ప్రాణం కోసం... ‘సూర్య నాయక్‌’

ఆమెకు 50 ఏళ్లుంటాయి. పనిపై బయటకు వెళ్లినప్పుడు గుండెలో నొప్పిగా అనిపించింది. ఇంటికెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుందనుకున్నారామె. అంతలోనే నొప్పి ఎక్కువై స్పృహతప్పి పడిపోయారు. ఆమెను చూసినవారు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. తీరా ఆసుపత్రికి చేర్చేలోపే ఆమె కన్ను మూశారు. ఆ గుంపులో ఒకరికైనా ప్రథమ చికిత్స చేయడం తెలిసి ఉంటే ఆవిడ బతికి ఉండేదంటుంది వెరుష్క పాండే.

Published : 23 Apr 2024 01:33 IST

ఆమెకు 50 ఏళ్లుంటాయి. పనిపై బయటకు వెళ్లినప్పుడు గుండెలో నొప్పిగా అనిపించింది. ఇంటికెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుందనుకున్నారామె. అంతలోనే నొప్పి ఎక్కువై స్పృహతప్పి పడిపోయారు. ఆమెను చూసినవారు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. తీరా ఆసుపత్రికి చేర్చేలోపే ఆమె కన్ను మూశారు. ఆ గుంపులో ఒకరికైనా ప్రథమ చికిత్స చేయడం తెలిసి ఉంటే ఆవిడ బతికి ఉండేదంటుంది వెరుష్క పాండే. అప్పటికి వెరుష్క హైస్కూల్‌ విద్యార్థిని. ‘ఫస్ట్‌ ఎయిడ్‌’ గురించి తెలుసుకుని, విద్యార్థి దశలోనే దానిపై అందరిలో అవగాహన కలిగించేలా ప్రాజెక్టు ప్రారంభించింది. అదే ఆమెను ఐక్యరాజ్యసమితి ఆహ్వానాన్ని అందుకునేలా చేసింది.

వెరుష్కకు ఇంట్లో అందరికన్నా నానమ్మ అంటే ప్రాణం. ఎక్కువ సమయం ఆమె దగ్గరే ఉండేది. ఆవిడ ఇక లేదనే నిజం జీర్ణించుకోలేకపోయింది. హార్ట్‌ ఎటాక్‌ వచ్చినప్పుడు నానమ్మకు ఎవరైనా సీపీఆర్‌ చేసి ఉంటే బతికి ఉండేదేమో అనే ఆలోచన ఆమెను తీవ్రంగా వేదనకు గురి చేసేది. ‘కొవిడ్‌లో చాలామంది హృద్రోగంతో చనిపోతున్నారని తెలిసినప్పుడల్లా చలించిపోయేదాన్ని. గుండెనొప్పి వచ్చినవారికి సీపీఆర్‌ నిర్వహిస్తే వారిలో కొందరినైనా బతికించే అవకాశం ఉంటుంది. అలా జరగాలంటే దీని గురించి అందరికీ తెలిసుండాలి. ఆ అవగాహన నేనే ఎందుకు తీసుకురాకూడదనిపించింది. దాంతో 2022లో ‘సూర్య నాయక్‌’ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించా. బెంగళూరులో ఆశా వర్కర్లు, బస్సు డ్రైవర్లు, ఫ్యాక్టరీ వర్కర్లు, సెక్యూరిటీ పర్సనల్స్‌కు ఈ ప్రాజెక్టు ద్వారా సీపీఆర్‌ వంటి ప్రాథమిక చికిత్సలపై శిక్షణ అందేలా కృషి చేస్తున్నా’నంటోంది వెరుష్క.

ప్రపంచవేదికపై...

కర్ణాటకలో ‘సూర్య నాయక్‌’ ప్రాజెక్టు ద్వారా వందల మందికి ఫస్ట్‌ ఎయిడ్‌లో శిక్షణనిచ్చింది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి వెరుష్క చేస్తున్న ఈ కృషి ఆమెను అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. న్యూయార్క్‌లో గతేడాది ఐక్యరాజ్యసమితి వేదికపై ‘1మిలియన్‌1బిలియన్‌’ యూత్‌ సమ్మిట్‌కు ఆహ్వానాన్ని అందుకుంది. ‘సీపీఆర్‌ శిక్షణ ప్రారంభించేనాటికి నా వయసు 14 ఏళ్లు. ఫస్ట్‌ ఎయిడ్‌ నేర్పించే పరికరాలను వెంటపెట్టుకొని మరీ వెళ్లేదాన్ని.   అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయేవారు. 5 గంటల కోర్సుగా మొదట కోలార్‌లో శిక్షణ ప్రారంభించా. ఒక బృందం శిక్షణ పూర్తయితే, అది మరొక బృందానికి నేర్పించేలా చేస్తున్నా. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని బతికించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఇది అందరి బాధ్యత కూడా. సీపీఆర్‌తో హృద్రోగం మాత్రమే కాదు, మరెన్నో మరణాలనూ తగ్గించొచ్చు. త్వరలో దీన్ని దేశవ్యాప్తం చేయాలని ఉంద’ని చెబుతున్న వెరుష్కపై ప్రపంచగుర్తింపు పొందిన ఫిల్మ్‌మేకర్‌ అమిత్‌ మాధేసియా ‘హార్ట్‌ ఈజ్‌ ఏ వెస్సెల్‌’ లఘుచిత్రాన్ని తీశారు. దీన్ని ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్