అమ్మా... నిన్ను చూడాలి..!

నవమాసాలు మోసి అపురూపంగా పెంచిన కన్నతల్లిని వృద్ధాప్యంలో పట్టించుకోని సంతానం గురించే వింటుంటాం. కానీ ఏ కారణంతోనో  పొత్తిళ్లలోని పసిగుడ్డును నిర్దాక్షిణ్యంగా వదిలేసిన తల్లిని ఒక్కసారయినా కళ్లారా చూడాలని తపిస్తుందో అమ్మాయి.

Updated : 06 Apr 2024 07:09 IST

నవమాసాలు మోసి అపురూపంగా పెంచిన కన్నతల్లిని వృద్ధాప్యంలో పట్టించుకోని సంతానం గురించే వింటుంటాం. కానీ ఏ కారణంతోనో  పొత్తిళ్లలోని పసిగుడ్డును నిర్దాక్షిణ్యంగా వదిలేసిన తల్లిని ఒక్కసారయినా కళ్లారా చూడాలని తపిస్తుందో అమ్మాయి. అందుకోసం స్వీడన్‌ నుంచి స్వదేశానికి వచ్చింది... పేరు పాట్రిషియా. ఎలా ఉంటుందో ఊహకైనా అందని ఆ అమ్మకోసం కొన్నేళ్లుగా అన్వేషిస్తోంది. వీధుల్లో, సందుల్లో గాలిస్తోంది. ఇల్లిల్లూ తిరుగుతోంది. అసలింతకీ ఆమెవరు... తల్లిని కలిసిందా?!

సుమారు ఇరవయ్యేళ్ల క్రితం... మణిరత్నం తీసిన ‘అమృత’ చిత్రం చాలామందికి గుర్తుండే ఉంటుంది. గారాబంగా పెంచుతోన్న ఆ అమ్మానాన్నలకు తను పుట్టలేదని తెలిసిన ఆ చిన్ని హృదయం తట్టుకోలేకపోతుంది. వాళ్లెంతగా ఆమెని ప్రేమిస్తున్నా కన్నతల్లిని ఒక్కసారైనా చూడాలనుకుంటుంది. ఆ తల్లి ఉండేది కాల్పులతో అట్టుడుకుతోన్న రణభూమి అని తెలిసినా పెంచిన తల్లిదండ్రులతో కలిసి అక్కడకు బయల్దేరుతుంది. స్వీడన్‌ నుంచి స్వదేశానికి వచ్చి వెతుకుతోన్న పాట్రిషియాదీ దాదాపుగా అలాంటి కథే.

అలా మొదలైంది

ఓ రోజు స్కూల్లో పిల్లలంతా మాట్లాడుకుంటున్నారు. ‘నా ముక్కూ గడ్డం అచ్చం మా అమ్మవే’ అని ఒకరూ, ‘నాకైతే అన్నీ నాన్న పోలికలే... జుట్టూ కళ్లూ అచ్చుగుద్దినట్లు డాడీనే’ అని మరొకరూ... ఇలా సాగుతోంది సంభాషణ. అదంతా వింటోన్న ఆరేళ్ల చిన్నారి ఆలోచనలో పడింది. మా అమ్మానాన్నలిద్దరూ తెల్లగా ఉన్నారు. నేనేమో నలుపు. నేను వాళ్లమ్మాయినేనా అన్న సందేహం కలిగింది. ఆ విషయాన్ని ఇంటికెళ్లి అమ్మను అడిగేసింది. ఆ చిన్నారే... పాట్రిషియా ఎరిక్‌సన్‌. ఇక ఆ తల్లికి చెప్పక తప్పలేదు... భారత్‌లోని ఓ అనాథాశ్రమం నుంచి తనను దత్తత తీసుకున్నామని. ఆ విషయాన్ని ఆ చిట్టిబుర్ర మర్చిపోలేదు సరికదా... ఆ రోజునుంచీ కన్నతల్లిని ఊహించుకుంటూనే ఉంది.

‘అమ్మెలా ఉంటుందో... నేనూ మా అమ్మలానే ఉంటానా... ఇలాంటి ఆలోచనలతో అద్దం ముందు నిలబడి అమ్మను నాలోనే వెతుక్కునేదాన్ని. నల్లగా ఎవరైనా కనిపిస్తే పరుగున వెళ్లి చూసేదాన్ని. మా అమ్మెవరు... ఎలా ఉంటుంది... ఎందుకు వదిలేసింది... ఇలాంటి ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. అమ్మ ఒడిలో పడుకోవాలనీ జోలపాటలు వినాలన్న కలలతోనే ఏళ్లు గడిచిపోయాయి. అలాగని పెంచిన తల్లిదండ్రులు నాకే లోటూ చేయలేదు. ఎంతో ప్రేమించేవారు. అమ్మకోసం పడుతోన్న నా ఆరాటం చూసి దత్తత తీసుకున్న అనాథాశ్రమం అడ్రస్‌, సంబంధించిన పత్రాలు ఇచ్చి వెతకమని ప్రోత్సహించారు. అలా మొదలైంది నా అన్వేషణ...’ అంటోంది పాట్రిషియా.

రెడ్‌లైట్‌ ఏరియాలోనూ...

భారత్‌లోని ఆ ఆశ్రమం గురించి తెలుసుకుంది కానీ సమాచారం ఎలా సేకరించాలో తెలియలేదు. ఎట్టకేలకు ఐరోపాకు చెందిన సామాజిక కార్యకర్త అరుణ్‌ దోహ్లే సాయంతో 2022లో ఇండియాకి రాగలిగింది. అరుణ్‌... పుణెలో ఓ ఎన్జీవో నిర్వహిస్తోన్న అంజలి పవార్‌ను పరిచయం చేయగా- ఆమె సాయంతో నాగ్‌పుర్‌కి వెళ్లింది. ఆశ్రమానికి వెళ్లగా- స్థానిక ‘డాగా’ ఆసుపత్రి సిబ్బంది చేర్పించారనీ తల్లి పేరు శాంత అనీ తెలిసింది. ఆ వివరాలతో ఆసుపత్రి వాళ్లను సంప్రదిస్తే- 23 ఏళ్ల ఓ మహిళ ఒంటరిగా వచ్చి ప్రసవించిందనీ పేరు శాంత అనీ శాంతినగర్‌ నుంచి వచ్చినట్లు మాత్రమే రాసి ఉందనీ చెప్పారట. ఈ అమ్మాయి పుట్టిన మరుసటిరోజే మరొకామె కూడా ప్రసవించింది. ఆమె పేరు కూడా శాంత అనే ఉండటంతో వాళ్లను కలిసి విచారించి డీఎన్‌ఏ పరీక్ష చేయగా- ఆమె కాదని తెలిసింది. దాంతో రిజిస్టర్‌లో రాసిన శాంత, రామదాసు పేర్లతో నాగ్‌పుర్‌లోని వీధులన్నీ వెతికారట. జాడ దొరకక పాట్రిషియా తిరిగి స్వీడన్‌ వెళ్లిపోయింది.

ఇప్పుడు రెండోసారి ఇండియా వచ్చిందామె. నాగ్‌పుర్‌లోని అంగన్‌వాడీలు, పాఠశాలలు, పోలీసుస్టేషన్లు...ఆఖరికి రెడ్‌లైట్‌ ఏరియా గంగా జమున ప్రాంతంలోనూ శాంత పేరుతో మహిళలెవరైనా ఉన్నారేమోనని వెతికింది. నలభై ఏళ్ల క్రితం శాంతినగర్‌లోనూ ఆ చుట్టుపక్కలా నివసించే కుటుంబాలన్నింటినీ కలిసింది. ఇలా ఆమె తిరగని చోటులేదు. ఎక్కి, దిగని గుమ్మం లేదు. చిన్న క్లూ అయినా దొరకకపోతుందా అని ఆశగా తిరుగుతోంది.

ఈమె ఒక్కరేకాదు, స్విట్జర్లాండ్‌కి దత్తత వెళ్లిన విద్య ఫిలిప్పన్‌దీ ఇదే కథ. ఇంకా మన దృష్టికి రానివాళ్లెందరో. ఓ తల్లి వదిలేసిన బంధాన్ని మరో తల్లి అపురూపంగా లాలించి పెంచి పెద్దచేసినా కన్నతల్లికోసం ఆశగా ఆరాటంగా వెతుకుతోన్న పాట్రిషియా లాంటి వాళ్లను చూస్తోంటే... పేగుబంధం ఎంత గొప్పదో అనిపిస్తోంది కదూ!!


‘మా అమ్మను ఓ అద్భుతమైన అందగత్తెగా రాణిగా ఊహించుకుంటుంటా. ఆమె గురించి ఎన్నో కలలు కంటుంటా. కానీ చనిపోయేలోగా నాకు కనబడుతుందో లేదో అన్న ఆలోచనే నన్ను కుదురుగా ఉండనీయడం లేదు. నన్నిలా వదిలేయడం న్యాయమా అని ప్రశ్నించడానికి రాలేదు. నన్ను పెంచిన స్వీడిష్‌ తల్లిదండ్రులు ఎంతో మంచివాళ్లు. అది నా అదృష్టం. నేనూ అమ్మనే... నాకు ముగ్గురబ్బాయిలు. ఒక్కసారి అమ్మను కలిసి కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలని ఉంది. నా ఆశ తీరుతుందో, నిరాశగానే మిగిలిపోతుందో కాలమే నిర్ణయించాలి’ అంటోంది వేదనగా పాట్రిషియా. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్