లావవుతున్నారా...

‘ఈమధ్య చాలా బరువెక్కినట్లు ఉన్నావ్‌?’ ‘అమ్మయ్యాక బాగా లావయ్యావ్‌... తగ్గడం మొదలు పెట్టలేదా?’ చూడటానికి చిన్న ప్రశ్నలే! కానీ విన్నవారికి కాదు. లావు అన్న పదం చాలా సాధారణంగా తోచినా... మనకిది విశ్వవ్యాప్త సమస్య అవుతోందని తెలుసా?

Published : 31 Mar 2024 01:36 IST

‘ఈమధ్య చాలా బరువెక్కినట్లు ఉన్నావ్‌?’ ‘అమ్మయ్యాక బాగా లావయ్యావ్‌... తగ్గడం మొదలు పెట్టలేదా?’ చూడటానికి చిన్న ప్రశ్నలే! కానీ విన్నవారికి కాదు. లావు అన్న పదం చాలా సాధారణంగా తోచినా... మనకిది విశ్వవ్యాప్త సమస్య అవుతోందని తెలుసా?

‘గ్లోబెసిటీ’... పోషకాహారలోపానికి ఒబెసిటీ తోడవ్వడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా నిర్వచిస్తోంది. అంటే డైట్‌ పేరుతో నోరుకట్టుకోవడం, తరవాత ఒత్తిడిలో ఏదో ఒకటి తిని మరింత బరువెక్కడం... ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోన్న సమస్యే ఇది. దీని బారిన పడుతోంది ఎక్కువగా మహిళలే! అంతేనా ఇది వాళ్ల ఆరోగ్యం, సంతానోత్పత్తి, హార్మోనుల్లో లోపాలతోపాటు గుండెజబ్బులు, మధుమేహం కొన్నిసార్లు క్యాన్సర్‌కీ దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది సిమ్రన్‌ చోప్రా. ఈమెది బెంగళూరు. ఎంబీఏ, ఎంఎన్‌సీలో ఉద్యోగం, మంచి భర్త. ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ పండంటి బిడ్డ. కానీ తరవాతే ఆమె జీవితం మారిపోయింది. విపరీతంగా బరువు పెరిగింది. ‘ఈటింగ్‌ డిజార్డర్‌’ కారణంగా ఏం తింటోందో, ఎంత తింటోందో కూడా తెలిసేది కాదు. పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ కూడా తోడై చాలా ఇబ్బందులు పడింది.

‘ఓరోజు పడిపోయా. విపరీతమైన బరువు, దానికితోడు దెబ్బలు... లేవలేకపోయా. బాబు ఇంకా చిన్నవాడు. వేరే పాలు పడట్లేదు. దీంతో పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకోలేని పరిస్థితి. చావే నయమనుకున్న రోజులున్నాయి’ అంటుంది సిమ్రన్‌. దీనికితోడు ఎండోమెట్రియాసిస్‌, స్పాండిలైటిస్‌, వర్టిగో వంటివీ చుట్టుముట్టాయి. ముఖమంతా మొటిమలు. అద్దంలో చూసుకోవడానికీ, కాలు బయటపెట్టడానికీ భయపడింది. ‘ఇలా ఎన్నిరోజులు’ అని ప్రశ్నించుకున్నాక ఆరోగ్యంగా తగ్గడంపై దృష్టిపెట్టింది. దీనికోసం న్యూట్రిషన్‌ కోర్సులూ చేసి 20 కేజీలు తగ్గింది. ‘తిండి మానేయలేదు. నచ్చినవాటినే ఆరోగ్యంగా చేసుకుని తిన్నా. పరిమాణాన్ని తగ్గించా. దానికి తగ్గట్టే ఇంట్లోనే వివిధ వ్యాయామాలు చేశా. మెట్లు ఎక్కిదిగడం, నడకలకు ప్రాధాన్యమిచ్చా. కానీ, తొలిరోజుల్లో చాలా కష్టమైంది. తగ్గే ఒక్కో కేజీ బరువు... నాలో ఉత్సాహాన్ని నింపింది’ అనే సిమ్రన్‌... తనలానే మరెందరో బాధపడుతున్నారనీ, ఒబెసిటీ తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందనీ గ్రహించింది. 2018లో ‘నరిష్‌ విత్‌ సిమ్‌’ ప్రారంభించి మహిళలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేలా తీర్చిదిద్దుతోంది. ‘అమ్మయ్యాక లావవ్వడం మామూలే అంటూ తేలిగ్గా తీసుకుంటాం. ఆ నిర్లక్ష్యం మనల్ని చావు అంచుల వరకూ తీసుకెళుతోంది. దాన్ని అశ్రద్ధ చేయొద్ద’ంటూ కార్యక్రమాలతోపాటు, సోషల్‌మీడియా ద్వారా అవగాహననూ కల్పిస్తోంది. మీ సంగతేంటి? పరిశీలించుకుంటున్నారా? మామూలే అని వదిలేస్తున్నారా?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్