ఆ సమయంలో... అయిదేళ్ల పిల్లనైపోతా!

ప్రయాణాలు అంటే చాలు చిన్నపిల్ల అయిపోతుందట అదితి రావ్‌ హైదరీ. అవంటే ఆమెకి అంత ఇష్టం... అయితే ప్లాన్‌ చేసుకుని ఇలాగే సాగాలి అనుకోదట. అప్పటికప్పుడు ఎలా తోస్తే అలా సాగుతూ వెళితేనే పర్యటన మజా తెలుస్తుంది అంటుంది.

Updated : 24 Apr 2024 14:50 IST

ప్రయాణాలు అంటే చాలు చిన్నపిల్ల అయిపోతుందట అదితి రావ్‌ హైదరీ. అవంటే ఆమెకి అంత ఇష్టం... అయితే ప్లాన్‌ చేసుకుని ఇలాగే సాగాలి అనుకోదట. అప్పటికప్పుడు ఎలా తోస్తే అలా సాగుతూ వెళితేనే పర్యటన మజా తెలుస్తుంది అంటుంది. ఇంతకీ తనకి వీటిపై ఇష్టం ఎలా వచ్చిందో తెలుసా?

‘నేనో డ్యాన్సర్‌ని అని తెలుసుగా! ప్రదర్శనలివ్వడానికని ఓసారి మా డ్యాన్స్‌ టీచర్‌, సీనియర్‌తో కలిసి చైనా, జపాన్‌ వెళ్లా. రెండు వారాల చొప్పున పర్యటన. ఒకరోజు ప్రదర్శన ఉంటే మరోరోజు ప్రయాణం. భూమి మీద కాలు నిలపలేదన్నట్లుగా ప్రయాణించాం. ఒళ్లు నొప్పులు, అలసటకి కొన్నిరోజుల పాటు ఏడ్చేశా. కానీ ఆ సమయంలో మాత్రం ఏదెక్కడ మిస్‌ అవుతానా అని విశ్రాంతి తీసుకోవడానికీ ఆలోచించానంటే పర్యటనలంటే ఎంత పిచ్చో అర్థం చేసుకోండి. హాంగ్‌జో, మంగోలియా, టోక్యో... ఆ నగరాల అందాలు అంతలా ఆకట్టుకున్నాయి మరి! ఇప్పటికీ మెచ్చిన యాత్ర అంటే ఇదే గుర్తొస్తుంది.

ఇంకోసారి కేప్‌టౌన్‌కి వెళ్లా. ఆ పర్వతాలు, సముద్రం, నదులు, జంతువులు... ఇక వాతావరణం గురించైతే చెప్పనక్కర్లేదు. ప్రకృతి, చారిత్రక ప్రదేశాలు... ఇలా కాస్త ప్రశాంతంగా ఉండే ప్రాంతాలంటే ఇష్టపడతాను. అవన్నీ ఇక్కడ కనిపిస్తోంటే నా ఆనందానికి అవధుల్లేవు. చారిత్రక నిర్మాణాలు, రాళ్ల దారులు, రోడ్డు వార కేఫ్‌లు, ఆత్మీయంగా ఆదరించే మనుషులు... తలుచుకుంటే ఇప్పటికీ మనసంతా సంతోషంతో నిండిపోతుంది.

‘సేవ్‌ ద టైగర్‌’ ప్రాజెక్టులో భాగంగా సుందర్‌బన్‌ ప్రాంతానికి వెళ్లా. కోల్‌కతా వరకూ విమానంలో వెళ్లి, ఆ తరవాత రోడ్డు మార్గంలో, పడవలో ఆరు గంటల ప్రయాణం. నల్లగా, బురదతో నిండిన నదినీరు, చుట్టూ ఎత్తుగా పెరిగిన మాంగ్రూవ్‌ మొక్కలు. మామూలుగా భయం వేయాలి కదా! పట్టణాల్లో పెద్ద పెద్ద భవంతుల్లో జీవితం గడుపుతూ అంత పచ్చదనాన్ని చూసేసరికి జీవితంలో ఏం కోల్పోతున్నామో అర్థమైంది. ఇవేకాదు, నేను పుట్టిన హైదరాబాద్‌తోపాటు, నాకంటూ గుర్తింపు తెచ్చిన ముంబయి అన్నా ప్రేమే. ఆమ్‌స్టర్‌డామ్‌, జోధ్‌పుర్‌, తుర్కియే, తైవాన్‌...’ కదిలించాలేగానీ తను చూసిన ప్రదేశాల గురించి ఉత్సాహంగా చెప్పుకొంటూ వెళుతుంది అదితి. అయితే ఒంటరిగా కాదు, ఆత్మీయులతో వెళితేనే అసలు మజా అంటుంది. ప్రేమించినవారితో వెళితే అందమైన ప్రదేశాలు మరింత అందంగా కనిపిస్తాయని తన అభిప్రాయం.

అలసట కాదు...

చిన్నతనంలో బోర్డింగ్‌ స్కూల్లో చదువుకుంది అదితి. అయినవాళ్లకి దూరంగా, కఠిన నియమాలతో ఉంటుందని అందరూ అయిష్టత చూపుతారు. కానీ అక్కడి పచ్చదనం ఆమెను ప్రకృతితో ప్రేమలో పడేలా చేసిందంటుంది అదితి. ఇక సినిమాల్లోకి అడుగుపెట్టాక ప్రయాణాలంటే చిరాకు కలగకపోగా మరింత ఇష్టం పెరిగిందని చెబుతుంది. ‘ఏ క్షణమైనా బ్యాక్‌ప్యాక్‌తో బయల్దేరిపోతా. ఆ సమయంలో నిద్ర కూడా వృథా సమయంలాగే తోస్తుంది. అయిదేళ్ల చిన్నపిల్లనైపోతా అంటే నమ్మండి. ప్రతిదాన్నీ కళ్లు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంగా చూస్తా. ప్రయాణాల్లో భిన్న వ్యక్తుల పరిచయం, సంస్కృతీ సంప్రదాయాలు మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి, వ్యక్తులను వారిని వారిగా స్వీకరించడం అలవాటు చేస్తుందని నమ్ముతా. నాకిదో డిటాక్స్‌ కూడా. సాహసాలు చేయాలనిపించిందా చేస్తా. ఫోన్‌కి దూరంగా ప్రపంచంతో గడిపేస్తా. నచ్చినవన్నీ తినేస్తా. సైకిల్‌, ఆటో, నడక... నచ్చిన రీతిలో వెళ్లిపోతా. అవే నాకు అసలైన సెలవులు మరి. మొత్తంగా రోజు గడిచేనాటికి చెదిరిన జుట్టు, మట్టి కొట్టుకుపోయిన పాదాలు, కళ్లల్లో మెరుపు కనిపించాలి’ అని నవ్వేస్తుంది అదితి. పర్యటనల్లో ఉన్నా ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యమిస్తుంది. కనీసం పదిహేను నిమిషాలైనా డ్యాన్స్‌, యోగా, ధ్యానంకి కేటాయిస్తుంది. ఎన్నిరోజులైనా హుషారుగా తిరిగేయడానికి అదే కారణం అంటుంది. అన్నట్టూ... తను తిరగాల్సిన జాబితాలో చాలా ప్రదేశాలే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా ఆదరణలేని ఉత్తర భారతదేశ అందాలను చుట్టి రావాలి. ఆ అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేయాలన్నది తన కల అట. మరి మీ విహారాలు ఎలా ఉండాలి? ఆ విశేషాలను మాతో పంచుకోండి.

మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?


మీకు తెలుసా!

తాజా యూపీఎస్సీ ఫలితాల్లో అమ్మాయిలు మొదటి పది ర్యాంకుల్లో ఐదింటిని సాధించి సత్తా చాటారు. మరి అసలు మన దేశంలో మొట్టమొదటి మహిళా ఐఏఎస్‌ ఎవరో మీకు తెలుసా! స్వతంత్ర భారత దేశంలో మొదటి ఐఏఎస్‌ అన్నా రాజాం మల్హోత్రా. ఈమె 1951లో సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించారు. పశ్చిమ బెంగాల్‌కు చీఫ్‌ సెక్రటరీగా పనిచేశారు. ఒక రాష్ట్రంలో అత్యున్నత పదవిని అందుకున్న మహిళ కూడా ఈమే. మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఈమె మంచి అడ్మినిస్ట్రేటర్‌గా, నాయకత్వ నైపుణాలున్న వ్యక్తిగా పేరొందారు. అంతేకాదు, ముంబయికి దగ్గర్లోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌ ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు. ఎందరో అమ్మాయిలకు సివిల్స్‌లో మార్గదర్శి అయ్యారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్