నాన్న కోసం... కొడుకునయ్యా

నాన్న కష్టాల్ని చూడలేక ఉద్యోగం సాధించి, భవిష్యత్తులో ఆయన్ని బాగా చూసుకోవాలనుకుంది. కొడుకు ఉంటే తన కష్టాన్నీ, వృత్తినీ పంచుకునే వాడు కదా! అనుకుని తనే కొడుకులా మారి తండ్రికి సాయపడుతోంది. ఆమె కేరళకి చెందిన శ్రీదేవి గోపాలన్‌.

Updated : 08 Apr 2024 03:57 IST

నాన్న కష్టాల్ని చూడలేక ఉద్యోగం సాధించి, భవిష్యత్తులో ఆయన్ని బాగా చూసుకోవాలనుకుంది. కొడుకు ఉంటే తన కష్టాన్నీ, వృత్తినీ పంచుకునే వాడు కదా! అనుకుని తనే కొడుకులా మారి తండ్రికి సాయపడుతోంది. ఆమె కేరళకి చెందిన శ్రీదేవి గోపాలన్‌. అసలేంటి ఈమె కథ అంటే..

‘మాది కేరళలోని మలప్పురం. అమ్మ ఉష, నాన్న గోపాలన్‌. మేం ముగ్గురు సంతానం. మమ్మల్ని పెంచడానికి నాన్న చాలా కష్టపడేవారు. ఇంటి పోషణకీ, మా స్కూలు ఫీజులకీ... నాన్న కాయలను కోసేందుకు కొబ్బరిచెట్టు ఎక్కేవారు. ఆయన జీవితమంతా మమ్మల్ని పోషించేందుకే ధార పోశారు. తన కష్టాన్ని ఎప్పుడూ మాకు తెలియనివ్వలేదు. నేను ఒట్టపాలెం ఎన్‌యస్‌యస్‌ కళాశాలో అప్పుడు బీఈడీ తుది సంవత్సరం చదువుతున్నా. కొవిడ్‌  మమ్మల్ని ఆర్థిక కష్టాల్లో ముంచేసింది. లాక్‌డౌన్‌ కారణంగా నన్ను ఇంటికి వచ్చేయమన్నారు. కానీ నా మనసు అంగీకరించలేదు. ఇంట్లో నేనే పెద్దమ్మాయిని. వారికి సాయపడాలే తప్ప భారం కాకూడదనుకున్నా.

ముగ్గురాడపిల్లలను పెంచడం మామూలు విషయం కాదు. నాన్న వయసు పెరుగుతోంది, ఒంట్లో ఓపిక తగ్గింది. ఒకసారి అమ్మతో ‘కొడుకు ఉంటే నా కష్టానికి తోడుండేవాడు కదా’ అని నాన్న చెబుతుంటే విని చాలా బాధపడ్డా’ అంటోంది శ్రీదేవి.

ఆసరాగా నిలిచి...

కుటుంబానికి సాయపడాలనే ఉద్దేశంతో కొబ్బరి చెట్లెక్కడంలో ప్రావీణ్యం సంపాదించింది శ్రీదేవి. అంతే కాదు, ఆటో నడపడమూ నేర్చుకుని కుటుంబానికి ఆసరాగా నిలిచింది. అయితే ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదంటుందీమె. ‘నేనూ నీతోపాటు చెట్లు ఎక్కుతా నాన్నా అన్నప్పుడు అమ్మానాన్నలిద్దరూ ఒప్పుకోలేదు. కానీ అప్పటికే నేను నాన్నకి తెలియకుండా యూట్యూబ్‌లో వీడియోలు చూసి చెట్లెక్కడం నేర్చుకున్నా. అప్పుడే ఆ పనిలో ఉండే కష్టం తెలిసింది. చెల్లెళ్లు ఇద్దరితో కలిసి ఆన్‌లైన్‌లో కొబ్బరిచెట్లు ఎక్కే యంత్రాన్ని కొనాలి అనుకుంటే అమ్మానాన్నలు అంగీకరించలేదు. కానీ నేను పట్టువిడకుండా యంత్రాన్ని కొన్నా. కొన్ని వారాల్లోనే దాని వాడకం నేర్చుకున్నా. ఒక రోజు నాన్న నన్ను తనతో పాటు తీసుకెళ్లారు. మా ప్రాంతంలో 8 ఇళ్లల్లో కొబ్బరి కాయలను తీసేందుకు నాన్న నన్ను సాయం చేయమన్నారు. ఆ క్షణం నా ఆనందానికి అవధుల్లేవు. అంతేకాదు, చెట్టు ఎక్కడంలో మెలకువలూ నేర్పించారు. ఆ సంఘటనతో నాన్నకి కొడుకులు లేరన్న లోటును తీర్చేశాననిపించింది’ అంటోంది శ్రీదేవి.

ప్రశ్నలతో ముంచెత్తేవారు..

ఇరుగుపొరుగు వారు చుట్టాలు అనేక ప్రశ్నలతో ముంచెత్తేవారట ‘ఇంత చదువుకుంది ఉద్యోగం చేయదా? కాలేజీకి పంపరా? ఆడపిల్లలు చేసే పనులేనా ఇవి? అంటూ అమ్మను ప్రశ్నించేవారు. దానికి సమాధానంగా... అమ్మ ఉద్యోగం ఒక్కటే పని కాదు, ఇష్టంతో చేసే ఏ పనినైనా గౌరవించాలి అని చెప్పేది. ‘నిజమే... నైపుణ్యాలు నేర్చుకోవడానికి చదువుతో సంబంధం లేదు. ఏ పనీ చిన్నది కాదు. జీవితంలో ముందుకు సాగడానికి ఏది అనువైనదో తెలుసుకుంటే చాలు’ అంటోన్న శ్రీదేవి ప్రయాణం స్ఫూర్తిదాయకమే కదా..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్