వీగన్‌ ఉత్పత్తులతో... రూ.830 కోట్ల వ్యాపారం!

క్రీడల్లో ఛాంపియన్‌... కానీ గాయాలు ముందుకు సాగనివ్వలేదు. నచ్చిన చదువుకు ఇంట్లోవాళ్ల నుంచి అంగీకారం దొరకలేదు. అమ్మానాన్నలతో యుద్ధం చేసిమరీ నచ్చిన కెరియర్‌లోకి అడుగుపెడితే అక్కడా ఎన్నో సవాళ్లు.

Updated : 07 May 2024 15:33 IST

క్రీడల్లో ఛాంపియన్‌... కానీ గాయాలు ముందుకు సాగనివ్వలేదు. నచ్చిన చదువుకు ఇంట్లోవాళ్ల నుంచి అంగీకారం దొరకలేదు. అమ్మానాన్నలతో యుద్ధం చేసిమరీ నచ్చిన కెరియర్‌లోకి అడుగుపెడితే అక్కడా ఎన్నో సవాళ్లు. ఇవి చాలవూ... 17 ఏళ్ల అమ్మాయిని నిరాశలోకి నెట్టేయడానికి? కానీ ఆమె అలా కాదు... తట్టుకొని నిలబడి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. మరో అడుగు ముందుకేసి రూ.వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్నీ నిర్మించారు. ఆష్కా గరాడియా... ఆమె స్ఫూర్తి ప్రయాణమిది.

ద్దెనిమిదేళ్ల విజయవంతమైన కెరియర్‌. బుల్లితెర నటిగా ఎంతో గుర్తింపు. అందుకున్న అవార్డులకూ కొదవలేదు. అయినా ‘నటనకు దూరమవుతున్నా’నని చెప్పి షాకిచ్చారు ఆష్కా. అందుకు తను చెప్పిన కారణం... ‘ఇకపై వ్యాపారంపై దృష్టిపెట్టాలనుకుంటున్నా’ అనే! బుడిబుడి అడుగులు వేస్తున్న సంస్థ... దానికోసం కెరియర్‌ పాడు చేసుకుంటావా అని ఎంతమంది వారించినా ఆష్కా మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈమెది అహ్మదాబాద్‌. చదువులోనే కాదు, ఆటల్లోనూ ముందే. అన్నిరకాల ఆటలూ ఆడేది. కబడ్డీ అండర్‌-16 నేషనల్‌ ఛాంపియన్‌ కూడా. ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటున్న తరుణంలో ఫ్రాక్చర్లు అయ్యాయి. దీంతో ఆటలను పక్కన పెట్టక తప్పలేదు. ఆష్కాకి క్రిమినల్‌ సైకాలజీ చదవాలని ఉండేది. కానీ ఇంట్లోవాళ్లు వారించారు. దీంతో తన దృష్టి ఆస్ట్రానమీ వైపు మళ్లింది. టెలిస్కోప్‌ తెచ్చుకుని దాంట్లోంచి చుక్కలను చూడటం ఆమెకో వ్యాపకం. నక్షత్రాలను తాకొచ్చని ఏవియేషన్‌ కోర్సు ఎంచుకున్నారు.

ఒంటరి ప్రయాణం...

ఆ సమయంలోనే ఆష్కాకి మోడలింగ్‌ అవకాశం వచ్చింది. మేకప్‌, కెమెరాల మధ్య పనిచేయడం తనకు బాగా నచ్చాయి. దీనిలో కొనసాగుతానన్నారు. న్యూజిలాండ్‌ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌తో చదువుకునే అవకాశాన్ని పక్కనపెట్టి వెళుతున్నారని ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. చదువునీ కొనసాగిస్తానని చెప్పడంతో చివరకు దిగి వచ్చారు. అలా 17 ఏళ్ల వయసులో ఒంటరిగా ముంబయికి ప్రయాణమయ్యారు. పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటూ అవకాశాల కోసం వెదికారు. అప్పుడే అదెంత కష్టమో అర్థమైందామెకు. ‘ఏదీ సులువుగా రాదు... ఓపిగ్గా ప్రయత్నిస్తూ వెళ్లాలి’ అనే తత్వం ఆష్కాది. కొన్నాళ్లకు టీవీ సీరియల్‌ అవకాశం వచ్చింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా వచ్చిన పాత్రనల్లా చేసుకుంటూ వెళ్లారు. ‘కుసుమ్‌’ సీరియల్‌తో గుర్తింపు వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. 18 ఏళ్లలో 23 సీరియల్స్‌, కొన్నింటికి నిర్మాత కూడా. ఓ మిఠాయిల సంస్థనీ ప్రారంభించారు. ఎమ్మీ అవార్డులకు రెండుసార్లు జ్యూరీగానూ పనిచేశారు. అయినా ఏదైనా ప్రత్యేకంగా చేయాలన్న కల ఆమెని వెంటాడేది.

ఇల్లే... సంస్థ

‘ఏ వయసులో బుర్రలో నాటుకుందో తెలియదు కానీ... వ్యాపారవేత్త అవ్వాలని బలంగా ఉండేది. ఓరోజు ఎప్పటిలాగే సెట్‌కొచ్చి మేకప్‌ వేయించుకుంటున్నా. హీరోయిన్‌, ప్రతినాయిక, మహారాణి... ఇలా ఎన్నో పాత్రలు చేశా. వైవిధ్యం మొదలయ్యేది మేకప్‌తోనే! ఒకమ్మాయిలోని వివిధ కోణాలను చూపించాలన్నా, అందాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ బయటకు తేవాలన్నా మేకప్‌ది ప్రధాన పాత్ర కదా... దీనికి సంబంధించి ఏదైనా చేస్తే అన్న ఆలోచన వచ్చింది’ అంటారు ఆష్కా. తన ఆలోచనను స్నేహితులు ప్రియాంక్‌, అశుతోష్‌లతో పంచుకుంటే వాళ్లూ చేయి కలిపారు. అలా 2018లో తన ఇంట్లో హాల్‌లో ‘రెనీ కాస్మెటిక్స్‌’ ప్రారంభమైంది. బాగా పరిశోధన చేశాక 2020లో తన తొలి ఉత్పత్తి ‘ఐ లాషెస్‌’ని మార్కెట్‌లోకి ప్రవేశపెడితే విజయవంతమైంది. ఆపై తీసుకొచ్చిన 5 ఇన్‌ 1, పీహెచ్‌ లిప్‌స్టిక్‌లకీ ఆదరణ వచ్చింది. ‘సహజ లుక్‌నివ్వాలి. ఖర్చు తక్కువ, తీసుకెళ్లేందుకూ అనువుగా ఉండాలి... పరిశోధనలో నేను కనుక్కున్న విషయాలివి. ఇంకా జంతు అవశేషాలు, పారాబెన్స్‌ లేనివాటికి ప్రాధాన్యమిచ్చాం. యువతను మా వీగన్‌ ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి’ అనే ఆష్కా 200కుపైగా రకాలను తీసుకొచ్చారు. ఈకామర్స్‌ వేదికలతోపాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ అమ్మకాలు నిర్వహిస్తున్నారు. సంస్థ డైరెక్టరే కాదు, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా తన ఆలోచనలతో పెట్టుబడులను ఆకర్షించారు. సంస్థను రూ.830 కోట్లకు చేర్చారు. ‘నాపై నాకు నమ్మకం ఉంది కాబట్టే, కెరియర్‌ని పక్కనపెట్టా. సంస్థను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నా’ అంటోన్న ఆష్కాను చూసి మనం స్ఫూర్తి చెందాల్సిందీ ఎక్కువే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్