ఈ రాణి... ప్రత్యేక డాక్టరమ్మ!

ఎంబీబీఎస్‌లో సీటు దక్కించుకోవాలంటే చాలా కష్టపడాలి. లక్షల మందితో పోటీ పడాలి కూడా. అవన్నీ దాటి మంచి ర్యాంకు సాధించారు రాణి మరియ. ఆమెతోపాటు ఇంటిల్లిపాదీ ఎంత సంబరపడాలి? కానీ అక్కడ సీనే వేరు. వాళ్లంతా దిగులుపడ్డారు.

Updated : 16 Mar 2024 15:20 IST

ఎంబీబీఎస్‌లో సీటు దక్కించుకోవాలంటే చాలా కష్టపడాలి. లక్షల మందితో పోటీ పడాలి కూడా. అవన్నీ దాటి మంచి ర్యాంకు సాధించారు రాణి మరియ. ఆమెతోపాటు ఇంటిల్లిపాదీ ఎంత సంబరపడాలి? కానీ అక్కడ సీనే వేరు. వాళ్లంతా దిగులుపడ్డారు. పోనీ వాళ్లకి ఆమెను వైద్యవిద్య చదివించడం ఇష్టం లేదేమో అనుకుంటున్నారా? అదీ కాదు. మరేంటీ బాధ అంటే... దేశంలోనే ‘ప్రత్యేక డాక్టరమ్మగా’ నిలిచిన రాణి కథ తెలుసుకోవాల్సిందే!

ఆపరేషన్‌ థియేటర్‌లో కష్టమైన సర్జరీలో ఉన్నారు డాక్టర్‌ రాణి. పూర్తయ్యి అలా బయటికి వచ్చారో లేదో... కంగారుగా ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఆశలన్నీ ఆమె మీదే పెట్టుకుని చెన్నై నుంచి వచ్చారు. వాళ్ల చేతుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోన్న ‘మిట్టూ’ని చూడగానే పరిస్థితి అర్థమైందామెకు. మిట్టూని తీసుకొని లోపలికి పరుగెత్తారు రాణి. అప్పటికే మిట్టూ పూర్తిగా నీరసపడిపోయింది. ఊపిరి పీల్చుకోవడానికీ కష్టమవుతూ స్పృహ కోల్పోయే స్థితికి చేరుకోవడం చూసి డాక్టర్‌ రాణి మనస్సూ చివుక్కుమంది. వెంటనే తేరుకొని ముందు ఆక్సిజన్‌ థెరపీ ఇచ్చారు. కాస్త తేరుకున్నాక ఎక్స్‌రే తీస్తే గొంతులో సీసం ఇరుక్కుపోయి ఉంది. ట్యూబ్‌ ద్వారా దాన్ని తొలగించి, ప్రాణాపాయం నుంచి కాపాడారామె. నిజానికి మిట్టూ తమకు దక్కుతుందన్న ఆశను కోల్పోయారా దంపతులు. తిరిగి ఆరోగ్యంతో అప్పగించేసరికి వాళ్ల కళ్లల్లో ఆనందం. అది చూసి డాక్టర్‌ రాణి ముఖంలోనూ తెలియని సంతృప్తి. నిజానికి ఇది ఆమె రోజువారీ దినచర్యలో భాగమే అయినా... ప్రాణాన్ని కాపాడిన ప్రతిసారీ ఆమెలో తెలియని ఉత్సాహం. దాన్ని పంచుకోవడానికి వెంటనే తల్లిదండ్రులు థామస్‌, బీనా దగ్గరికి పరుగు తీస్తారామె. అన్నట్టూ మిట్టూ ఎవరో చెప్పలేదు కదూ... బూడిద రంగు చిలుక.

డాక్టర్‌ రాణిది కేరళలోని తంపోలీ అనే గ్రామం. అల్లంత దూరం నుంచి వచ్చే సముద్రగాలి, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో పక్షుల కిలకిలరావాలు... వీటి మధ్య ఉంటుంది రాణి వాళ్ల ఇల్లు. ఆమె తల్లిదండ్రులిద్దరికీ దేశ, విదేశీ పక్షుల పెంపకం అంటే ప్రాణం. ‘సారాస్‌ ఎగ్జోటిక్‌ ఫామ్‌’ పేరుతో పక్షులను పెంచడం, అవంటే ఇష్టపడే వారు కోరితే దత్తత ఇవ్వడం వారికో సరదా. నాలుగు దశాబ్దాలుగా వీళ్ల ప్రపంచమంతా ఈ పక్షుల తోటిదే! దేశీ వాటితోపాటు 70 విదేశీ రకాలనూ పెంచుతున్నారు. అవి తమ ఇద్దరమ్మాయిలతో సమానమే వాళ్లకి. అలా వాళ్ల ప్రభావం రాణిపై పడింది. కూతుళ్లలో ఒకరు పక్షులకు సంబంధించిన కెరియర్‌ ఎంచుకోవాలన్నది థామస్‌ కోరిక. తీరా రాణికేమో ఎంబీబీఎస్‌లో సీటొచ్చింది. అందుకే వాళ్లు కాస్త దిగులుపడ్డారు. దీంతో ఆమె వెటర్నరీకి మారారు.

‘ఇక్కడా ఓ సమస్య. కోర్సులో ఏవియన్‌ (పక్షులు), ఎగ్జోటిక్‌ జంతువులకు సంబంధించిన సమాచారమే తక్కువ. ఇలా కాదని ఏవియన్‌ వెటర్నరీ గురించి ఆన్‌లైన్‌ కోర్సులు చేశా. అబుదాబికి వెళ్లి అక్కడి ఆసుపత్రుల్లో కొన్నాళ్లు పనిచేశా’ననే రాణి తిరిగొచ్చాక తన ఇంటిపక్కనే ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకున్నారు. ఇంక్యుబేటర్‌, ఐసీయూ యూనిట్‌, ల్యాబ్‌, ఎక్స్‌రే, రేడియోగ్రాఫ్‌... అంటూ కొన్ని ఆసుపత్రుల్లో మనుషులకే లేని సదుపాయాలూ ఇక్కడ ఉంటాయంటే దాన్నెలా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, పెట్‌ స్పా, గ్రూమింగ్‌ సెంటర్లనీ ఏర్పాటు చేశారు. సర్జరీలు నిర్వహించాలంటే జంతువులకైనా అనస్థీషియా ఇవ్వాలి. కానీ... సూది మందు ద్వారా ఇస్తే వాటికి హాని అని భిన్న పద్ధతులు అనుసరిస్తారామె.

2021లో రాణి తమ ఫామ్‌కి ఆసుపత్రిని జోడించాక తాబేళ్లు, ఇగ్వానా, మకావూలు, కొన్నిరకాల కుక్కలు, కోతులు వగైరాలకీ చోటిచ్చారు. ఇప్పటికీ ఎగ్జోటిక్‌ పక్షులు, జంతువులకు సంబంధించి కొత్త కోర్సులన్నీ చేస్తుంటారామె. ఈ జీవులపై ఇంత ప్రేమ ఎందుకు అంటే... ‘బాల్యమంతా పక్షుల మధ్యే పెరిగింది. వాటినీ కుటుంబ సభ్యుల్లా చూసుకోవడమే కాదు, అక్క, తమ్ముడు అంటూ పిలిచేవాళ్లం కూడా. వాటి నుంచి పొందే స్వచ్ఛమైన ప్రేమకు విలువ కట్టలే’మనే రాణి దగ్గరికి దేశవ్యాప్తంగా పెట్‌ పేరెంట్లు వస్తుంటారు. ఎంత క్లిష్టమైన కేసునైనా డీల్‌ చేస్తారని రాణికి పేరు. ఏటా కైట్‌ ఫెస్టివల్‌, వలసల సమయంలో గాయాల పాలయ్యే పక్షుల కోసం చికిత్స శిబిరాలను ఏర్పాటు చేస్తుంటారు. వలంటీర్లతోపాటు ఆసక్తి ఉన్నవారికి ఆసుపత్రిలో శిక్షణ తరగతులనీ నిర్వహిస్తున్నారు. త్వరలో పుణెలో మరో ఆసుపత్రినీ ప్రారంభించబోతున్నారీమె. ఇదండీ ఈ ప్రత్యేక డాక్టరమ్మ కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్