ఇక చూడలేననుకున్నా..!

ఆకాశాన్ని తాకుతూ... వెండికొండలా మెరిసిపోతూ... పర్వత ప్రియుల్ని ఆకట్టుకునే... ఎవరెస్టుని ఎక్కేయాలనేది చాలామంది కల. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమతో సాధ్యమయ్యే ఈ సాహస యాత్రను నేపాల్‌కి చెందిన ఫొటో జర్నలిస్టు పూర్ణిమ శ్రేష్ఠ రెండువారాల్లోనే మూడు సార్లు పూర్తి చేశారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు.

Published : 27 May 2024 01:46 IST

ఆకాశాన్ని తాకుతూ... వెండికొండలా మెరిసిపోతూ... పర్వత ప్రియుల్ని ఆకట్టుకునే... ఎవరెస్టుని ఎక్కేయాలనేది చాలామంది కల. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమతో సాధ్యమయ్యే ఈ సాహస యాత్రను నేపాల్‌కి చెందిన ఫొటో జర్నలిస్టు పూర్ణిమ శ్రేష్ఠ రెండువారాల్లోనే మూడు సార్లు పూర్తి చేశారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు.

సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలంటే... వేల మీటర్ల పొడవునా ప్రతికూల పరిస్థితుల్ని దాటగలిగే శారీరక దార్ఢ్యం, ప్రాణాలను సైతం పణంగా పెట్టగలిగే తెగువ కావాలి. అలాంటిది పూర్ణిమ రెండు వారాల్లో మూడు సార్లు చకచకా ఎక్కేశారు. అలాగని చాలామందిలా ఏళ్ల తరబడి దీనికోసం సన్నద్ధమయ్యారనుకుంటే పొరపాటే. 2017లో మొదటిసారి మౌంటనీరింగ్‌పై ఆసక్తి పెంచుకుని క్రమంగా తన సత్తా చాటుకున్నారు. పర్వతదేశమైన నేపాల్‌లోని గండకీ ప్రావిన్స్‌లో ఆరుఘాట్‌ ఆమె స్వస్థలం. ప్రపంచంలోని 8వ ఎత్తైన పర్వతం మనస్లూ అంచులో ఉంటుందీ ఊరు. అయినా పూర్ణిమ ఎప్పుడూ పర్వతారోహకురాలు కావాలని అనుకోలేదట. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన తాను జీవితంలో ఏదైనా గొప్పగా సాధించి కుటుంబానికి పేరు తేవాలని భావించేవారు. చదువయ్యాక ఫొటో జర్నలిస్టుగా కెరియర్‌ని ప్రారంభించిన ఆమె... ఆ దేశానికి చెందిన కారోబార్‌ నేషనల్‌ డైలీతో పనిచేస్తున్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌కీ సహకారం అందిస్తున్నారు.

అదే మలుపు...

పూర్ణిమ విధినిర్వహణలో భాగంగా 2017లో ఓ రోజు ఎవరెస్ట్‌ మారథాన్‌ ఫొటోలు తీసుకోవడానికని బేస్‌ క్యాంప్‌ వరకూ వెళ్లారు. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. అక్కడికి వచ్చిన కొందరు సాహసయాత్రికులు, గైడ్‌లను కలుసుకుని మాట్లాడటంతో మౌంటనీరింగ్‌ చేయాలన్న కుతూహలం ఆమెలో మొదలైంది. అలా మనస్లూ పర్వతం ఎక్కడంతో తన సాహసయాత్ర ప్రారంభమైంది. నిజానికి తొలిగా ఎవరెస్ట్‌ ఎక్కాలన్నదే పూర్ణిమ ఆలోచన. అయితే, కొందరు మొదట చిన్న పర్వతాన్ని ఎంచుకోమని సూచించడంతో మనస్లూ పైకి దారి మళ్లింది. ఈ విజయం మరింత ఉత్సాహాన్నివ్వడమే కాదు లక్ష్యాలనూ నిర్దేశించింది అంటారామె. ఆపై 2018లో ఎవరెస్ట్‌ని ఎక్కేశారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఆ శిఖరాన్ని అధిరోహించే ముందు పూర్ణిమ ‘స్మైలింగ్‌ నేపాలీ విమెన్‌’ అనే థీమ్‌తో సోలో ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఇందులో ఎవరెస్ట్‌ ప్రాంతంలోని వివిధ రంగాలకు చెందిన 25 మంది నేపాలీ మహిళల పోర్ట్రెయిట్‌లు ఉన్నాయి. తరవాత అమాడబ్లమ్‌ శిఖరంతో పాటు అన్నపూర్ణ, ధవళగిరి, కాంచన్‌గంగా, లోత్సే, మకాలు, కే2 పర్వతాలనూ అధిరోహించారు. వాటిల్లో అన్నపూర్ణ శిఖరాన్ని 2021లో మరో ఆరుగురు మహిళలతో కలిసి ఎక్కారు. అదే ఏడాది పసాంగ్‌ ల్హము షెర్పా అకితాతో కలిసి ప్రపంచంలో ఏడవ ఎత్తైన పర్వతం ధవళగిరిని విజయవంతంగా అధిరోహించారు. ఈ ఘనత సాధించిన మొదటి మహిళలుగా వీరిద్దరూ గుర్తింపునీ అందుకున్నారు. తాజాగా ఎవరెస్ట్‌ని ఒకే సీజన్‌లో వరసగా అంటే మే 12న మొదటిసారి, మే 19న రెండోసారి, మే 25న మూడోసారి ఎక్కేశారు. మొత్తంగా ఈ శిఖరంపైకి నాలుగు సార్లు చేరుకుని చరిత్ర సృష్టించారు.

తిరిగి వచ్చే అవకాశం యాభైశాతమే!  

సాహసాలతో సావాసం చేయడం ఫొటో జర్నలిస్టుగా పూర్ణిమకు కొత్తేం కాదు. కానీ, పర్వతారోహణలో ఎదురైన సవాళ్లు మాత్రం కాస్త భిన్నం. మొదటిసారి ఎవరెస్ట్‌ ఎక్కినప్పుడే... శిఖరాన్ని చేరుకోగలగడం, సురక్షితంగా తిరిగి రావడానికి అవకాశం యాభైశాతమే అని అర్థం చేసుకున్నారామె. ‘పర్వతారోహణ చేసేటప్పుడు మన ఉత్సాహం, సంకల్పం, ఆక్సిజన్, ఆహారం... ఏవి తగ్గినా సరే, పైకి వెళ్లడం కంటే దిగడం కష్టం. ఓసారి ఆక్సిజన్, ఫుడ్, నీళ్లూ అయిపోయాయి. కానీ, నిబ్బరంగా ముందడుగు వేస్తున్నా. అకస్మాత్తుగా నాకు కళ్లు కనిపించడం లేదు. అద్దాలపై మంచు ఏమైనా పడి ఉంటుందేమో అనుకున్నా. కానీ, ఆపై ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయే సరికి నాతో వచ్చిన షెర్పా బేస్‌క్యాంప్‌కి చేర్చారు. తరవాతే తెలిసింది. అతినీల లోహిత కిరణాల తాకిడి వల్ల నేను తాత్కాలికంగా స్నో బ్లైండ్‌నెస్‌కి గురయ్యానని వైద్యులు చెప్పారు. ఆ క్షణం ప్రాణాలే పోతాయనుకున్నారట’ అని గుర్తుచేసుకుంటారామె. కానీ, ఆ సంఘటన తనలో భయాన్ని కాకుండా, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనీ, భవిష్యత్తులో మరెన్నో కఠిన సవాళ్లు ఎదుర్కొనే స్ఫూర్తినిచ్చిందనీ చెబుతారు పూర్ణిమ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్