స్పాంజ్‌ టెక్నాలజీతో నీటి వడబోత

మంచినీటి సౌకర్యం కరవై ఊళ్లకు ఊళ్లు అనారోగ్యం పాలవుతున్న ఎన్నో ఘటనల్ని చూస్తున్నాం. మన వరకూ రాలేదు కదా అని విని వదిలేస్తున్నాం. కానీ ఈషాని అలా కాదు. తన సొంత రాష్ట్రంలో ప్రజలు కలుషిత నీళ్లు తాగి ఆస్పత్రుల పాలవ్వడం చూసింది. వాళ్లందరికీ సురక్షిత నీటిని అందించాలనుకుంది.

Updated : 04 May 2024 05:07 IST

మంచినీటి సౌకర్యం కరవై ఊళ్లకు ఊళ్లు అనారోగ్యం పాలవుతున్న ఎన్నో ఘటనల్ని చూస్తున్నాం. మన వరకూ రాలేదు కదా అని విని వదిలేస్తున్నాం. కానీ ఈషాని అలా కాదు. తన సొంత రాష్ట్రంలో ప్రజలు కలుషిత నీళ్లు తాగి ఆస్పత్రుల పాలవ్వడం చూసింది. వాళ్లందరికీ సురక్షిత నీటిని అందించాలనుకుంది. బయోఫిల్టరేషన్‌ యంత్రాన్ని రూపొందించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది..

‘ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది నీటి కొరత, కాలుష్యం. అభివృద్ధి పేరుతో నదులు, చెరువులు, భూగర్భ జలాల్ని కలుషితం చేస్తున్నాం. తిరిగి ఆ నీటినే తాగునీరుగా వినియోగించి జబ్బుల బారిన పడుతున్నాం’ అంటున్న ఈషాని ఝా కాలిఫోర్నియాలో పుట్టిపెరిగింది. అక్కడే ఇంజినీరింగ్‌ చదువుతోంది. సెలవుల్లో సొంత రాష్ట్రమైన బిహార్‌కు వచ్చింది. పచ్చటి వాతావరణాన్ని ఊహించుకుని భారత్‌కు వచ్చిన ఆమెకి ఎటు చూసినా మురికివాడలే కనిపించాయి. ఆ వాడల్లో సగం మంది చిన్నా, పెద్దా తేడా లేకుండా కాళ్లూ, చేతులూ సరిగా లేక వైకల్యం బారిన పడటం గమనించింది ఈషాని. దీనికి కారణం ఏమిటని బంధువుల్ని ఆరా తీస్తే నీటిలో ఫ్లోరైడ్‌ స్థాయులు ఎక్కువ అవడమేనని చెప్పారట. ‘నీటిని వడపోసే యంత్రాలేవీ అందుబాటులో లేవా’ అని ప్రశ్నిస్తే.. పూట గడవడమే కష్టంగా ఉన్న జీవితాలకు అంత ఖర్చును భరించే సామర్థ్యం ఎక్కడుంటుంది అన్నారట వాళ్ల తాతయ్య. అప్పుడే తక్కువ ఖర్చుతో నీటి వడపోత యంత్రాన్ని రూపొందించి, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిశ్చయించుకుంది ఈషాని.

వేదికేదైనా ప్రస్తావన ఒక్కటే...

తిరిగి అమెరికాకు వెళ్లి అసోషియేషన్స్‌ సదస్సుల్లో, కాలేజీ సెమినార్స్‌లో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నీటి కాలుష్యానికి సంబంధించిన సమస్యనే ప్రస్తావించేది. తన ఆసక్తిని గమనించిన వాటర్‌ రిసోర్స్‌ స్వచ్ఛంద సంస్థలు యంత్రం తయారీకి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. దాదాపు రెండు సంవత్సరాలు శ్రమించి బయోఫిల్టరేషన్‌ యంత్రాన్ని తయారుచేసింది. తన యంత్రం అందరికీ అందుబాటులో ఉండాలనుకుంది ఈషాని. దానికి తగ్గట్లుగానే నెలకు ఒక్క డాలర్‌ ఖర్చుతో నీటిని వడపోసే యంత్రాన్ని తయారుచేసింది. దీని సాంకేతికతలో అన్ని ఫిల్టర్లలా కాకుండా మూడు లేయర్లతో కూడిన బయోచార్‌ అనే ఒక సూపర్‌ స్పాంజ్‌ టెక్నాలజీని రూపొందించింది. ఈ స్పాంజ్‌లో ఉండే మాంగనీస్‌ డయాక్సైడ్‌ డోప్ట్‌ నీటిలో ఉండే విష పదార్థాలను ఆర్గానిక్‌ పద్ధతిలో వడపోసి మంచినీటిని అందిస్తుంది. క్షేత్రస్థాయిలో అనేక అంతర్జాతీయ వేదికలపై ఈ యంత్రాన్ని ప్రదర్శించి బ్లూ క్రిస్టల్‌, హ్యాండ్‌మేడ్‌ డిప్లొమా లాంటి అవార్డున్నీ అందుకుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇళ్లు, నదులు, చెరువులు, భూగర్భ జలాల్లో పేరుకుపోతున్న బయోవేస్ట్‌ను శుభ్రం చేసే యంత్రాన్ని తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇది పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి విడుదలయితే వంద రూపాయలకే నీటిని వడబోసే యంత్రం సామాన్యులకు సైతం అందుబాటులోకి వస్తుంది. ఈషానికి ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్