నాన్నకిచ్చిన మాట... డ్రోన్‌ పైలట్‌ అయ్యారు!

తండ్రి పడే కష్టాలు చూసి, ఆయనకు తోడుగా నిలవాలనుకున్నారు భీంరెడ్డి మాధవి. అందుకు టెక్నాలజీని ఆసరాగా చేసుకోవడమే కాదు... తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా డ్రోన్‌ పైలట్‌గానూ నిలిచారు... పైలట్‌ అవ్వాలనుకుంది నిషా. తన తండ్రి మాట కాదనలేక డ్రోన్‌ని చేత పట్టింది. ఇద్దరి స్ఫూర్తి నాన్నే! కానీ వాళ్ల లక్ష్యం రైతులకు సాయపడటమే! డ్రోన్‌లతో అదెలా సాధ్యం చేస్తున్నారంటే...

Updated : 26 Feb 2024 07:02 IST

తండ్రి పడే కష్టాలు చూసి, ఆయనకు తోడుగా నిలవాలనుకున్నారు భీంరెడ్డి మాధవి. అందుకు టెక్నాలజీని ఆసరాగా చేసుకోవడమే కాదు... తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా డ్రోన్‌ పైలట్‌గానూ నిలిచారు... పైలట్‌ అవ్వాలనుకుంది నిషా. తన తండ్రి మాట కాదనలేక డ్రోన్‌ని చేత పట్టింది. ఇద్దరి స్ఫూర్తి నాన్నే! కానీ వాళ్ల లక్ష్యం రైతులకు సాయపడటమే! డ్రోన్‌లతో అదెలా సాధ్యం చేస్తున్నారంటే...

నేర్చుకొని ఉపాధి చూపిస్తూ...

‘డ్రోన్‌ టెక్నాలజీ అవసరమేముంది?’ ఎంచుకున్న తొలి రోజుల్లో మాధవికి ఎదురైన మాటే ఇది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. దాన్ని వ్యవసాయ రంగానికి ఎందుకు అన్వయించకూడదు అనుకున్నారామె. ‘దానికి కారణం నాన్నే. మాది మహబూబాబాద్‌ జిల్లాలోని తానంపల్లి. నాన్న చంద్రయ్య రైతు. అమ్మ లక్ష్మి. వ్యవసాయంపై ప్రేమ, రైతు కష్టాలను తగ్గించాలన్న ఉద్దేశంతో అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చేశా. అప్పుడే మనసు డ్రోన్‌ వైపు మళ్లింది. హైదరాబాద్‌లోని ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ నుంచి శిక్షణ తీసుకొని డ్రోన్‌ పైలట్‌నయ్యా. ఫార్మా, రక్షణ సహా అనేక రంగాల్లో వీటి వాడకం ఇప్పటికే ప్రారంభమైంది. దీనిలో భవిష్యత్తు ఉండటమే కాదు, సరిగ్గా ప్రయత్నిస్తే రైతులకూ సాయపడుతుంది అనుకున్నా. అన్ని రకాల డ్రోన్ల నిర్వహణ, ఫ్లయింగ్‌, క్రిమిసంహారక మందుల పిచికారీ, మరమ్మతులు ఇతర అంశాలపై పట్టు సాధించా. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నుంచి డ్రోన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ లైసెన్సు పొంది, రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ - ఎన్‌ఐపీహెచ్‌ఎం, మారుత్‌ డ్రోన్‌ టెక్నాలజీ ప్రారంభించిన డ్రోన్‌ ట్రైనింగ్‌ అకాడమీలో సేవలందిస్తున్నా. వ్యవసాయంలో డ్రోన్ల వాడకం ద్వారా సమయం ఆదా అవ్వడమే కాదు, కూలీల కొరత అధిగమించొచ్చు. ఒక వ్యక్తికి ఎకరా పురుగు మందుల పిచికారీకి కొన్నిగంటలు పడితే, డ్రోన్‌ పది నిమిషాల్లోనే రెండు ఎకరాల్లో స్ప్రే చేయగలదు. ఇంకా గ్రామీణ ప్రాంతాల యువతకీ ఉపాధి దొరుకుతుంది. ఇప్పటి వరకు 31 బ్యాచ్‌ల్లో 250 మందికి పైగా శిక్షణ ఇచ్చా. ఇందులో 120 మంది స్వయం సహాయక సంఘాల మహిళలున్నారు. వారంతా కేంద్ర ప్రభుత్వ సాయంతో డ్రోన్లు కొనుక్కొని ఉపాధి పొందుతున్నారు. మా గ్రామంలోనే అంకుర సంస్థను నెలకొల్పి... డ్రోన్‌, ఏఐ, రోబో టెక్నాలజీ, మార్కెటింగ్‌ సేవలు అందించాలన్నది లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు మాధవి.

హేళనలు దాటి...

నిషాది హరియాణలోని జుజ్జార్‌. నాన్న ఆర్మీ ఆఫీసర్‌. ఓసారి ఆయనతో కలిసి విమానంలో శ్రీనగర్‌ వెళ్లింది. ఆ అనుభవం ఆమెకెంతో నచ్చి పైలట్‌ అవ్వాలనుకుంది. అదేమాట నాన్నతో చెబితే ఆయనేమో వ్యవసాయానికి సంబంధించిన కోర్సు చేయమన్నారు. ఆయన మాట కాదనలేక హరియాణ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ఫార్మ్‌ మిషనరీ అండ్‌ పవర్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేసి, హార్టికల్చరల్‌ విభాగంలో కొలువునూ సాధించింది. పనిలో భాగంగా ఓసారి డ్రోన్‌ ప్రదర్శనకు వెళ్లిన నిషా ఈసారి దానిపై మనసు పారేసుకుంది. ‘డ్రోన్లపై ఆసక్తితో ‘ద డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)’లో రిమోట్‌ పైలట్‌, తర్వాత నా విభాగానికి సంబంధించి అగ్రి డ్రోన్స్‌ సర్టిఫికేషన్లనీ పూర్తి చేశా’నంటోంది నిషా. వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించాలనుకుంది ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌. ఆ బాధ్యతలను నిషాకి అప్పగించింది. రైతులు పురుగు మందుల పిచికారీకి ఎకరానికి 150 లీటర్ల నీటిని వినియోగిస్తారు. డ్రోన్‌తో 10 లీటర్ల నీరు సరిపోతుంది. దీనిద్వారా నీటి వాడకం తగ్గుతుంది. వీపుపై ట్యాంకును మోయడం, పిచికారీ సమయంలో విషప్రభావానికి గురయ్యే సమస్యలకూ దూరంగా ఉండొచ్చు. ‘వీటిపై రైతులకు అవగాహన కలిగిస్తున్నా. ఐసీఏఆర్‌ నాకు అప్పగించిన ప్రాజెక్టు మేరకు గతేడాది వెయ్యి ఎకరాలకుపైగా పురుగుల మందు స్ప్రే చేసి చూపించా. రాష్ట్రవ్యాప్తంగా 750కిపైగా ప్రదర్శనలిచ్చా. దిల్లీ డ్రోన్‌ ఫెస్టివల్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకోవడం మరవలేన’ని చెప్పే నిషాకు ఈ క్రమంలో సవాళ్లెదురయ్యాయి. డ్రోన్‌తో వెళితే గ్రామాల్లో హేళనగా మాట్లాడేవారు. ఉద్యోగం చేసుకోక పొలాల చుట్టూ ఎందుకీ తిరుగుళ్లంటూ విమర్శలెన్నొచ్చినా... రైతుల ప్రయోజనాల కోసం ముందుకే కొనసాగుతోంది నిషా.

మల్లిక్‌ బస్వోజు, ఈటీవీ, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్