నాట్య‘మయూరి’ కావాలని!

విధి ఆ అమ్మాయికి ఒకసారి కాదు రెండు సార్లు సవాల్‌ విసిరింది. వైకల్యంతో కుప్పకూలుతుందనుకున్న ఆ అమ్మాయి నాట్యంతో నిలబడింది. కాళ్లలో సత్తువ లేకున్నా... పట్టుదలతో కూచిపూడి నేర్చుకుని యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందిఅంజనశ్రీ.

Published : 19 May 2024 01:32 IST

విధి ఆ అమ్మాయికి ఒకసారి కాదు రెండు సార్లు సవాల్‌ విసిరింది. వైకల్యంతో కుప్పకూలుతుందనుకున్న ఆ అమ్మాయి నాట్యంతో నిలబడింది. కాళ్లలో సత్తువ లేకున్నా... పట్టుదలతో కూచిపూడి నేర్చుకుని యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది అంజనశ్రీ.

నాలుగేళ్ల వయసులో స్కూల్‌ బస్సు ఢీకొట్టింది అంజనశ్రీని. దాంతో ఎడమకాలిని పోగొట్టుకుంది. ఆ పాప కూడగట్టుకున్న ధైర్యాన్ని దెబ్బతీస్తున్నట్టుగా మళ్లీ కొన్నాళ్లకి రోడ్డు ప్రమాదం. ఈసారి మరోకాలికి. దాంతో కాళ్లలో రాడ్‌లు వేశారు. ఈ పరిస్థితుల్లో మరొక అమ్మాయి అయితే తన తలరాతని తనే తిట్టుకునేది. కానీ అంజన అలా కాదు... ‘మయూరి’ సుధాచంద్రన్‌ని స్ఫూర్తిగా తీసుకుంది.

ఆమెలానే వైకల్యాన్ని ఎదిరించి నాట్యంపై దృష్టి పెట్టింది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలంలోని రామాజిపేట అంజనశ్రీది. నాన్న నాగరాజు, అమ్మ గౌతమి. అంజన ప్రస్తుతం రాయికల్‌లో ఆరోతరగతి చదువుతోంది. అందరిలా తాను నడవలేనని తెలిసినా తనకిష్టమైన నృత్యాన్ని వదులుకోవాలని అనుకోలేదు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో కృత్రిమ కాలు పెట్టించుకుని, గురువు దేవదాస్‌ వద్ద కూచిపూడి నేర్చుకుంది. మొదట్లో ఇబ్బంది అనిపించినా, తన ఇష్టమే ఆ కష్టాన్ని జయించేలా చేసింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి 50 నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. అవార్డులూ అందుకుంది. అంజన గురించి తెలుసుకున్న సుధాచంద్రన్‌ స్వయంగా వీడియోకాల్‌లో పలకరించి అభినందించారు. అయితే అంజన నాట్యానికి ఆర్థిక పరిస్థితులే ఆటంకంగా మారాయి. ఆమె ఎత్తు పెరుగుతున్న కొద్దీ రెండేళ్లకొకసారి కాలు మార్చాల్సి ఉంటుంది. ఈ ఏడాది కాలు మార్చాలంటే రూ.2.10 లక్షలు అవసరం అవుతాయి. ప్రభుత్వం, దాతలు స్పందిస్తే నాట్యమయూరిగా మారతానంటోంది అంజన.
- బి.శ్రీనివాస్, రాయికల్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్