రక్షణ దళంలో... డాక్టరమ్మలు!

ఇద్దరూ డాక్టరమ్మలు. ఇంకా చెప్పాలంటే ఆర్మీ డాక్టరమ్మలు. కేవలం వైద్యం చేయడమే కాదు... దేశ రక్షణ బాధ్యతనీ అందుకున్నారు జోయా, అర్మిష్‌...

Published : 02 May 2024 01:57 IST

ఇద్దరూ డాక్టరమ్మలు. ఇంకా చెప్పాలంటే ఆర్మీ డాక్టరమ్మలు. కేవలం వైద్యం చేయడమే కాదు... దేశ రక్షణ బాధ్యతనీ అందుకున్నారు జోయా, అర్మిష్‌...


వైఫల్యాలు దాటి... చరిత్ర సృష్టించి...

ఓవైపు నాన్న, నానమ్మల కల. మరోవైపు వరుసగా పలకరించే వైఫల్యాలు. ఇవన్నీ దాటి జోయా మిర్జా చరిత్రలో తన పేరు ఎలా లిఖించుకున్నారు?

నానమ్మకి జోయా మిర్జాని వైద్యురాలిగా చూడాలన్నది కల. దాన్ని నెరవేర్చడానికి డాక్టర్‌ అవ్వాలనుకున్నారామె. ఈవిడది ఛత్తీస్‌గఢ్‌లోని దర్గ్‌. ఇంటర్‌ పూర్తయ్యాక వైద్యవిద్య ప్రవేశపరీక్ష ‘నీట్‌’ రాస్తే... ర్యాంకు రాలేదు. ఎన్నో ఆశలతో ప్రయత్నిస్తే వైఫల్యం ఎదురయ్యేసరికి తట్టుకోలేకపోయారామె. దీంతో దిల్లీలో గ్రాడ్యుయేషన్‌ చేయడానికి వెళ్లిపోయారు. కానీ ‘ఒక్క వైఫల్యానికే భయపడితే ఎలా’ అని ఇంట్లోవాళ్లు తిరిగి ప్రయత్నించేలా ప్రోత్సహించారు. ఈసారి శిక్షణనీ ఇప్పించారు. ‘ఆలస్యంగా చేరా. దానికితోడు మాక్‌ టెస్ట్‌ల్లో వెనకపడేదాన్ని. అయినా మరింత కష్టపడ్డా. ఇంతలో నానమ్మకి ఆరోగ్యం పాడైందని కొన్నిరోజులు ఇంటికొచ్చా. ఆ ప్రభావం కాస్తా సన్నద్ధతపై పడింది. దీంతో ఒక్క ర్యాంకులో సీటు దూరమైంది. ఈసారి మరింత నిరాశ ఆవరించింది. అప్పుడు ‘మా దృష్టిలో అత్యంత గౌరవప్రదమైన వృత్తులంటే వైద్యులు, సైనికులవే! ఒకరు ప్రాణం నిలపడానికి కృషి చేస్తే... మరొకరు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ దేశాన్ని రక్షిస్తుంటారు. అలాంటి వృత్తిలో నువ్వు స్థిరపడితే చూడాలని ఉంది’ అన్న నాన్న, నానమ్మల మాట మనసులో నాటుకుపోయింది. ఈసారి లక్ష్యం ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ మెడికల్‌ కాలేజ్‌ అయ్యింది’ అంటారు జోయా. ఆ ఏడాది కటాఫ్‌ ఎక్కువగా ఉన్నా సీటు సాధించడమే కాదు... వైద్యవిద్యనీ పూర్తిచేశారు. లెఫ్టినెంట్‌ డాక్టర్‌ అయ్యి చరిత్ర సృష్టించారు. ఆవిడ తొలి పోస్టింగ్‌ కశ్మీర్‌లో. ‘ఓవైపు డాక్టరుగా ప్రజలకు సేవ చేస్తూనే, డిఫెన్స్‌ సర్వీసుల్లో చేరి దేశానికి సేవ చేయగలగడం గర్వంగా ఉంది’ అంటున్నారామె.


అమ్మానాన్నల నుంచి...

వైద్యురాలు అవ్వాలన్నది కల. దేశ రక్షణ దళమంటే గౌరవం. ఈ రెండు బాధ్యతలనీ నిర్వర్తించొచ్చని ఆర్మీ డాక్టర్‌ అవ్వాలనుకున్నారు అర్మిష్‌ అసిజా. ప్రతిభ చూపి, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గానూ మారారు.

నాన్న ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌. అమ్మ ఓ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగానికి అధిపతి. కుటుంబంలో ఆర్మీ నేపథ్యం ఉన్నవారెవరూ లేరు. కానీ సైనికుల పట్ల గౌరవం అర్మిష్‌ని రక్షణ రంగంవైపు నడిపింది. ఈవిడది పంజాబ్‌ సరిహద్దు ప్రాంతంలోని ఫాజిల్కా. ‘నీట్‌’ ద్వారా ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీలో సీటు సాధించారు. ప్రతిభ చూపి, ఏర్‌ఫోర్స్‌లో శిక్షణకు ఎంపికయ్యారు. అదీ విజయవంతంగా పూర్తిచేసి, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ అయ్యారు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలవడమే కాదు... తన ప్రాంతం నుంచి తొలి ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గానూ నిలిచారు. ‘తొలినుంచీ వైద్యవిద్యపై ఆసక్తి ఉన్నా... ఆటలూ ఆడేదాన్ని. ఇక్కడికొచ్చాక బాస్కెట్‌బాల్‌, రోలర్‌ స్కేటింగ్‌ ఆడా. ఇవి నన్ను శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢంగా మార్చాయి. నేవీ, ఏర్‌ఫోర్స్‌లకు గట్టి పోటీ ఉంటుంది. నేను అయిదో ర్యాంకు సాధించా. దీంతో నచ్చిన విభాగం... ఏర్‌ఫోర్స్‌ ఎంచుకుని ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ని కాగలిగా. నా విజయంలో కుటుంబానిదీ ప్రధాన పాత్రే. వారివల్లే నేను ఆర్మీ వైపు ఆకర్షితురాలినయ్యా. ఎప్పుడైనా తడబడినా నా వెన్నంటే ఉండి ప్రోత్సహించేవారు. వాళ్లతోపాటు మా ప్రాంతానికీ గర్వకారణంగా నిలవడం ఆనందంగా ఉంది’ అంటారు 23 ఏళ్ల అర్మిష్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్