నవ్వుల మారాణులు!

స్టాండప్‌ కామెడీ... ‘ఆ నవ్వుకోడానికి నాలుగు మాటల్లే’ అని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ మిలీనియల్‌ తరానికి స్టాండప్‌ కామెడీ కెరియర్‌ మంత్రమే కాదు... సామాజిక సమస్యలపై సైలెంట్‌గా ఎక్కుపెట్టే హాస్యాస్త్రం కూడా!

Updated : 05 May 2024 07:06 IST

నేడు నవ్వుల దినోత్సవం

స్టాండప్‌ కామెడీ... ‘ఆ నవ్వుకోడానికి నాలుగు మాటల్లే’ అని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ మిలీనియల్‌ తరానికి స్టాండప్‌ కామెడీ కెరియర్‌ మంత్రమే కాదు... సామాజిక సమస్యలపై సైలెంట్‌గా ఎక్కుపెట్టే హాస్యాస్త్రం కూడా! గొంతుచించుకుని, చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పినా అర్థం కాని.. లైంగిక వివక్ష, నెలసరులు వంటి ఆడవాళ్ల కష్టాలు ఈ కామెడీ షో మంత్రంతో తేలిగ్గా జనాల్లోకి వెళ్తున్నాయి. అందుకే మహిళా స్టాండప్‌ కమెడియన్లకీ డిమాండ్‌ పెరుగుతోంది...

తురోక్తులు విసరడం... నవ్వించడం మొదట్లో రాజదర్బారులకు మాత్రమే పరిమితంగా ఉండేదీ వ్యవహారం. అవి సామాన్యులకు చేరడం మొదలైంది మాత్రం 70ల నుంచే. అమెరికాలో మొదట్లో ‘వాడోవిల్లే షోస్‌’ అని జరిగేవి. నటన, సంగీతం, నృత్యం అన్నీ కలగలపి చేసే ఈ హాస్యసభలని నమ్ముకుని వేలమంది కళాకారులు జీవించేవారు. కాకపోతే వేసిన జోకులే మళ్లీమళ్లీ వేసే తీరుకు నెమ్మదిగా ఆదరణ తగ్గి ఆ స్థానంలో సిట్‌కామ్స్‌కి డిమాండ్‌ పెరిగింది. సిచ్యువేషన్‌కి తగ్గట్టుగా హాస్యాన్ని పండించడమే... ఈ సిట్‌కామ్స్‌. అవే నెమ్మదిగా స్టాండప్‌ కామెడీ షోలుగా మారాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనూ ఈ సహజసిద్ధమైన పెయిన్‌కిల్లర్లకు డిమాండ్‌ పెరిగింది. స్టాండప్‌ కమెడియన్లుగా ఉన్నవారికి కోట్లకొద్దీ లైకులు, లక్షలమంది ఫాలోయర్లు. ఒత్తిడిలో కొట్టుకుపోతున్నవారికి ఊరటనిచ్చే ఈ మెడిసినల్‌ షోలకు డిమాండ్‌ పెరుగుతోంది. దాన్ని అందిపుచ్చుకుని బాడీ ఇమేజ్‌, ప్లస్‌సైజ్‌, నెలసరులు, లైంగిక వివక్ష వంటి వాటిపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ అపర్ణ నాంచెర్ల, ఉరూజ్‌ అష్ఫాక్‌లతో పాటు జేమీ లీవర్‌, శ్యామాహరిణి, అదితీమిట్టల్‌, కనీజ్‌సుర్కా, సుముఖీ సురేష్‌, సుమైరా షేక్‌ వంటి వారూ ఈ రంగంలో దూసుకుపోతున్నారు.


సమస్యలే ఆమె నవ్వుల బాణాలు...!

‘దగ్గరగా చూస్తే జీవితం ఒక విషాదం... దూరంగా చూస్తే హాస్యం’ అన్న చార్లీ చాప్లిన్‌ మాట... అపర్ణ నాంచెర్లకు సరిగ్గా నప్పుతుంది. తీవ్రమైన కుంగుబాటు నుంచి బయటపడేందుకు స్టాండప్‌ కమెడియన్‌గా మారి తనని తాను నిరూపించుకున్నారామె. తన సమస్యల్నే బాణాలుగా చేసి... ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టేస్తారు.

ఆధునిక హాస్య ప్రపంచంలో అసాధారణ ప్రతిభ చూపించే అరుదైన వ్యక్తుల్లో అపర్ణ ఒకరు. అయితే, తానే ఊహించని విధంగా కామెడీ క్వీన్‌గా మారారామె. స్టాండప్‌ కామెడీని కెరియర్‌గా ఎంచుకోవడానికి ముందెన్నడూ ఆమె కామెడీషోలు చూడలేదట. పైగా ఇంట్రావర్ట్‌ కూడా . దీంతో ఆమెలోని  భయం, స్టేజ్‌ ఫియర్‌ పోగొట్టడానికి వాళ్లమ్మ పబ్లిక్‌ స్పీకింగ్‌ కోర్సులో చేర్పించారట. ఆమెతో ఫోన్‌లో పిజాలు ఆర్డర్‌ ఇప్పించి... వారితో సంభాషించేలా చేసేవారట.  అపర్ణ తల్లిదండ్రులు అనంత్‌ నాంచెర్ల, సుచిత్రలిద్దరూ వైద్యులు. 70వ దశకంలోనే హైదరాబాద్‌ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన తెలుగువారు.

తిని తిని... డిప్రెషన్‌కి లోనయ్యి...

అపర్ణ సైకాలజీలో మాస్టర్స్‌ చేశారు. సాధారణంగా కాలేజీ యువతకు భవిష్యత్తు మీద కొన్ని అంచనాలు ఉంటాయి. అపర్ణా ఇందుకు మినహాయింపు కాదు. మిలిటరీలో చేరాలన్నది ఆమె కల. అది సాధ్యం కాకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీనికి తోడు కళాశాలలో క్రాస్‌ కంట్రీ, ట్రాక్‌ టీమ్‌లో సభ్యురాలిగా... ఆహారాన్ని పర్యవేక్షించడం... ఆమెలో అనోరెక్సియా బారినపడేలా చేశాయి. ఆసుపత్రికి వెళ్తే వైద్యులు అపర్ణ డిప్రెషన్‌తో బాధపడుతుందన్నారు. హాస్యం యాంగ్జైటీని తగ్గిస్తుందని వారు చెప్పడంతో ఆ ఆలోచనలు నియంత్రించుకోవడానికీ ఒత్తిడిని తగ్గించుకోవడానికీ స్టాండప్‌ కామెడీ చేయడం ప్రారంభించారామె.. అపర్ణ రోజూ తన ఆలోచనల్నీ, నిరాశపూరిత భావాల్నీ పుస్తకంలో రాస్తారట. వాటిల్లో కనీసం రెండైనా జోకులుగా మారతాయని చెబుతూ నవ్వేస్తారామె. 2006 నుంచి ఇందులో కెరియర్‌ని కొనసాగిస్తున్నారు. 

నిరాశే ఆమె బ్రాండ్‌...

హాస్యం అంటే... ఇతరుల మీద జోకులు వేయడం అనుకుంటారు చాలామంది కానీ, సీరియస్‌ విషయాల్నీ, అవగాహన కల్పించాల్సిన అంశాల్నీ చక్కటి హావభావాలతో చెప్పడమూ కామెడీనే అంటారామె. అందుకే నిరాశ, ఆందోళన, డిప్రెషన్లే బ్రాండ్‌లుగా...ఆమె స్టాండప్‌ కామెడీ చేస్తున్నారు. తన డిప్రెషన్‌... దాన్ని ఎదుర్కోవడంలో పడ్డ ఇబ్బందులు, సంఘటనలు, సందర్భాలకు సున్నిత హాస్యాన్ని మేళవించి ప్రదర్శిస్తుంటారు.  స్టాండప్‌ కామెడీ షోలు చేస్తూనే... రచయిత్రిగానూ మారారు. లేట్‌నైట్‌ విత్‌ సేథ్‌ మేయర్స్‌, టోటల్లీ బయాస్డ్‌ విత్‌ డబ్ల్యూ. కమౌబైల్‌,  ‘ఉమన్‌హుడ్‌’ వంటి వాటిల్లో నటించారు. ‘జస్ట్‌ పుటింగ్‌ ఇట్‌ అవుట్‌ దేర్‌’ అపర్ణకు పేరుతెచ్చిన మొదటి కామెడీ ఆల్బమ్‌. ‘మీరా రాయల్‌ డిటెక్టివ్‌’లో మీనా పాత్రతో పాటు మరికొన్ని పాపులర్‌ షోల్లోని పాత్రలకూ వాయిస్‌ ఇచ్చారు.


సీరియస్‌ విషయమైనా..!

‘కాలేజీలో చేరిన తొలిరోజులు. చిన్నపార్టీ ఏర్పాటు చేశారు. ఎవరెవరు వస్తున్నారా అని కొందరు మాట్లాడుకుంటున్నారు. దివ్య వస్తోందనగానే ‘వావ్‌ ఆ బ్రౌన్‌ ఐస్‌ ఉన్న అమ్మాయేనా? అంజలి... అదే ఆ పొడవు జుట్టున్నామె’ అని చర్చించుకుంటున్నారు. ఇంతలో ఎవరో ‘ఇంకా ఉరూజ్‌’ అనగానే ‘ఇంతకీ అబ్బాయా? అమ్మాయా?’ అన్నారు. ఇది చాలదూ నా పేరును నేను తిట్టుకోవడానికి?’... ఇదే కాదు, ఎంత సీరియస్‌ విషయమైనా నవ్విస్తూ చెప్పడం ఉరూజ్‌ అష్ఫాక్‌ ప్రత్యేకత. తన అనుభవాలు, ఎదుర్కొన్న ఒత్తిడి, కుటుంబం... అన్నీ తన గురించే! హాస్యం మాటున ఆలోచననీ రేకెత్తిస్తుంది. అసలు తను స్టాండప్‌ కమెడియన్‌ ఎలాగైందో తెలుసా? ఉరూజ్‌ది ముంబయి. డిగ్రీ తరవాత పీజీ చేయాలనుకుంది. ఎన్ని కాలేజీలకు దరఖాస్తు చేసుకున్నా సీటు రాలేదు. ఎవరైనా దిగులుపడతారు. ఈమె మాత్రం ఫ్రెండ్‌తో కలిసి తనకెంతో ఇష్టమైన కామెడీపై దృష్టిపెట్టింది. ఇద్దరూ కలిసి ఎన్నో షోలు చేశారు. తరవాత సొంతంగా చేయడం ప్రారంభించింది. ‘క్వీన్స్‌ ఆఫ్‌ కామెడీ’ షో ద్వారా స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. దాంతో టీవీ సిరీస్‌లు వరుసకట్టాయి. కొన్నింటికి కామెడీ రైటర్‌గానూ పనిచేసింది. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చి అభిమానులను సంపాదించుకుంది. ‘ఓహ్‌ నో!’ పేరుతో తను చేసిన షోకి ఎడిన్‌బర్గ్‌ ఫ్రింజ్‌ ఫెస్టివల్‌ నుంచి ‘బెస్ట్‌ న్యూ కమర్‌’ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. దాన్ని అందుకున్న తొలి భారతీయురాలే కాదు, సౌత్‌ ఆసియన్‌ కూడా. సోషల్‌మీడియాలోనూ ఉరూజ్‌కి ఫాలోయింగ్‌ ఎక్కువే. యూట్యూబ్‌లో 5లక్షలు, ఇన్‌స్టాలో 4.5 లక్షలమంది ఆమెను అనుసరిస్తున్నారు.


వాటివల్లే... అంటుకుంటుంది!

వరినైనా నవ్వేటప్పుడు చూశాం అనుకోండి వెంటనే మనమూ నవ్వేస్తాం కదా! మన మెదడులోని మిర్రర్‌ న్యూరాన్లు యాక్టివేట్‌ అవడమే అందుకు కారణమట. అందుకే మన స్నేహితురాలు సిల్లీ జోక్‌కు నవ్వినా, మనకూ నవ్వు వస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం పక్కవాళ్లు నవ్వుతుంటేనే మిగతా ఆడియన్స్‌కి కూడా ఆ విషయం ఫన్నీగా అనిపిస్తుందట. ఎవరూ నవ్వకుంటే ఇందులో అంత ఫన్‌ ఏమీ లేదు అనుకుంటారట. నిజంగా అది సరదాగా ఉన్నా కూడా!


నవ్వి నవ్వి పోతే ఎవరు బాధ్యులు?!

‘మా పెళ్లికి విచ్చేసినందుకు సంతోషం... మీరు కూడా హాయిగా నవ్వుకోండి’ అంటూ వివాహ వేడుకల్లో హాస్య పుస్తకాన్ని రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇవ్వడం ఎప్పుడైనా విన్నారా? ఆ గౌరవం రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మికే  చెందుతుంది. మనసు బాగాలేనప్పుడు మాత్రలా... సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని రెట్టింపు చేసే బూస్టర్‌లా ఉంటుందీ పుస్తకం. ఇంతకీ ఆ పుస్తకం పేరేంటో తెలుసా? ‘పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు’. ఇందులో 24 కథలుంటే ఏదీ మనల్ని నిరాశపరచదు. రేడియోలు వచ్చిన కొత్తల్లో దాన్ని ఎంతో గౌరవంగా చూసే బామ్మగారు. ఇంటి పక్కనే స్కూల్‌ ఉండటంతో ప్రతి పీరియడ్‌కి ముందు ఇంటికొచ్చి ఏదో ఒకటి పొట్టలో పడేసుకునే రచయిత్రి కమ్‌ మనవరాలు. వాళ్లింటికి వచ్చే బామ్మలకు సినిమాలు చూపిస్తూ, ఇంటర్వెల్‌లో గోలీసోడాలు తాగుతూ ఎంజాయ్‌ చేసిన విధానం గురించి రాసిన తీరు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాకు మూలకథను అందించిన ఈ రచయిత్రి... ఎన్నో నవలలు రాసినా ఈ పుస్తకం మాత్రం ప్రత్యేకం. హాస్యప్రియులకో గొప్ప కానుక!


నవ్వులే నవ్వులు!

గర్ల్‌ఫ్రెండ్‌: మా ఇంటి కుక్కపిల్ల చనిపోయింది. మా అమ్మ దాన్ని జీర్ణించుకోలేకపోతుంది బేబీ
బాయ్‌ఫ్రెండ్‌: చచ్చిన కుక్కని తినమని మీ అమ్మకు చెప్పిందెవరు?
గర్ల్‌ఫ్రెండ్‌: ఆ.....


మామ: ఇంతకీ ఏం వచ్చు నీకు?
బాలు: నీళ్లు పొదుపు చేయడం వచ్చు మామ
మామ: అంటే ట్యాప్‌లు ఆఫ్‌ చేస్తుంటావా?
బాలు: లేదు.. వారానికోసారి స్నానం చేస్తుంటా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్