ఆ నరకం నుంచి బయటపడ్డాం..!

కొన్ని కథలను తెరపై చూసినప్పుడు మరీ సినిమాటిక్‌గా చూపించారనుకుంటాం. కేజీఎఫ్‌ సినిమాని చూసినప్పుడు నిజమేనా అనుకున్నవాళ్లూ ఎక్కువే. కానీ అలా వెట్టి చాకిరీ చేయించుకునే ఊళ్లు నిజంగానే ఉన్నాయి. ఇందుకు ఈ ‘మంజుల’ కథ ప్రత్యక్ష నిదర్శనం.

Published : 22 May 2024 01:37 IST

కొన్ని కథలను తెరపై చూసినప్పుడు మరీ సినిమాటిక్‌గా చూపించారనుకుంటాం. కేజీఎఫ్‌ సినిమాని చూసినప్పుడు నిజమేనా అనుకున్నవాళ్లూ ఎక్కువే. కానీ అలా వెట్టి చాకిరీ చేయించుకునే ఊళ్లు నిజంగానే ఉన్నాయి. ఇందుకు ఈ ‘మంజుల’ కథ ప్రత్యక్ష నిదర్శనం. పెట్రోలు పోసి చంపాలనుకున్న రౌడీల బారి నుంచి పిల్లలతో తప్పించుకున్న ఆమెను ‘వసుంధర పలకరించింది.

‘మాది మహిద్‌నగర్‌ (మహబూబ్‌నగర్‌). నాయన నరసప్ప, అమ్మ రాములమ్మ కూలీలు. మేం ఆరుమంది పిల్లలం. నాకు 12 ఏండ్లకే శీనుతో పెండ్లైంది. ఎనిమిదేళ్లలో నలుగురు ఆడపిల్లలు పుట్టిండ్రు. వాళ్లను అమ్మ దగ్గరుంచి మా ఇంటాయనతో కలిసి కూలికెళ్తుండె. అప్పుడందరం సంతోషంగా ఉండేవాళ్లం. పిల్లల్నీ బాగా చదివించాలనుకున్నాం. అయిదో కాన్పులో కొడుకు పుట్టిండు. తర్వాత పిల్లలు పుట్టకుండా గొడ్డు ఆపరేషన్‌ చేయించుకున్నా.

నరకమది...

కోలార్‌లో తేకల్‌ నుంచి తెలిసినోళ్లు వేరే కాడ ఉన్న మాకు ఫోన్‌ చేసిండ్రు. ఫలానాకాడ పని ఉంది, రాండిరా అన్నరు. స్కూల్‌లో ఏసిన ముగ్గురాడపిల్లలను అమ్మ కాడ వదిలేసినా. చివరి పిల్ల, పిలగాడితో గాడికెళ్లాం. అక్కడి నుంచి ఒక ఊరికి తోలుకెళ్లిండ్రు. మాలాగే అక్కడ ఇంకా మంది ఉన్నారు. మాకు లైటు కూడా లేని షెడ్డు ఇచ్చారు. రేషన్‌కార్డు ఇప్పిస్తామని తెల్లకాగితంపై వేలు ముద్ర ఏయించుకున్నారు. ఎట్టిచాకిరీకని మాకు తెలవదు. ఉదయమే చంటి పిల్లలతో వెళ్లి రాళ్లు, కంకర కొట్టేటోళ్లం. తినడానికి నెత్తికొక టొమాటో అన్నం ప్లేటు తీసిస్తుండె. రాత్రికి వాళ్లిచ్చే నూకలు వండి తింటుండె. చిన్నపిల్లలకీ ఇదే. రోగమొస్తే మాత్ర ఇస్తుండె. నాకు, మా ఆయనకి కలిపి వారానికి రూ.400. కూలీకి పోతుంటిమి, వస్తుంటిమి. అక్కడికెళ్లిన కొన్నాళ్లకు జరం, వాంతులయ్యేవి. కడుపులో గడ్డ వచ్చిందనుకున్నా. సేటుకాడ 2వేలు అప్పు తీసుకుని ఆసుపత్రిలో స్కానింగ్‌ తీపిచ్చుకున్నా. పిల్లలొద్దని చేయించుకున్న ఆపరేషన్‌ ఫెయిల్‌ అయ్యింది, ప్రెగ్నెంట్‌ అన్నారు. పిల్లలొద్దని ఏడ్చినా. అపాయమన్నారు డాక్టరు. మళ్లా మగపిల్లాడు పుట్టిండు. బాలింతగానే పనిలోకెళ్లాలి. లేదంటే ఆ రోజుకి బువ్వ ఉండదు. అప్పు అడిగితే కొడుతుండె. పైన 100 రూ.ఇమ్మంటే తిట్టేటోళ్లు. మా ఆయనకి కీళ్ల వాపులొచ్చాయి, జ్వరమొచ్చింది. ఊరెళతామంటే కొట్టి, మాకు కాపలా పెట్టిండ్రు. పెద్ద పిల్లగానికి నుమోనియా వచ్చి బతకడంటే గుబులైంది. ఆ కష్టం దేవునికే ఎరుక. నరకం నుంచి పిల్లగాండ్లతో బయటపడాలనుకున్నాం. వాసుదేవరావు అనే తెలిసిన ఒకాయన యాద్‌కొచ్చారు. ఎవరికీ ఎరుకగాకుండా ఫోన్‌ చేయించాం. మా గురించి చెప్పి ఎలాగైనా తోలుకుపొమ్మని చెప్పాం. లేదంటే మా పాణాలు పోతాయన్నాం. ఆ సారు మాకోసం పోలీసుల్ని తోలుకొచ్చిండ్రు. రౌడీలు మాపై రాళ్లు యిసిరారు. మా మీన గాస్‌నూనె పోసి అంటిపెట్టనీకి కూడా వచ్చిండ్రు. పోలీసుబండి ఎక్కితే తగలబెడతామని బెదిరిచ్చిండ్రు. ఏం చేయాలో తెనీక పిల్లగాండ్ల నెత్తుకొని పరుగెట్టి, మా ఆయన నేను వ్యాను ఎక్కినాం. బయటపడగలమా అనుకున్నా. గుప్పెట్లో పాణాలు పెట్టుకొన్నాం. పోలీసోళ్లు విడవకుండా మమ్మల్ని ఊరుదాటిచ్చిండ్రు. ఆ నరకం నుంచి బయటపడి మళ్లీ జన్మెత్తినాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్