ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!

కొన్ని పనులు అబ్బాయిలకే చెల్లుతాయి... అమ్మాయిలకు ఏమాత్రం చేతకావు! అలాంటి సంప్రదాయ ఆలోచనలుంటే మార్చుకోండి అంటున్నారు యోకహామా టైర్ల తయారీలో తమ సత్తా చాటుతున్న అనకాపల్లి అమ్మాయిలు.

Updated : 27 Mar 2024 07:38 IST

కొన్ని పనులు అబ్బాయిలకే చెల్లుతాయి... అమ్మాయిలకు ఏమాత్రం చేతకావు! అలాంటి సంప్రదాయ ఆలోచనలుంటే మార్చుకోండి అంటున్నారు యోకహామా టైర్ల తయారీలో తమ సత్తా చాటుతున్న అనకాపల్లి అమ్మాయిలు...

ఆటో మొబైల్‌రంగంలో ఒకప్పుడు మగవాళ్లు మాత్రమే కనిపించేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. టాటామోటార్స్‌, మహీంద్ర వంటి సంస్థలతో పాటు జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల కంపెనీ యోకహామా కూడా తమ సంస్థలో అమ్మాయిలకు పెద్ద ఎత్తున అవకాశాలిస్తోంది. ఈ సంస్థకు గుజరాత్‌లోని దహేజ్‌తో పాటు తమిళనాడులోని తిరునల్వేలి, ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురంలో టైర్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వీటిల్లో  40 శాతానికి పైగా మహిళా ఉద్యోగులు ఉన్నారు. వాళ్లలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి తమ కలల్ని పండించుకుంటున్న అమ్మాయిలే ఎక్కువ.

భారీ వాహనాల కోసం...

యోకహామా సంస్థ పాసింజర్‌ వాహనాలతో పాటు ఆఫ్‌ హైవే టైర్లనీ ఉత్పత్తి చేస్తోంది. వీటిని వ్యవసాయంలో, క్వారీలు, నిర్మాణరంగంలో వాడే వాహనాలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. 2018లో మొదటిసారి గుజరాత్‌లోని దహేజ్‌ ఫ్యాక్టరీలో మహిళలకు ఉద్యోగావకాశాల్ని కల్పించింది. ఇక్కడ భారీ వాహనాలకు అవసరం అయిన ట్రక్‌ అండ్‌ బస్‌ రేడియల్‌(టీబీఆర్‌)టైర్స్‌ని వందశాతం మహిళలే తయారుచేసేలా ప్రోత్సహించింది. వారూ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని మగవాళ్లతో సమానంగా రాణించారు. వారి సామర్థ్యాన్ని గుర్తించిన యాజమాన్యం తిరునల్వేలి, అచ్యుతాపురం ప్లాంట్లలోనూ మహిళల్నే నియమించింది. ప్రస్తుతం దహేజ్‌ ఫ్యాక్టరీలో 500 మంది, అచ్యుతాపురం ప్లాంట్‌లో 409 మంది... యోకహామా ఇండియా పాసింజర్‌ టైరు యూనిట్లో 112 మంది పనిచేస్తున్నారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి ఐటీఐ, డిప్లొమా చదివిన యువతులకు అవకాశాలిస్తున్నారు. రెండు నెలల శిక్షణ తరవాత నెలకి రూ.22 వేల వేతనంతో వీరు కెరియర్‌ని మొదలుపెడుతున్నారు. పనిచేసే ప్రదేశంలో భద్రత మొదలుకుని క్యాంటీన్‌, రవాణా సదుపాయం కూడా అందించడంతో యువతులు ఇక్కడ పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ‘అమ్మానాన్న కూలిపనులు చేస్తున్నారు. మేం ముగ్గురం అమ్మాయిలం. అక్క నర్స్‌. చెల్లి చదువుతోంది. వారికి కాస్త సాయంగా ఉంటుందని ఇక్కడ ఉద్యోగంలో చేరా. నెలకు రూ.8 వేలు ఇంటికి పంపిస్తున్నా’అంటోంది ఒడిశాకు చెందిన గౌతమి. ‘నేను ఐటీఐ చేసి ఇక్కడ చేరా. పనిచేస్తూనే బీటెక్‌ చదువుతున్నా. సెమిస్టర్‌ పరీక్షలప్పుడు కంపెనీ సెలవులిస్తోంది. చదువూ, కెరియర్‌ రెండూ సాకారం అవుతున్నాయి’ అంటోంది శైలజ. వీళ్లలానే ఎంతోమంది అమ్మాయిలు అక్కడ తమ కలల్ని సాకారం చేసుకుంటున్నారు. ఒకప్పుడు వ్యవసాయంపై ఆధారపడి... తమ ఆడపిల్లలు చదువుకున్నా పెళ్లికే  విలువనిచ్చే తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్లని దగ్గరుండి మరీ ఉద్యోగాలకు పంపిస్తున్నారు.

బొద్దల పైడిరాజు, విశాఖపట్నం


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్