సామాన్యులకూ సీపీఆర్‌ తెలియాలి!

డాక్టర్ని దేవుడితో సమానంగా భావిస్తాం. కానీ ఈ దేవుడు కూడా ఆసుపత్రికి వెళ్తేనే కదా దర్శనమిచ్చేది! మృత్యువుతో పోరాడుతున్న ఓ బిడ్డని రోడ్డుమీదే పడుకోబెట్టి సీపీఆర్‌ చేసి, ప్రాణదానం చేశారు డాక్టర్‌ నన్నపనేని రవళి. వసుంధరతో మాట్లాడుతూ... ‘ఈ గొప్పతనం నాది కాదు, సీపీఆర్‌దే.

Published : 18 May 2024 13:47 IST

డాక్టర్ని దేవుడితో సమానంగా భావిస్తాం. కానీ ఈ దేవుడు కూడా ఆసుపత్రికి వెళ్తేనే కదా దర్శనమిచ్చేది! మృత్యువుతో పోరాడుతున్న ఓ బిడ్డని రోడ్డుమీదే పడుకోబెట్టి సీపీఆర్‌ చేసి, ప్రాణదానం చేశారు డాక్టర్‌ నన్నపనేని రవళి. వసుంధరతో మాట్లాడుతూ... ‘ఈ గొప్పతనం నాది కాదు, సీపీఆర్‌దే. సామాన్యులకూ దీనిపై అవగాహన రావాల’ంటారీ గుంటూరు డాక్టరమ్మ...

ఆరేళ్ల పసివాడు. అనుకోకుండా విద్యుత్‌ వైర్లని తాకి ప్రమాదానికి గురయ్యాడు. వాళ్ల అమ్మానాన్నలు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా... పరిస్థితి తెలుసుకుని అత్యవసరంగా సీపీఆర్‌ ఇచ్చా. ఆ బాబు ఇప్పుడు కోలుకున్నాడు. సీపీఆర్‌ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్‌. ఏదైనా కారణంతో హార్ట్‌ఎటాక్‌కి గురైనప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి, తగిన చికిత్స అందించేలోపు చేసే అత్యవసర వైద్య సేవ ఇది. రోగిపాలిట సంజీవని. దీన్ని ఎంత వేగంగా చేస్తే, రోగి అంత త్వరగా కోలుకొంటాడు. సాధారణంగా 70 శాతం హార్ట్‌ఎటాక్‌లు ఇంట్లో ఉన్నప్పుడే సంభవిస్తాయి. అలాంటి సమయంలో ఆత్మీయులని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు అందించాల్సిన ఈ వైద్య సేవపై మనందరికీ అవగాహన ఉండాలి కదా? ఒక వేళ కరెంట్‌ షాక్‌ కొట్టి హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందనుకోండి.. ముందుగా విద్యుదాఘాతానికి కారణమైన ఆ వస్తువు నుంచి వేరుచేయాలి. అలా చేసేటప్పుడు విద్యుత్‌ ప్రవహించని చెక్కలాంటి వస్తువులని మాత్రమే వాడాలి. పల్స్‌ చెక్‌ చేయాలి. ఆ తర్వాత ఛాతీపై ఒత్తిడి తీసుకురావడాన్ని కంప్రెషన్స్‌ అంటాం. ఒత్తిడి తీసుకొస్తూ, మధ్యమధ్యలో శ్వాస అందించాలి. ఇవన్నీ మాకెలా తెలుస్తాయి? అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో సామాన్యులకు కూడా ఈ సీపీఆర్‌పై అవగాహన తెస్తూ అనేక సంస్థలు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. వాటికి హాజరైతే మన ఆత్మీయులని బతికించుకొనే ఛాన్సెస్‌ ఎక్కువ ఉన్నాయి. వాస్తవానికి నేను గైనకాలజిస్ట్‌ని. గర్భిణులకూ బీపీ వంటి కారణాలతో హార్ట్‌ఎటాక్‌ వచ్చే అవకాశం ఉంది. ముప్ఫై నుంచి నలభైమందికి ఈ సీపీఆర్‌ సేవల్ని అందించా. అలా వారికి సీపీఆర్‌ చేసినప్పుడల్లా, ఈ విషయంలో సామాన్యులకూ అవగాహన రావాలని చాలాసార్లు అనుకున్నా. ఈ బాబుకి సీపీఆర్‌ ఇస్తున్న సమయంలో మా అమ్మ అనుకోకుండా ఒక వీడియో తీసి... తరవాత దానిని డిలీట్‌ చేశారు. ఈ విషయం నాతో చెబితే నాకో ఆలోచన వచ్చింది. ఈ వీడియోని పోస్ట్‌ చేస్తే అందరికీ అవగాహన వస్తుంది కదా అనిపించి... డిలీట్‌ చేసిన దాన్ని, రీస్టోర్‌ చేసి పోస్ట్‌ చేశా. క్షణాల్లో వైరల్‌ అయ్యింది. నిజానికి నేను మహిళలకు అవసరం అయిన సమాచారం... నెలసరులు, వాక్సినేషన్లు, థైరాయిడ్‌ వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటా. వాటికీ మంచి స్పందనే వస్తోంది. భవిష్యత్తులో సీపీఆర్‌పైనా శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నా. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్