అమ్మ చేతి వంటను అందిస్తోంది...

దక్షిణ భారతదేశానికొచ్చి ఇంటి వంటకు దూరంగా ఉన్నాననే పంజాబీకి ఆ లోటు తీరుతుంది. ఉత్తరభారతాన కోనసీమ రుచుల్లేవని బాధపడే ఆంధ్రులకు కోరుకున్న ఆహారం క్షణాల్లో అందుతుంది.

Published : 30 Mar 2024 01:39 IST

దక్షిణ భారతదేశానికొచ్చి ఇంటి వంటకు దూరంగా ఉన్నాననే పంజాబీకి ఆ లోటు తీరుతుంది. ఉత్తరభారతాన కోనసీమ రుచుల్లేవని బాధపడే ఆంధ్రులకు కోరుకున్న ఆహారం క్షణాల్లో అందుతుంది. అలా కుదురుతుందా... అని అనుకోవద్దు. దూరాన్ని దగ్గర చేస్తూ... ‘దిల్‌ఫుడ్స్‌’ పేరుతో అమ్మ చేతి రుచిని గుర్తు చేస్తోంది అర్పితా అదితి. అతి తక్కువ కాలంలోనే కోట్లరూపాయల లాభాలను అందుకుంటూ.. దేశవ్యాప్తంగా రెస్టరంట్లతో కలిసి పనిచేస్తూ.. తాజాగా షార్క్‌ట్యాంకు నుంచి రూ.2 కోట్ల పెట్టుబడిని పొందింది.

కొవిడ్‌ సమయంలో రెండేళ్లలో మూడు లక్షల హోటళ్లు మూతబడ్డాయి. ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఈ రంగంలో అడుగుపెట్టి నష్టాలబారిన పడినవారెందరో. రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ లాభాలబాట పట్టాలని కలలు కన్నవారంతా.. విజేతలు కాలేకపోతున్నారు. ఇటువంటివారికి మార్గనిర్దేశం చేస్తోంది అర్పితా అదితి. రెస్టరంట్లతో చేయి కలిపి, ఆయా ప్రాంతాల సంప్రదాయ రుచులను వినియోగదారులకు అందిస్తోంది. కలిసి పనిచేస్తున్న వ్యాపారవేత్తలకూ లాభాలొచ్చేలా చేస్తున్న అర్పితది ఝార్ఖండ్‌. మణిపాల్‌ ఎంఐటీలో బయోటెక్‌ ఇంజినీరింగ్‌ చదివింది. హిమాలయన్‌ డ్రగ్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌లో పని చేసింది. ఆ తరవాత బెంగళూరులో స్విగ్గీలో పనిచేసిన రెండేళ్ల అనుభవం ఆమె కెరియర్‌ను మలుపు తిప్పింది. ఆ అవగాహనతో మొదట ‘నట్‌ అండ్‌ బోల్ట్‌’ ప్రారంభించి, ఆ తరవాత సొంతంగా ‘దిల్‌ ఫుడ్స్‌’ స్థాపించింది.

తాజాగా... రుచిగా...

‘కశ్మీరులో కేరళ భోజనాన్నీ, తమిళనాట ఉత్తర భారతీయుల రుచినీ అందించగలను. అదెలా అంటే... మనదేశంలో 98 శాతం హోటళ్లు అండర్‌ యుటిలైజ్డ్‌ అని చెప్పొచ్చు. వారు ఎదురుచూసేటంత కస్టమర్స్‌ ఉండరు. అలాగే ఆర్డర్స్‌ తక్కువగా ఉంటాయి. వారికి మిగిలే సమయాన్ని మాతో కలిసి పనిచేయడానికి వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంటాం. అలా ఇప్పుడు దేశవ్యాప్తంగా మాతో కలిసి పలు రెస్టరంట్లు పనిచేస్తున్నాయి. మావద్ద లభించే ప్రత్యేక వంటలకు కావాల్సిన ఉత్పత్తులన్నింటినీ రాష్ట్రేతర ప్రాంతాల వారికి పంపిస్తాం. ఆర్డరు వచ్చినప్పుడు వాటిని తిరిగి ఇన్‌స్టంట్‌గా వండి వినియోగదారుడికి వేడివేడిగా పంపిస్తుంటారు. ఈ ఇన్‌స్టంట్‌ వంటలకు సంబంధించినవన్నీ బెంగళూరు ప్రొడక్షన్‌ యూనిట్‌లో తయారుచేస్తాం. తాజా కూరగాయలతో ముందుగా వంటలను తయారుచేసి వాటిని 15 నిమిషాల్లోపే మైనస్‌ 18 డిగ్రీల వద్ద ఫ్రీజ్‌ డ్రైయింగ్‌ చేసి నిల్వ ఉంచుతాం. ఇలా చేయడంవల్ల ఈ ఆహారం ఎప్పుడు వేడి చేసినా...  తాజాదనాన్ని కోల్పోదు. రుచి కూడా తగ్గదు. ప్రతి వంటకానికీ షెల్ఫ్‌ టైం ఉంటుం’దని చెబుతోంది అర్పిత. దిల్‌ పంజాబీ, ఆహార్‌, ద ఛాట్‌ కల్ట్‌, హౌస్‌ ఆఫ్‌ ఆంధ్ర... ఇలా మొత్తం ఎనిమిది ఫుడ్‌ బ్రాండ్స్‌ ద్వారా బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లో ఈ సంస్థ పని చేస్తోంది. మొత్తం 111 అవుట్‌లెట్స్‌ను నిర్వహిస్తోంది. రూ.7 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం లాభాలబాటలో ఉంది. భవిష్యత్తులో మరిన్ని అవుట్‌లెట్స్‌ పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని చెప్పే అర్పిత ఆలోచన భలేగుంది కదూ..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్