడమే కాదు ‘గల్లీ గర్ల్‌’గా పేరూ తెచ్చుకుంది. అలా అలా ఒక్కోటీ చేసుకుంటూ వెళ్లింది.

తాజాగా ‘బచ్చా కిస్‌ కో బోల్‌ రహా హై’ అంటూ రాప్‌ చేసింది. ఫిల్మ్‌మేకర్స్‌ జోయా అక్తర్‌, రీమా కగ్తీ, మ్యూజిక్‌ కంపోజర్‌ అంకూర్‌ తివారీ సంయుక్తంగా ప్రారంభించిన ‘టైగర్‌ బేబీ రికార్డ్స్‌’ దీన్ని నిర్మించింది. దీంతో ధారావి రాక్‌స్టార్‌ అంటూ ఈమె పేరు మారుమోగుతోంది. ‘ ఒకప్పుడు వారంలో మూడు రోజులు గంట చొప్పున ఫోన్‌ వాడుకోనిచ్చేలా అమ్మతో ఒప్పందం చేసుకున్నా. మురికివాడల్లో పరిస్థితులు, ఎన్నికలప్పుడు మా దగ్గరుండే పండగ వాతావరణం, అసమానత్వం, సామాజికాంశాలపైనే రాప్‌ చేస్తుంటా. మా దగ్గర ఎక్కువ మంది ఏదో సాధించాలని ఉన్నా, భయంతో ఆగిపోతుంటారు. డిగ్రీ చదివీ కూరగాయలు అమ్ముకునే వాళ్లనీ చూశా. కానీ ధైర్యం చేస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పాలనుకున్నా. అందుకు నన్నే ఉదాహరణగా చూపాలి అనుకున్నా. తాజా అవకాశం అందుకు నిదర్శనమే’ అనే 18ఏళ్ల సానియా ఈక్రమంలో దాటుకొచ్చిన సవాళ్లెన్నో! ‘రాపర్‌గా నిరూపించుకోవాలి, బాగా చదువుకొని మా ఇంటి ఆర్థిక పరిస్థితిని మార్చాలి. మిగతా వేటినీ నేను పట్టించుకోను’ అంటోన్న సానియా కథ స్ఫూర్తిదాయకమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్