ఆటకు దూరమైనా... అభిమానులు పెరిగారు!

నిద్ర లేవడం ఆలస్యం... నడక మైదానం వైపే! రాత్రి ఇంటికి చేరేముందు చేసే ఆఖరి పనీ ఆటే. ఈ క్రమంలో స్నేహితుల్లేరు, ఫిట్‌నెస్‌ పేరిట నచ్చింది తినడానికీ లేదు, నలుగురితో కలిసి చదువుకునే వీలూ తక్కువే... ఇంకా ఇలాంటి త్యాగాలెన్నో. అలాంటామెకు ఒక్కసారిగా ఆట దూరమైతే? అదీ రాణిస్తున్న సమయంలో! మరెవరైనా అయితే కుంగిపోయేవారేమో.

Published : 15 Apr 2024 06:50 IST

నిద్ర లేవడం ఆలస్యం... నడక మైదానం వైపే! రాత్రి ఇంటికి చేరేముందు చేసే ఆఖరి పనీ ఆటే. ఈ క్రమంలో స్నేహితుల్లేరు, ఫిట్‌నెస్‌ పేరిట నచ్చింది తినడానికీ లేదు, నలుగురితో కలిసి చదువుకునే వీలూ తక్కువే... ఇంకా ఇలాంటి త్యాగాలెన్నో. అలాంటామెకు ఒక్కసారిగా ఆట దూరమైతే? అదీ రాణిస్తున్న సమయంలో! మరెవరైనా అయితే కుంగిపోయేవారేమో. తన్వీ మాత్రం దారి మార్చుకుని అభిమానులను సంపాదించుకుంది.

‘ముదురు రంగు సూట్‌ అమ్మాయి’... గత ఐపీఎల్‌లో తన్వీ షాకి అభిమానులు పెట్టుకున్న ముద్దుపేరు. మైదానంలో చలాకీగా తిరుగుతూ, ఆటగాళ్లతో సరదా సంభాషణలు సాగిస్తూ తిరిగిన ఈమె ఎవరా అని అప్పట్లో నెట్టింట తెగ వెదికారు. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్‌సైడర్‌గా అభిమానులకూ ఆటగాళ్లకూ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. నవ్వుతూ సరదాగా తిరిగే ఆమె వెనక బలమైన కథ ఉంటుందని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. తన్వీ షాది ముంబయి. సోదరుడితో కలిసి సరదాగా టెన్నిస్‌ అకాడెమీకి వెళ్లేది. వ్యాయామం చేసినట్లు ఉంటుంది కదాని తన్వీని కూడా అక్కడే చేర్చారు. పదేళ్లు వచ్చేనాటికి టోర్నమెంట్‌ల్లో పాల్గొని పతకాల వేట ప్రారంభించింది కూడా. ఉదయం 5కల్లా అకాడెమీలో ఉండేది. సాయంత్రం స్కూలు పూర్తయ్యాకా అక్కడికే! ఇక స్నేహితులతో గడిపే సమయమేది? ఒకానొక దశలో నచ్చింది తినడానికి లేదు, ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి లేదంటూ తన్వీ ఏడ్చేదట. కానీ గెలుపు, సాధించాక వచ్చే గుర్తింపు, అభినందనలు ఆమెలో మార్పు తెచ్చాయి. అండర్‌ 16, 18 విభాగాల్లో ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనడమే కాదు, దేశంలోనే ఒకటి, రెండు ర్యాంకుల్లో నిలిచింది. జూనియర్‌ గ్రాండ్‌స్లామ్స్‌ కూడా ఆడింది.

అనుకోని అవకాశం...

విజయవంతంగా సాగుతున్న ఆమె క్రీడా ప్రయాణంలో అనుకోని కుదుపు నడుముకి గాయం రూపంలో ఎదురైంది. శస్త్రచికిత్స, రిహాబిలిటేషన్‌ తప్పనిసరి అన్నారు వైద్యులు. తరవాతైనా తిరిగి రాకెట్‌ పట్టుకోగలదా అన్నది సందేహమే. తన్వీకి ఏం చేయాలో తోచలేదు. చేసేదేం లేక ఆటకు దూరమైంది. సీనియర్‌ స్థాయిలోకి అడుగుపెట్టి పతకాలతో దేశానికి పేరు తేవాలనుకున్న తన కల కూలిందన్న నిరాశ ఒకవైపు. కూతురిని ఛాంపియన్‌గా చూడాలన్న తల్లి ఆశ నెరవేర్చలేకపోయాననే బాధ మరోవైపు. తన్వీ వెంట తల్లి కూడా దేశవిదేశాలు తిరిగేది. ఎన్నో ఇబ్బందులూ ఎదుర్కొంది. ఈ ఆలోచనలతో మరింత బాధ. కానీ ఎన్నాళ్లిలా? ‘ఒక ఇన్నింగ్స్‌ చేజారింది. నా తరవాతి ఇన్నింగ్స్‌ ఏంటో వెతుక్కుంటా...’ అని ఇంట్లోవాళ్లకి ధైర్యం చెప్పి చదువుపై దృష్టిపెట్టింది. పబ్లిక్‌ రిలేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసింది. కానీ తరవాతేంటి? ఆట తప్ప మరొక లోకం తెలియదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా ‘స్పోర్ట్స్‌ ప్రెజెంటేటర్‌’ అవకాశం తలుపు తట్టింది.

‘తెలియని పని. అయినా ఆటతో సంబంధం ఉందని సరేనన్నా. తొలిరోజు చెవికి ఉన్న మైక్‌లో డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, ప్రోగ్రామింగ్‌ వాళ్లు ఏవోక కమాండ్స్‌ ఇస్తూనే ఉన్నారు. అవొకటి చెవిలో మోగుతున్నాయన్న భావనే లేకుండా అప్పటికప్పుడు మాట్లాడాలి. ఏ శిక్షణ లేకుండానే తొలిసారే విజయవంతంగా పూర్తిచేశా. ప్రశంసలూ అందుకున్నా. వాటికంటే ఏదో ఒక రూపంలో మైదానంలో అడుగుపెట్టా, ఆటగాళ్లతో గడిపానన్న ఆనందమే నడిపిందంటే నమ్ముతారా’ అంటుంది తన్వీ. తరవాత దానికోసం చాలా కసరత్తే చేసింది. నైపుణ్యాలనూ నేర్చుకుంది. ఆపై టెన్నిస్‌, ఫుట్‌బాల్‌తోపాటు క్రికెట్‌ వరల్డ్‌కప్‌, ఐపీఎల్‌, టీ10... వంటి ఎన్నో కార్యక్రమాలకు స్పోర్ట్స్‌ ప్రెజెంటేటర్‌గా దిగ్గజ ఆటగాళ్లతో కలిసి పనిచేసింది. తన ముదురు రంగు దుస్తులతో ఫ్యాషన్‌ ట్రెండ్‌నీ సృష్టించింది. అందుకే ఆమె మాటలకే కాదు, దుస్తులకీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగారు.

అనుసరించొద్దు...

‘ఆటకు దూరమవ్వడం బాధగా లేదా అని చాలామంది అడుగుతుంటారు. ఏళ్ల ప్రయాణం ముగియడం ఎవరికైనా బాధే! అలాగని బాధపడుతూ కూర్చోవడం నా నైజం కాదు. అందుకే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈక్రమంలో జీవితం ఎలాంటి సవాళ్లనిచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి అనుకుంటూ సాగిపోతున్నా. మీరూ అదే చేయండి. ‘ఇలా ఉండాలి... అలా చేయాలి... ఈవిధంగా చేయొద్దు’ అని సలహాలిచ్చేవారు చాలామందే. అలాగని గుడ్డిగా అనుసరించొద్దు. అది అసంతృప్తినే మిగులుస్తుంది. మీకు నచ్చిందే చేయండి. దానికోసం ఎంత కష్టమైనా పడండి. ఎంత కష్టపడ్డా ఒక్కోసారి మార్గం మూసుకుపోవచ్చు. అప్పుడు ప్లాన్‌ బీకీ సిద్ధంగా ఉండండి. ఊహించని సర్‌ప్రైజ్‌లు మీకోసం వేచి ఉంటాయంటే... నమ్మండి. అందుకు నేనే ఉదాహరణ’ అంటోన్న తన్వీ ప్రయాణం ఈ తరానికి మంచి పాఠమే కదూ!


రెప్పవేయడం మంచిదే..!

‘వాలుకనులదానా నీ విలువ చెప్పుమైనా’ అంటూ.. ఆడవాళ్ల కళ్లను వర్ణిస్తూ పాటలు ఎన్నో..! అయితే  కళ్లని అందంగా అలంకరించుకోవడమే కాదు, వాటిని కాపాడుకోవడంలోనూ మనమే ముందున్నామట. ఎలాగంటారా... స్త్రీలు నిమిషానికి ఇరవైసార్లు కనురెప్పలు వేస్తే, మగవారు 11 సార్లు మాత్రమే రెప్పవేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల కళ్లల్లోని దుమ్మూధూళి బయటకి వచ్చి పొడిబారడం, మంట, దురద వంటి సమస్యలూ తగ్గుతాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్