‘ఆడవాళ్లు... మీకేం తెలియదు’ అనేవారు!

ఆర్కిటెక్చర్‌ అంటే కేవలం భారీ భవనాలు, ఇంటీరియర్స్‌ మాత్రమే కాదు... పరిసరాలకు హాని కలగకుండా, సౌకర్యవంతమైన ప్రదేశాన్ని సృష్టించుకోవడమే అంటారు బెంగళూరుకి చెందిన ఆర్కిటెక్ట్‌లు శ్రీదేవి చంగలి, రోజీ పాల్‌లు.

Updated : 11 Apr 2024 04:07 IST

ఆర్కిటెక్చర్‌ అంటే కేవలం భారీ భవనాలు, ఇంటీరియర్స్‌ మాత్రమే కాదు... పరిసరాలకు హాని కలగకుండా, సౌకర్యవంతమైన ప్రదేశాన్ని సృష్టించుకోవడమే అంటారు బెంగళూరుకి చెందిన ఆర్కిటెక్ట్‌లు శ్రీదేవి చంగలి, రోజీ పాల్‌లు. ‘మాసన్స్‌ ఇంక్‌ డిజైన్‌’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తూ, ఎక్కువ కాలం నిలిచి ఉండేలా మట్టి నిర్మాణాలూ చేస్తున్నారు. అందుకే... ఐక్యరాజ్యసమితి, ఫోర్బ్స్‌ సంస్థలు సంయుక్తంగా ప్రచురించిన సెల్ఫ్‌మేడ్‌ విమెన్‌ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

నచ్చింది చేయగలిగినప్పుడు మనం సంతోషంగా ఉండటమే కాదు...అందరినీ మెప్పించగలిగే అద్భుతాలెన్నో సృష్టించగలం అంటారు’ మాసన్‌ ఇంక్‌ స్టూడియో నిర్వాహకుల్లో ఒకరైన శ్రీదేవి. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు సంప్రదాయ పరిజ్ఞానాన్నీ, ఆధునిక సాంకేతికతనూ ఉపయోగించి విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగేలా పర్యావరణహిత, మట్టి నిర్మాణాలను చేపడుతోందీ సంస్థ. మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆర్కిటెక్చర్‌ చదివేటప్పుడు... శ్రీదేవి చంగల, రోజీ పాల్‌లు సహవిద్యార్థులు. వీరి అభిప్రాయాలు కలవడమే కాదు, భవిష్యత్తు ఆలోచనలపైనా ఒకే రకమైన అవగాహన కలిగి ఉండటంతో కెరియర్‌ని కలిసి నిర్మించుకోవాలనుకున్నారు. ఆ ఆలోచనలు అమలు చేసేందుకే కొన్నాళ్లు ఆర్కిటెక్ట్‌లుగా పుదుచ్చేరిలోని ‘ఆరోవిల్లే ఎర్త్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో పనిచేశారు. ఆ సంస్థ విధివిధానాలు, సస్టైయినబుల్‌ ఆర్కిటెక్చర్‌పై పనిచేస్తున్న తీరు వీరిని ఆకట్టుకున్నాయి. దాంతో ఏడేళ్ల క్రితం ఇద్దరూ కలిసి బెంగళూరు కేంద్రంగా ‘మాసన్స్‌ ఇంక్‌ స్టూడియో’ను ఏర్పాటుచేశారు.

అదెంతో కష్టమైన పని...

నైపుణ్యాల కోసం యూకేలోని యార్క్‌ యూనివర్సిటీలో హెరిటేజ్‌ కన్జర్వేషన్‌లో మాస్టర్స్‌ చేయడానికి వెళ్లారు శ్రీదేవి. ఆ సమయంలోనే సహజ వనరులు ఉపయోగించి పర్యావరణహిత నివాసం నిర్మించి ఇవ్వమంటూ ఓ ప్రాజెక్ట్‌ వచ్చింది. దాన్ని రోజీ అందిపుచ్చుకుని ప్రారంభించారు. అప్పటికే ఫ్రాన్స్‌లో ఎర్తెన్‌ టెక్నాలజీ చదివి ఉన్న ఆమె దాన్ని అలవోకగా పూర్తి చేశారు. ఆ పని మంచి గుర్తింపునీ ఇచ్చింది. శ్రీదేవి తిరిగొచ్చాక ఇద్దరూ కలిసి చారిత్రక భవనాల పరిరక్షణ, మట్టి కట్టడాల నిర్మాణంపై దృష్టి పెట్టారు. ‘బెంగళూరులో ఓసారి పాత ఇళ్లను కూల్చేయడం చూశాం. వాటిపై కాస్త డబ్బూ, సమయం వెచ్చిస్తే మరికొంత కాలం సంరక్షించుకోవచ్చు. కానీ, అంత ఓపిక ఎవరికి ఉంది? ఆ బాధ్యతను మేం తీసుకోవాలనుకున్నాం. మరో పక్క మట్టి నిర్మాణాలను ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉంచే పద్ధతులపైనా దృష్టిపెట్టాం. యూరప్‌, ఆసియాలో వందల ఏళ్లుగా చెక్కుచెదరని కట్టడాల వెనక ఉన్న పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాం. మా పని మీద మాకెంత నమ్మకం ఉన్నా... ఖాతాదారులను ఒప్పించడం కాస్త కష్టమైన విషయమే. అయితే ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది’ అంటారు శ్రీదేవి.

అసమానతలు ఎదుర్కొని...

‘భవన నిర్మాణంలో పనిచేస్తోన్న కాంట్రాక్టర్‌ నుంచి కూలీ వరకూ... కేవలం మేం ఆడవాళ్లమనే కారణంతో మా సూచనలు పట్టించుకునేవారు కాదు. ఏం చెప్పినా ‘ఆడవాళ్లు మీకేం తెలియదు మేడం’ అనేసేవారు. అంతేకాదు, ఈ రంగంలో పనిచేసే ఆడవాళ్లలో ఎన్ని నైపుణ్యాలున్నా మేస్త్రీలుగా పదోన్నతులు దక్కవన్న విషయం గ్రహించాం. దాంతో మేం ఈ అసమానతలు తగ్గించడానికి స్త్రీలకు అవకాశాలు కల్పించడం,  నైపుణ్యాల శిక్షణ, మెరుగైన వేతనాలు ఇవ్వడం వంటివెన్నో చేశాం’ అంటారామె. గత ఏడేళ్లుగా ఈ ద్వయం పర్యావరణ హిత, పాతభవనాల సంరక్షణ, మట్టి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వందల ప్రాజెక్టులు పూర్తిచేశారు. ఈ కృషే వీరిని ఐక్యరాజ్యసమితి, ఫోర్బ్స్‌ సంస్థలు సంయుక్తంగా ప్రచురించిన సెల్ఫ్‌మేడ్‌ విమెన్‌ జాబితాలో స్థానం సంపాదించుకునేలా చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్