స్టార్‌ హీరోయిన్‌... సాధారణ అమ్మాయిలా!

లగేజీతో కిక్కిరిసిన రైల్లోకి ఎక్కడం... ఆటోవాలాతో ధర తగ్గించమంటూ బేరాలాడటం... పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి దైవ దర్శనం... రోడ్డు పక్క కాకా హోటళ్లలో తినడం... సాధారణ ప్రజలకు పర్యటనల్లో జరిగే అనుభవాలే ఇవి.

Updated : 25 Feb 2024 07:47 IST

లగేజీతో కిక్కిరిసిన రైల్లోకి ఎక్కడం... ఆటోవాలాతో ధర తగ్గించమంటూ బేరాలాడటం... పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి దైవ దర్శనం... రోడ్డు పక్క కాకా హోటళ్లలో తినడం... సాధారణ ప్రజలకు పర్యటనల్లో జరిగే అనుభవాలే ఇవి. కానీ ఓ స్టార్‌ కూడా ఇంత సాధారణంగా ఉండటం ఊహించగలమా? దాన్ని నిజం చేసి చూపిస్తోంది బాలీవుడ్‌ నటి... సారా అలీఖాన్‌!

చ్చిన తిండి, కంటి నిండా నిద్ర... జీవితంలో ఇంతకన్నా ఏం కావాలి అనుకునేదట సారా. పెరిగిన బరువు, ఆరోగ్యం గురించి ఆలోచించాక తీరు మార్చుకుంది. ఆ ఆలోచనకు బీజం పడింది అమెరికాలో. అందుకే ఇప్పటికీ అది తనకు ప్రత్యేక ప్రదేశం అంటుందీమె. కొలంబియా యూనివర్సిటీలో చదివేప్పుడు సారాకి పర్యటనలపై మనసు మళ్లింది. కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులతో కలవడం ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ఇంకేం దానిపై లోతైన అధ్యయనం మొదలుపెట్టింది. ఏమాత్రం ఖాళీ దొరికినా కాదు కాదు... ప్రత్యేకంగా సమయాన్ని కుదుర్చుకుని మరీ విహారయాత్రలకు చెక్కేస్తుంది.

మోడరన్‌ అమ్మాయి. కోరుకున్న దేశానికి జామ్‌ అని చెక్కేయొచ్చు. కానీ ప్రకృతి అందాలు, సవాలు విసిరే సాహసాలు ఉన్న ప్రదేశాలకే ఓటేస్తుంది. దేశమా, విదేశమా అని చూడదు. మనసుకు ప్రశాంతత అందిస్తుందా అనేది మాత్రమే చూసుకుంటుంది. అందుకే ఒకరోజు ఆస్ట్రేలియా బీచ్‌లో నీటితో సరదాగా ఆటలాడుతూ కనిపిస్తే మరోరోజు కేదార్‌నాథ్‌లో భక్తుల సమూహంతో నడుస్తూ కనిపిస్తుంది. ఎక్కువమంది ఆసక్తి చూపని పల్లెలు, మందిరాలు, మసీదులు, లోయలు... అన్నీ తన పర్యాటక ప్రాంతాలే. స్థానికులతో మాట్లాడుతుంది. డేరా కింద పిల్లలతో కలిసి ఆటలాడుతుంది. ‘అరెరె అచ్చం మనలానే జీవిస్తోందే’ అని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

చిన్న హోటళ్లలోనే బస..

పటౌడీ కుటుంబపు అమ్మాయి. ప్రముఖ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కూతురిగా వారసత్వంగా వచ్చిన సంపదే కాదు, నటిగా తనూ రెండు చేతులా సంపాదిస్తోంది. చిటికె వేస్తే సౌకర్యాలు కాళ్ల ముందుకొచ్చి పడతాయి. కానీ వాటన్నింటికీ దూరం. కోరుకున్న చోటుకి క్షణాల్లో వెళ్లొచ్చు. కానీ బడ్జెట్‌ ప్రయాణాలను ఇష్టపడుతుందీమె. పైగా ఇదేమీ పిసినారితనం కాదు... తక్కువ మొత్తంలో ఖర్చు చేయడమే తన తీరు అంటుంది సారా. చిన్న దుకాణాలు, రోడ్డువారీ షాపుల్లో నచ్చినవన్నీ కొనేసుకుంటుంది. స్థానిక వంటలను రుచి చూడనప్పుడు ఆ ప్రాంతం గురించి పూర్తిగా ఎలా తెలుస్తుందంటుంది. శుద్ధిగా కనిపిస్తే చాలు చిన్న, పెద్ద తేడా ఏముందని నచ్చిన చోట తినేస్తుంది. హంగులు, ఆర్భాటాలకు తావులేని చిన్న హోటళ్లలోనే బస చేస్తుంది. ఆటో, బస్సుల్లో ప్రయాణానికే మొగ్గు చూపుతుంది. ‘కేవలం రూ.500తో ఏ ప్రదేశమైనా చుట్టి రాగలదు. కొన్నిసార్లు మిగుల్చుకొనీ వస్తుంది. ఎలా సాధ్యమా అని ఆశ్చర్యమేస్తుంది’ ఓసారి సారా గురించి మాట్లాడుతూ వరుణ్‌ ధావన్‌ అన్న మాట ఇది. ‘తనతో కలిసి కేదార్‌నాథ్‌ వెళ్లినప్పుడు ఓ హోటల్లో బస చేశాం. గదిలో హీటర్‌ లేదు. మేం వెళ్లిందేమో తక్కువ దుస్తులతో. అన్నీ ఒంటి మీద కప్పుకొన్నా చలి తగ్గలేదు. తను మాత్రం బయటికెళ్లి అందరినీ పరిచయం చేసుకొని చక్కగా మాట్లాడి తిరిగొచ్చింది’ అని గుర్తుచేసుకుంటుంది జాన్వీ కపూర్‌. ఓసారి ఇద్దరూ ట్రెక్కింగ్‌కి వెళ్లి చావు అంచుల వరకూ వెళ్లారు. అదీ జీవితంలో ఒక పాఠమే అని నవ్వేస్తుంది సారా. తక్కువ సామానుకే తన ఓటు. అంతేకాదు, ఎంచుకున్న ప్రాంతాన్ని బట్టి ఏమేం తీసుకెళ్లాలా అని ముందే ప్లాన్‌ చేసుకుంటుందట. వాటిని స్వయంగా తనే సర్దుకుంటుంది కూడా. ‘వేరే ఎవరైనా అయితే ఏమైనా మర్చిపోతారని భయం మరి’ అంటోన్న ఈమె ఆ విశేషాలన్నింటినీ ఇన్‌స్టాలోనూ పంచుకుంటుంది. నిజానికి తన ట్రావెల్‌ డైరీకే అభిమానులెక్కువ. ఈ సింప్లిసిటీకీ, ప్రకృతిపై ప్రేమనీ చూసి ‘స్టార్‌ అయినా ఎంత సాదా సీదాగా ఉంటుంది. స్టార్‌ పదానికే వేరే అర్థం తెస్తోంది’ అంటూ పొగుడుతారంతా. మరి మీరేమంటారు?


ఆహ్వానం

హాయ్‌ ఫ్రెండ్స్‌... మీరూ అరుదైన, అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారా... ప్రకృతిలో మమేకమవుతూ సాహసయాత్రలు చేస్తుంటారా... అయితే మీ అనుభవాలను ఈనాడు పాఠకులతో పంచుకోవాలనుకుంటే...

ఈ మెయిల్‌కు పంపండి! : vasundhara@eenadu.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్