ఇస్రోని వదలడానికి మనసొప్పలేదు!

పెరుగుతోన్న కాలుష్యం, అడుగంటుతోన్న ఇంధన వనరులు! వీటికి చెక్‌ చెబుతూ ప్రపంచమంతా ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టిపెడుతోంది. నౌకారంగమూ అందుకు మినహాయింపు కాదు.

Updated : 24 Feb 2024 03:45 IST

పెరుగుతోన్న కాలుష్యం, అడుగంటుతోన్న ఇంధన వనరులు! వీటికి చెక్‌ చెబుతూ ప్రపంచమంతా ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టిపెడుతోంది. నౌకారంగమూ అందుకు మినహాయింపు కాదు. దానిపై పరిశోధన చేసి ప్రపంచాన్ని ఆకర్షించారు పద్మిని మేళ్లచెరువు. వసుంధర పలకరించగా ఆ ప్రయాణాన్ని పంచుకున్నారిలా...

రోస్పేస్‌ ఇంజినీర్‌ అవ్వాలన్నది చిన్ననాటి కల. అందుకే చాలా తక్కువమంది ఉంటారని తెలిసినా మెకానికల్‌ బ్రాంచీనే ఎంచుకున్నా. అమ్మాయిలకు సీఎస్‌ఈ, ఈసీఈ మేలని ఎంతమంది సలహానిచ్చినా నా నిర్ణయం మార్చుకోలేదు.  అమ్మానాన్నలూ ప్రోత్సహించారు. మాది గుంటూరు. నాన్న నాగేశ్వరరావు ప్రభుత్వాసుపత్రిలో ఆప్టోమెట్రిస్ట్‌గా, అమ్మ ప్రధానోపాధ్యాయురాలిగా చేసి పదవీ విరమణ పొందారు. బిట్స్‌ పిలానీలో ఇంజినీరింగ్‌ చేశా. తర్వాత పుణెలోని టాటా టెక్నాలజీస్‌లో ‘కార్‌ క్రాష్‌ అనాలిసిస్‌ యూనిట్‌’లో ఉద్యోగమొచ్చింది. ఏడాది చేశాక నా కలల కొలువు ‘ఇస్రో’కి ప్రయత్నించి, సఫలమయ్యా. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో పోస్టింగ్‌ వచ్చింది. 2016 నుంచి ఏడేళ్లపాటు సిస్టమ్‌ రిలయబిలిటీ ఇంజినీర్‌గా రాకెట్‌ ప్రొపలెంట్స్‌లో క్రయోజెనిక్‌ ఫ్యూయల్స్‌పై పనిచేశా. అంటే గది ఉష్ణోగ్రతలో ఉండే హైడ్రోజన్‌, ఆక్సిజన్‌, నైట్రోజన్‌లను మైనస్‌ 250 డిగ్రీల వరకూ చల్లబరుస్తాం. ద్రవంగా మారిన దాన్ని రాకెట్లలో ఇంధనంగా వాడతారు. దీని నిల్వకు పెద్ద పెద్ద ట్యాంకులు అవసరమవుతాయి. వాటి డిజైనింగ్‌, టెస్టింగ్‌, ఆ ఇంధనాన్ని రాకెట్లలో నింపడం, ఫ్లయిట్‌ లాంచ్‌ అయ్యేముందు అన్ని సిస్టమ్‌ల పనితీరు సరిగా ఉందోలేదో గమనించడంతోపాటు రాకెట్‌ స్టేజెస్‌లో టెస్టింగ్‌ వంటివన్నీ నిర్వహించే బృందంలో నేనూ సభ్యురాలిని. చంద్రయాన్‌-2తో పాటు రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌ (ఆర్‌ఎల్‌వీ- టీడీ) వంటివాటికీ పనిచేశా.

విదేశీ అవకాశం...

గ్లోబల్‌ వార్మింగ్‌ పెరుగుతోంది. దాన్ని తగ్గించడానికి ప్రపంచమంతా ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టిపెడుతోంది. వాటిల్లో హైడ్రోజన్‌ ఒకటి. అందుకే దీనికీ ఆదరణ పెరుగుతోంది. మెరైన్‌ రంగమూ ఆ దిశగా అడుగులేస్తోంది. దీంతో దీనిపై పనిచేస్తున్న వారికోసం సంస్థలు వెతుకుతున్నాయి. నేను ఇస్రోలో చేస్తున్నదీ దీనిపైనే! దీంతో ‘లాయిడ్స్‌ రిజిస్టర్‌’ నాకు అవకాశమిచ్చింది. అప్పటిదాకా నేను చేసిందేమో ఏరోస్పేస్‌, ఇప్పుడు మెరైన్‌ రంగమంటే కాస్త కష్టమే. పైగా ఇస్రోని వదిలిపెట్టడానికీ మనసొప్పలేదు. అయినా కొత్త రంగంలో సవాళ్లు నన్ను ఆకర్షించాయి. అందుకే మారా. రవాణా, ఎగుమతులు, దిగుమతుల్లో భాగంగా ఓడలు అన్ని దేశాలూ తిరుగుతాయని తెలుసు కదా! అందుకు ఓడ నిర్మాణం దగ్గర్నుంచి పనిచేసే తీరు వరకు ఇంటర్నేషనల్‌ మారిటైమ్‌ ఆర్గనైజేషన్‌ నిబంధన ప్రకారం కొన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని రిజిస్టర్డ్‌ సంస్థలు చెక్‌ చేసి సర్టిఫై చేస్తాయి. యూకేలో అలాంటి సంస్థ ‘లాయిడ్స్‌ రిజిస్టర్‌’. హైడ్రోజన్‌కి సంబంధించిన అలాంటి ప్రమాణాలు ఇంకా వెలువడలేదు. మరి ఓడల తయారీ సంస్థలు ఎలా నిర్మాణం చేపట్టగలవు? ప్రపంచవ్యాప్తంగా ఏయే ప్రమాణాలను పాటించాలో తెలియజేస్తూ తొలిసారి ఆ నియమావళిని మేమందించాం. దానిలో నాదీ ప్రధాన పాత్రే. అలా నాకు గుర్తింపు వచ్చింది.

సులువేం కాదు...

కాకపోతే హైడ్రోజన్‌కి మండే గుణం ఎక్కువ. త్వరగా పేలిపోగలదు. ఏరోస్పేస్‌కి సంబంధించి నేలపై పెద్ద ట్యాంకులు, ఎంత బరువైనవైనా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ నౌకల విషయంలో అలాకాదు. ఎక్కువ స్థలం ఆక్రమించకూడదు. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకుంటూ నియమాలను రూపొందించా. సవాళ్లతో కూడుకున్నదే అయినా నేర్చుకుంటూ సాగుతున్నా. అన్నట్టూ మావారు మేదూరి గోపీ చందన్‌ కూడా ఇంజినీరే. యూకేలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్‌గా చేస్తున్నారు. ఆయన ప్రోత్సాహమూ ఎక్కువే! ఇంజినీరింగ్‌ అంటే కంప్యూటర్సే అన్న భావన చాలామందిలో. కానీ కోర్‌ బ్రాంచీలకూ ఆదరణ ఎక్కువే. వాటిపై దృష్టిపెట్టండి భవిష్యత్తు బాగుంటుంది... ఈ తరాలకు నా సలహా ఇది!

 దేవేంద్రరెడ్డి కల్లిపూడి, శ్రీహరికోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్